కంచి గరుడ సేవ అని ఎందుకంటారు?

శ్రీ మహావిష్ణువుకు అనుంగు వాహనం గరుత్మంతుడు. వైనతేయుడు పరాక్రమంలో దిట్ట. ఆకాశంలో గరుడిని చూడటం, అతడి మాట వినడం గొప్ప అదృష్టంగా భావిస్తారు....

Updated : 12 Mar 2023 12:42 IST

శ్రీ మహావిష్ణువుకు అనుంగు వాహనం గరుత్మంతుడు. వైనతేయుడు పరాక్రమంలో దిట్ట. ఆకాశంలో గరుడిని చూడటం, అతడి మాట వినడం గొప్ప అదృష్టంగా భావిస్తారు భక్తులు. అందుకనే తిరుమల కోనేటిరాయుని బ్రహ్మోత్సవాల్లో గరుడవాహనంపై చిద్విలాసమూర్తి విహరిస్తుంటే దర్శించుకోవాలని కోట్లాది భక్తులు కోరుకుంటారు. అయితే ‘కంచి గరుడ సేవ’ అన్న జాతీయం ఆసక్తికరంగా ఉంటుంది. 108 దివ్యదేశాల్లో ఒకటైన పవిత్రమైన కంచిలో ఆ వైకుంఠనాథుడు శ్రీ వరదరాజ పెరుమాళ్‌గా భక్తులను అనుగ్రహిస్తుంటాడు. కంచిలో భారీ ఇత్తడి గరుడ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహంపైనే ఉత్సవమూర్తిని ఉంచి గరుడసేవ నిర్వహిస్తారు. దానిపై ఉండే స్వామి విగ్రహానికంటే గరుత్మంతుని వాహనం పెద్దదిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని సిద్ధం చేయడం కోసం ఈ ఇత్తడి గరుడ వాహనాన్ని కూడా శుభ్రం చేస్తారు. దాన్ని శుభ్రం చేసే క్రమంలో అలిసిపోతుంటారు. ‘ స్వామి వారి కోసం గరుడిని శుభ్రం చేస్తారు. ఇంత చేసినా ఈయనేమన్నా వరాలు ఇస్తాడా, అదేదో స్వామి వారికి చేస్తే మనకెంతో పుణ్యం కదా!’ అని వాపోతుంటారట. ఇదంతా కంచి గరుడ సేవరా నాయనా అని అనుకుంటారట. ఎప్పుడైనా మనం చేసిన పనులు వృథా అయినప్పుడు ఈ గరుడ సేవతో పోలుస్తూ ‘ కంచి గరుడ సేవ’ అనే జాతీయాన్ని వాడుతుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని