Watch: కారుకు టపాసులు చుట్టి.. నిప్పు పెట్టి.. హ్యాపీ దీపావళి అట!

దీపావళి సందర్భంగా స్విఫ్ట్‌ కారుకు అద్దం మినహా చుట్టూ టపాసులు చుట్టాడు. అనంతరం ‘హ్యాపీ దీపావళి’ అంటూ నిప్పు పెట్టాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

Updated : 25 Oct 2022 15:22 IST

Photo Source: అమిత్‌ శర్మ ట్విటర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూట్యూబ్‌లో వ్యూస్‌ కోసం పడరాని పాట్లు పడుతున్నారు యూట్యూబర్లు. అందరూ చేసేవి చేస్తే కిక్కేం ఉంది.. కాస్త కొత్తగా ప్రయత్నిస్తేనేగా వ్యూస్‌ వరదలా పారేది అంటున్నారు కొంతమంది. ఇదే సూత్రంతో ముందుకెళ్తున్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటాడు అమిత్‌ శర్మ. క్రేజీ ఎక్స్‌వైజడ్‌ (Crazy XYZ) పేరుతో ఇతగాడు ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నాడు. అలా అని అల్లాటప్పా ఛానెలేమీ కాదు.. ఇతగాడు చేసే క్రేజీ వీడియోలకు చాలా మందే ఫ్యాన్స్‌ ఉన్నారండోయ్‌. అందుకే ఈ ఛానెల్‌కు 2 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఛానెల్‌ పేరుకు తగ్గట్టే అమిత్‌ క్రేజీ వీడియోలు చేస్తుంటాడు. తాజాగా ఇతగాడు చేసిన అలాంటి వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

దీపావళి సందర్భంగా అమిత్‌ తన స్నేహితులతో కలిసి ఓ వీడియో చేశాడు. స్విఫ్ట్‌ కారుకు అద్దం మినహా చుట్టూ టపాసులు చుట్టాడు. కారు లోపలా, బయటా కెమెరాలు అమర్చాడు. అనంతరం ‘హ్యాపీ దీపావళి’ అంటూ నిప్పు పెట్టాడు. అంతే వరుసగా టపాకాయలు పేలడం మొదలు పెట్టాయి. అయితే, కారు లోపల మాత్రం టపాకాయలు పెట్టలేదు. ఈ వీడియోనంతా తీసి యూట్యూబ్‌లో పెట్టినప్పటికీ.. కారణమేంటో తెలీదు గానీ యూట్యూబ్‌లో మాత్రం ప్రస్తుతం ఈ వీడియో అందుబాటులో లేదు. దీనికి సంబంధించిన ఓ క్లిప్పింగ్‌ మాత్రం సోషల్‌ మీడియాలో తెగ సర్క్యులేట్‌ అవుతోంది. ఈ వీడియో చూసి కొందరు ‘క్రేజీ ఫెలో’ అంటూ ట్వీట్‌ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఈ యూట్యూబర్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని