దివ్య జనని.. దయాస్వరూపిణి

కోల్‌కతా సమీపంలోని ఆ ఊరు కరవుకాటకాలతో విలవిల్లాడుతోంది. గ్రామస్థుల ఆకలి బాధలు చూసి పల్లెలోని రామచంద్రముఖర్జీ, శ్యామసుందరీదేవి దంపతులు చలించిపోయారు. రామభక్తులైన వాళ్లిద్దరూ తమకు పండిన ధాన్యంతో అన్నార్తులకు భోజన ఏర్పాట్లు చేశారు.

Updated : 21 Dec 2023 04:23 IST

డిసెంబరు 22 శారదాదేవి జయంతి

కోల్‌కతా సమీపంలోని ఆ ఊరు కరవుకాటకాలతో విలవిల్లాడుతోంది. గ్రామస్థుల ఆకలి బాధలు చూసి పల్లెలోని రామచంద్రముఖర్జీ, శ్యామసుందరీదేవి దంపతులు చలించిపోయారు. రామభక్తులైన వాళ్లిద్దరూ తమకు పండిన ధాన్యంతో అన్నార్తులకు భోజన ఏర్పాట్లు చేశారు. వేడివేడిగా పులగం వండి కుటుంబసభ్యులతో కలసి వడ్డించసాగారు. గ్రామస్థులు ఆవురావురుమంటూ విస్తళ్ల వద్దకు వచ్చారు. ఆకలితో నకనకలాడుతూ ఉండటంతో పులగం వడ్డించిన వెంటనే గబగబా తినబోయారు. కానీ అది చాలా వేడిగా ఉండటంతో తినటం ఇబ్బందిగా ఉంది. వాళ్ల పరిస్థితిని రామచంద్ర పదేళ్ల కూతురు దూరం నుంచి గమనించింది. పరుగున లోనికెళ్లి విసనకర్ర తెచ్చి, పదార్థాలు చల్లబడేందుకు విసరసాగింది. అది చూసి అంతా ఉద్విగ్నతకు లోనయ్యారు. చిన్ననాటి నుంచే ఇలా తన మాతృహృదయాన్ని, కరుణాంతరంగాన్ని ఆవిష్కరించిన ఆ దయామయి మరెవరో కాదు.. రామకృష్ణపరమహంస ధర్మపత్ని, రామకృష్ణ సంఘజనని అయిన శారదాదేవి. పరుల కష్టాన్ని తన కష్టంగా భావించి, పరితపించే సానుభూతి ఆధ్యాత్మిక జీవనానికి ప్రథమ అర్హత అని పసివయసులోనే నిరూపించారామె. తదనంతర కాలంలో ఆమె అన్నపూర్ణాదేవి అయ్యారు. పరమహంస శిష్యుల క్షుద్బాధనే కాదు, ఆధ్యాత్మిక పిపాసను కూడా తీర్చారు. స్థాయీ భేదం లేకుండా అందరూ శారదాదేవి మాతృప్రేమను ఆస్వాదించినవారే! ఎందరో విదేశీయులు కూడా ఆ ప్రేమమూర్తికి ప్రియశిష్యులయ్యారు. ఎవరు తనను ఆశ్రయించినా ‘నీకొక అమ్మ ఉందని గుర్తుంచుకో! అమ్మను నేనుండగా.. ఇక భయమెందుకు? మంచివాళ్లే కాదు, తెలిసీ తెలియక చెడు నడత నడిచినవాళ్లు కూడా నా బిడ్డలే. పిల్లవాడు బట్టల్ని మురికి చేసుకుంటే.. తల్లి ఈసడించి దూరం పెడుతుందా?’ అంటూ అమిత ఆదరణతో అందరికీ సాంత్వననిచ్చేవారు. అందుకే రామకృష్ణ పరమహంస ప్రత్యక్ష శిష్యుడు స్వామి అభేదానంద శారదాదేవిని.. 

దేవీం ప్రసన్నాం ప్రణతార్తి హంత్రీం
యోగీంద్రపూజ్యాం యుగధర్మపాత్రీం
తాం శారదాం భక్తి విజ్ఞానదాత్రీం
దయాస్వరూపాం ప్రణమామి నిత్యం

‘శరణన్న ఆర్తుల దుఃఖాలను ఉపశమింపజేసే తల్లి, యోగీంద్రుడైన రామకృష్ణులతో పూజలందుకున్న జగజ్జనని, యుగధర్మాన్ని ఆవిష్కరించిన తల్లి, భక్తి విజ్ఞానాలను ప్రసాదించే  దయాస్వరూపిణి అయిన శారదాదేవికి నిత్యం నమస్కరిస్తున్నాను’ అంటూ కీర్తించారు.

ప్రహ్లాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని