పేరూ.. పైకం..బీపీఎం!

మంచి ఎత్తుండాలి.. కొలతలు సరిపోవాలి.. రంగు ఆకట్టుకోవాలి.. రూపం బాగుండాలి.. మోడలింగ్‌ చేయాలంటే ఎన్ని అర్హతలో! కుర్రాళ్లకైతే ఒడ్డూపొడవూ, కండలు తిరిగిన దేహం తప్పనిసరి.

Published : 18 Feb 2023 00:18 IST

బాలీవుడ్‌ ముద్దుగుమ్మలైనా.. హాలీవుడ్‌ సుందరాంగులైనా.. అత్యధికులు మోడలింగ్‌ మెరుపులతో వెలుగులోకి వచ్చినవాళ్లే. క్యాట్‌వాక్‌తో కనికట్టు చేసి సినీపెద్దల్ని ఆకట్టుకున్నవాళ్లే. అందుకే ఇది అత్యధిక ఆదరణ ఉన్న రంగం. ఇందులోనే ఇప్పుడు శరీరంలోని కొన్ని భాగాలనే ప్రదర్శిస్తూ పేరూ, పైకం సంపాదించే బాడీ పార్ట్స్‌ మోడలింగ్‌ (బీపీఎం) ఊపందుకుంటోంది.

* తెరపై మొహం కనిపించడం ఇష్టం లేనివాళ్లకు ఈ మోడలింగ్‌ బాగా నప్పుతుంది.
* శరీరంలో కొన్ని అవయవాలు అందంగా ఉన్నాయని భావించేవాళ్లూ ఇందులోకి దిగొచ్చు.
* పార్ట్‌టైం ఉద్యోగం చేయడానికి పనికొచ్చే రంగం.
* కెమెరా భయం ఉన్నవాళ్లు, మోడలింగ్‌లో అరంగేట్రం చేయాలనుకునేవాళ్లకి అనుకూలం.


మంచి ఎత్తుండాలి.. కొలతలు సరిపోవాలి.. రంగు ఆకట్టుకోవాలి.. రూపం బాగుండాలి.. మోడలింగ్‌ చేయాలంటే ఎన్ని అర్హతలో! కుర్రాళ్లకైతే ఒడ్డూపొడవూ, కండలు తిరిగిన దేహం తప్పనిసరి. ఇవన్నీ వందలో ఏ ఒకరిద్దరికో కుదురుతాయి. మరి మిగతా ఆశావహుల సంగతేంటి? బెంగేం అక్కర్లేదు బాస్‌. శరీరంలో కొన్ని అవయవాలే పక్కాగా ఉన్నా బీపీఎంతో రాణించొచ్చు. ‘మీ కళ్లు, కాళ్లు, చేతులు, ముక్కు, మూతి, పెదాలు, జుత్తు, పళ్లు, నడుము, పొట్ట, మెడ, నవ్వు, కండలు, కాలివేళ్లు.. వీటిలో ఏదైనా తీరైన ఆకృతితో ఉంటే చాలు. మీరు కెమెరా ముందుకొచ్చి చిందేయొచ్చు’ అంటున్నాయి మోడలింగ్‌ ఏజెన్సీలు. వీళ్లని సొంతం చేసుకునేందుకు షాంపూలూ, సౌందర్యోపకరణాలు, ఫేస్‌క్రీమ్‌లు, టూత్‌పేస్ట్‌లు, జిమ్‌ ఉపకరణాలు, లోదుస్తులు, లిప్‌స్టిక్‌లు, షేవింగ్‌ క్రీమ్‌లు, షూలు, జ్యువెల్లరీలు.. ఇలాంటి ఉత్పత్తుల కంపెనీలు ఎన్నో సిద్ధంగా ఉన్నాయి. అవకాశం అందుకోవాలంటే ఆ కంపెనీలు అడిగే అర్హతల్ని అందిపుచ్చుకోవాల్సిందే. ఉదాహరణకు చేతుల మోడల్‌ కావాలనుకుంటే.. తీరైన ఆకృతి ఉన్న చేతులుండాలి. పొడవైన వేళ్లు, సమానమైన గోళ్లు ప్లస్‌పాయింట్‌. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా రంగు బాగుండాలి. చేతిపై వెంట్రుకలు ఉండకూడదు. ఇలా వాళ్లు కోరిన ఫీచర్లుంటే కోరి మరీ పిలుస్తారు. బాడీపార్ట్‌లతో మెప్పించగలిగేలా మోడలింగ్‌ చేస్తే కోరినంత ముట్టజెబుతారు. ఈ తరహా ప్రత్యేక ఏజెన్సీలు పాశ్చాత్య దేశాల్లోని నగరాల్లో ఇబ్బడిముబ్బడిగా ఉన్నా.. ఈమధ్యే భారత్‌లోనూ ఊపందుకుంటున్నాయి. ముంబయి, బెంగళూరు, దిల్లీ నగరాల్లోని ప్రముఖ ఏజెన్సీలు ఈ బీపీఎం కోసం ప్రత్యేక వెబ్‌సైట్లు తెరుస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని