లక్ష్యసాధన ముఖ్యం

ఒకసారి దయానంద సరస్వతి శిష్యులను ఉద్దేశించి.. ‘మనలో కొందరు తాము చేసే పూజలతో భగవంతుడు సంతృప్తి చెందుతాడా, తమను ఆశీర్వదిస్తాడా- అంటూ సందేహిస్తుంటారు.

Updated : 18 Jan 2024 04:35 IST

కసారి దయానంద సరస్వతి శిష్యులను ఉద్దేశించి.. ‘మనలో కొందరు తాము చేసే పూజలతో భగవంతుడు సంతృప్తి చెందుతాడా, తమను ఆశీర్వదిస్తాడా- అంటూ సందేహిస్తుంటారు. అలా మనసులో ద్వైదీభావం వల్ల సాధనలను నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ భక్తి, యుక్తి, శాస్త్ర విషయాల్లో కొద్ది శక్తే ఉందని నిరాశ చెందాల్సిన పనిలేదు. హృదయపూర్వకంగా కొనసాగిస్తే.. ఫలితం అపారంగా ఉంటుంది. కేవలం ఏడు రోజుల తపస్సుతో భక్త ధ్రువుడు చిరస్థాయిగా నిలిచే కీర్తిని సాధించాడు. భక్తులు దృఢ చిత్తంతో చిరు సాధన చేసినా విష్ణుమూర్తి కనిపెట్టుకుని ఉంటాడు. భక్తిగా ఒక్క అడుగు మనం వేస్తే ఆయన అంతే ఆర్తిగా రెండడుగులు మన వైపు వేస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చూడండి.. లోకజ్ఞానం లేని ఓ వ్యక్తి పొరుగూరు వెళ్లేందుకు బయల్దేరాడు. లాంతరు పట్టుకుని నడుస్తూ ఏదో గుర్తొచ్చి.. అక్కడే ఆగిపోయి పెద్దగా ఏడవసాగాడు. అటుగా వచ్చిన సాధువు.. ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. దానికతను ‘నేను చేరాల్సిన ఊరు ఇంకా చాలా దూరం ఉంది. ఈ లాంతరులో నూనె అయిపోతే ఎలా? అందుకే ఏడుస్తున్నాను’ అన్నాడు. సాధువు నవ్వి ‘తర్వాత దీపం ఉండదని ఇప్పుడు ఏడుస్తూ ఆగిపోతే కాలం వృథా అవుతుంది, దూరం అలాగే ఉంటుంది. రాబోయే సమస్య గురించి ఆలోచించడం మానేసి.. ఇప్పుడు వేగంగా నడిస్తే.. గమ్యమే చేరొచ్చు. లేదంటే మరో బాటసారి దారి చూపొచ్చు. గరుత్మంతుడి వంటి బలశాలి అయినా రెక్క విదల్చకుంటే ఉన్నచోటే ఉండిపోతాడు. ఏ సౌకర్యాలూ లేని చీమలు మైళ్లు ప్రయాణిస్తాయని గుర్తుచేసుకో’ అంటూ హితవు పలికాడు. దాంతో ఆ కుర్రాడు తన తప్పు తెలుసుకుని ప్రయాణం సాగించాడు. లక్ష్యసాధనలో నిరుత్సాహం, ఆలస్యం పనికిరావని ఈ కథ తెలియజేస్తుంది’ అంటూ చెప్పారు.

పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని