లోభత్వంతో మోక్షమా?

ఒక వ్యాపారి ఓ సాధువును కలిసి ‘నేను ముక్తిని పొందాలంటే ఏం చేయాలో చెప్పండి స్వామీ?’ అనడిగాడు.

Updated : 18 Jan 2024 04:06 IST

క వ్యాపారి ఓ సాధువును కలిసి ‘నేను ముక్తిని పొందాలంటే ఏం చేయాలో చెప్పండి స్వామీ?’ అనడిగాడు. దానికాయన ‘మహాత్ములు చెప్పిన మార్గాన్ని అనుసరించాలి. అభాగ్యులకు దాన ధర్మాలు చేయాలి!’ అన్నాడు. పిసినారి అయిన ఆ వ్యాపారి ఎక్కువ ఖర్చుపెట్టేందుకు మనసొప్పక, రోజూ పిడికెడు బియ్యం దానం చేయడం ఆరంభించాడు. కొన్నాళ్లకు మళ్లీ సాధువు వద్దకు వెళ్లాడు. ‘నేను చెప్పినట్లు దాన ధర్మాలు చేస్తున్నావా?’ అంటూ ప్రశ్నించాడాయన. ‘అవును స్వామీ! రోజూ పిడికెడు బియ్యం ఇస్తున్నాను’ బదులిచ్చాడు వ్యాపారి. లోభి అంతరంగం స్వామీజీకి అర్థమైంది. ఏమీ బదులివ్వకుండా.. పక్కనున్న చెట్టు మొదల్ని గోటితో గిల్లసాగాడు. అది చూసిన లోభి ‘స్వామీ! మీరేం మాట్లాడకుండా చెట్టును గిల్లుతున్నారు. మధ్యలో ఆకాశం వంక చూస్తున్నారు. నాకేమీ అర్థం కాలేదు’ అన్నాడు. ‘ఏం లేదయ్యా! నేనీ గోటితో చెట్టును నరుకుతున్నాను. నువ్వలా చూస్తుండు!’ అన్నాడు సాధువు. ఆ మాటలకు వ్యాపారి నవ్వి ‘అదేంటి స్వామీ! గోటితో చెట్టును నరుకుతున్నారా? గొడ్డలితో చేయాల్సిన పనిని గోటితో చేస్తే అయ్యే పనేనా?’ అంటూ వ్యంగ్యాస్త్రం విసిరాడు. అప్పుడా సాధుపుంగవుడు ‘పిడికెడు బియ్యంతో మోక్షం ఆశిస్తున్నావు. అదే సాధ్యమైతే, గోటితో చెట్టును నరకటం సాధ్యం కాదా ఏమిటి?!’ అంటూ ఎదురు ప్రశ్నించాడు. ఆ మాటలతో వ్యాపారి కళ్లు తెరుచుకున్నాయి. తన లోభత్వం, దురాశ తెలిసొచ్చాయి. సాధువుకు నమస్కరించి వచ్చేశాడు. అప్పటి నుంచి విరివిగా దానాలు చేయటం ప్రారంభించాడు. 

చక్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని