సింహం హృదయంపై ధ్యానం!

స్వామి వివేకానంద అమెరికాలో ఓ సత్సంగంలో పాల్గొన్నారు. అక్కడ హాజరైన పాశ్చాత్య ఆధ్యాత్మిక జిజ్ఞాసువులను ఉద్దేశించి ‘మీరు రోజూ ధ్యానం చేస్తారా?’ అనడిగారు. కొందరు చేస్తామని చెప్పగా.. ఎలా ధ్యానం చేస్తారని మళ్లీ ప్రశ్నించారు.

Published : 11 Jan 2024 00:11 IST

జనవరి 12 స్వామి వివేకానంద జయంతి

స్వామి వివేకానంద అమెరికాలో ఓ సత్సంగంలో పాల్గొన్నారు. అక్కడ హాజరైన పాశ్చాత్య ఆధ్యాత్మిక జిజ్ఞాసువులను ఉద్దేశించి ‘మీరు రోజూ ధ్యానం చేస్తారా?’ అనడిగారు. కొందరు చేస్తామని చెప్పగా.. ఎలా ధ్యానం చేస్తారని మళ్లీ ప్రశ్నించారు. కొందరు తమ హృదయంపై, మరికొందరు జ్యోతిపై, ఇంకొందరు ఇష్టదైవంపై- మనసు లగ్నం చేస్తామంటూ ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం చెప్పారు. అప్పుడు వివేకానంద ‘మీరు మీ హృదయంపై లగ్నం చేసినట్లే నేను సింహం హృదయంపై ధ్యానం చేస్తాను. అది నాకు అమిత శక్తినిస్తుంది’ అన్నారు. ఆ ధ్యాన ఫలితమేనేమో ఆయన ఈ లోకంలో భౌతికంగా ఉన్నది ముప్పై తొమ్మిదేళ్లే అయినా సింహంలా జీవించారు. అనన్య సామాన్యమైన ఆధ్యాత్మిక గర్జన చేశారు. అగ్నితూటాల్లాంటి తన ప్రసంగాలతో ప్రపంచాన్ని జాగృతం చేశారు. ముఖ్యంగా యువతరాన్ని తనలా సింహం హృదయంపై ధ్యానం చేయమని, దానిలా ధైర్యంగా ముందుకు సాగమని పిలుపునిచ్చారు. ‘మోడుల్లా, మొండిగోడల్లా, చిలుము పట్టిన యంత్రాల్లా ఎన్నాళ్లని జీవిస్తారు? అలా కాకుండా మహోన్నతమైన కార్యాలు చేపట్టి కరదీపికల్లా వెలగండి’ అని మేల్కొలిపారు. అంతే కాకుండా ‘పరస్పరం సహకరించుకొనే, ఒకరిలోని మంచిని మరొకరు గ్రహించుకొనే, ఒకరిని మరొకరు మనస్ఫూర్తిగా అభినందించు కునే వ్యవస్థ అవసరం’ అన్నారు స్వామీజీ. ‘కానీ మన జాతీయస్వభావమంతా పసిపిల్లల మాదిరి ఇతరుల మీద ఆధారపడి ఉండటమే. ఆహారం తెచ్చి నోటికి అందిస్తే అనుభవించటానికి అందరూ సిద్ధమే. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోలేకపోతే మీరు బతికి ఉండటానికి అనర్హులు’ అని హెచ్చరించారు.

ప్రేమతో పనుల్ని సాధించుకోండి: స్వామి వివేకానంద ధీరత్వానికి, ధైర్యానికి ప్రతీక. సింహాన్ని పోలిన గాంభీర్యానికి నిదర్శనం. కానీ మానవ సంబంధాల్లో ప్రేమ, సౌమ్యతలకే అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అందుకే వారు విదేశాల్లో ఓ ప్రసంగంలో ‘నేను నా నిశితమైన మేధతో కన్నా ప్రేమపూర్వక హృదయంతోనే ఎక్కువ సాధించాను’ అన్నారు. స్వామీజీ ఇతరుల దోషాలనూ, బలహీనతలనూ ఎంచేవారు కాదు. ఎదుటివారిలో ఏ కొంచెం మంచితనం ఉన్నా.. దాన్ని ప్రోత్సహించేవారు. వారిలో నిగూఢంగా ఉన్న శక్తులను వెలికితీసేందుకు అవసరమైన వాతావరణాన్ని, అనుకూలతలను కలుగజేసేవారు. అలాగే ఆయన తరచూ ‘సిర్‌ దార్‌ సర్‌ దార్‌’ (బెంగాలీ సామెత) అనేవారు. శిరస్సును ఇచ్చేవాడు, ఇతరుల కోసం మరణించటానికి కూడా సిద్ధపడేవాడే నిజమైన నాయకుడని భావం.

విదేశాలపై విశేష ప్రశంసలు: భారతావని ముద్దుబిడ్డగా, ఈ నేల ఖ్యాతిని నాలుగు దిక్కులా చాటిచెప్పారు వివేకానంద. అలాగే విదేశాల్లోని ఘనతను కూడా ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. పరమాత్మ శక్తి పాశ్చాత్య దేశాల్లోనూ వ్యాపిస్తుందని ప్రస్ఫుటం చేశారు. ఆ భావనతోనే ‘విశ్వమంతా ఒకే మహాశక్తి దివ్యప్రేమను దర్శించాను. మన పూర్వీకులు ఆ శక్తిని మతంలోనూ, వేదాంతంలోనూ వ్యక్తపరిచేవారు. అదే శక్తిని పాశ్చాత్యులు ఈ నవనాగరిక కాలంలో చురుకైన కారË్యదక్షతతో వ్యక్తపరుస్తున్నారు. ఆ మహాశక్తే విశ్వమంతా వ్యాపిస్తోంది’ అన్నారు ఓ ప్రసంగంలో! ఒకసారి ఓ యువ బృందంతో ‘పాశ్చాత్యులు ఏదైనా ఒక విషయం సత్యమని విశ్వసిస్తే దాని గురించి కలలు కంటూ కూర్చోరు. వెంటనే ఆచరణలో పెడతారు. అదే వారి సామర్థ్యం, ప్రత్యేకత’ అన్నారు.

ఆ నాలుగే ముఖ్యం: జీవితం ఎప్పుడు ప్రశాంతంగా సాగుతుందని ఓ శిష్యుడు అడిగితే.. స్వామీజీ నవ్వుతూ ‘నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన మాటలు నాలుగున్నాయి. అవి అభయం, అహింస, అసంగత్వం, ఆనందం. ఎప్పుడూ దేనికీ భయపడకూడదు. మాటల ద్వారా మానసిక హింసకు, చేతల ద్వారా శారీరక హింసకు పాల్పడకూడదు. దేనితోనూ, ఎవరితోనూ బంధాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడూ ఆనందాన్ని వదలకూడదు’ అంటూ వివరించారు. ఆ నాలుగు లక్షణాలకూ నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు స్వామీజీ.

ప్రహ్లాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని