అసూయ.. అనసూయ!

అసూయకు అనసూయకు భేదమేమిటని అడిగాడో శిష్యుడు. దానికి పుట్టపర్తి సాయిబాబా ‘అసూయకు కాల, కారణాలతో నిమిత్తం లేదు.

Updated : 22 Feb 2024 16:05 IST

అసూయకు అనసూయకు భేదమేమిటని అడిగాడో శిష్యుడు. దానికి పుట్టపర్తి సాయిబాబా ‘అసూయకు కాల, కారణాలతో నిమిత్తం లేదు. దీనికి కామం, క్రోధం, లోభం అనే బిడ్డలు. వారే హిరణ్యకశిప.. హిరణ్యాక్షులు, రావణ.. కుంభకర్ణులు, శిశుపాల.. దంతవక్త్రులు. అలాగే అసూయ అనేది లేని అనసూయాదేవికి సహనం, ప్రేమ, సానుభూతి అనేవి సంతానం. వారే త్రిమూర్తి రూపాలు. కామంతో రావణాసురుడు తన వంశాన్నే పోగొట్టుకున్నాడు. ఆ కామానికి అహంకారం కూడా తోడైన హిరణ్యకశిపుడు నశించాడు. ద్వేషంతో దుర్యోధనుడు కురువంశ నాశనానికి కారణమయ్యాడు. అందుకే రామాయణం కామాన్ని వదలమంటుంది. భారతం లోభం కూడ దంటుంది. భాగవతం క్రోధం చేటని బోధిస్తుంది. పురాణ పురుషుల్లో ఒక్కొక్కరిలో ఒక్కో అవలక్షణం ఉంటేనే వారు అవమానం పొంది, కాలగర్భంలో కలిసిపోయారు. అలాంటిది ఈ మూడూ గూడు కట్టుకుని ఉంటే.. ఎంత దారుణం?! దీనికి తార్కాణమే లోకంలో ఎదురయ్యే దుస్సంఘటనలూ, దుష్పరిణామాలు. వీటిని నివారించాలంటే కామ, క్రోధ, లోభాలను వీడి సహనం, సానుభూతి, ప్రేమ వంటి లక్షణాలను అలవరచుకోవాల్సిఉంది. మనం అసూయా సంతతి కాకూడదు, అనసూయా సంతతి కావాలి’ అంటూ వివరించారు.

ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని