ఇండోనేషియాలో.. బాలీవుడ్‌ గీతం

ఈమధ్యే విడుదలైన ‘పఠాన్‌’ సూపర్‌హిట్‌. ఆ సినిమాలోని ‘జూమే జో పఠాన్‌..’ ఎంత ఫేమసో.. ఆ పాటకి పేరడీ చేసిన ఇండోనేషియా అమ్మాయి వినా ఫాన్‌ సైతం అంతర్జాలంలో అంతే వైరల్‌గా మారింది.

Published : 11 Feb 2023 00:16 IST

ఈమధ్యే విడుదలైన ‘పఠాన్‌’ సూపర్‌హిట్‌. ఆ సినిమాలోని ‘జూమే జో పఠాన్‌..’ ఎంత ఫేమసో.. ఆ పాటకి పేరడీ చేసిన ఇండోనేషియా అమ్మాయి వినా ఫాన్‌ సైతం అంతర్జాలంలో అంతే వైరల్‌గా మారింది. ఆమె చేసిన ఈ రీల్‌కి 13లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఇన్‌స్టా, యూట్యూబ్‌లో 25 లక్షల మంది వీక్షించారు. ఇదొక్కటే కాదు.. తను బాలీవుడ్‌లో ఇలాంటివి వందలకొద్దీ చేసింది. ఇండోనేషియాలో బాలీవుడ్‌ స్టార్‌గా పాపులరైంది.

వినాకి హిందీ చిత్రాలపై ప్రేమ చిన్నప్పుడే మొదలైంది. ఏమాత్రం ఖాళీ దొరికినా మన పాటలకు స్టెప్పులేస్తూ, సంగీతాన్ని హమ్‌ చేస్తుండేది. చదువైపోయాక ఓ టీవీ షోలో కొరియోగ్రాఫర్‌గా చేరింది. షో రెండేళ్లు బాగానే సాగినా.. కొవిడ్‌ విరుచుకు పడటంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఏం చేయాలో తనకి అర్థం కాలేదు. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టంలేక.. తనలాగే డ్యాన్స్‌, మ్యూజిక్‌ అంటే అభిమానం ఉన్న కొందర్ని పోగేసి బాలీవుడ్‌ పాటలను అనుకరిస్తూ వీడియోలు చేయడం ప్రారంభించింది.

వినా ముందు ఒక పాట అనుకుంటే దాన్ని వారం రోజుల్లో ముగించేస్తుంది. పాటలోని హీరోయిన్‌ స్టెప్పులు, బీట్‌, కాస్ట్యూమ్స్‌.. అన్నీ అచ్చంగా దించేస్తుంది. కొరియోగ్రఫీనే కాదు.. లొకేషన్‌ ఎంపిక, గ్రూపు డ్యాన్సర్ల దుస్తుల డిజైనింగ్‌, వీడియోల ఎడిటింగ్‌.. అన్నీ ఒంటి చేత్తో చేసేస్తుంది. ఇది పేరడీ వీడియోనే కదా అని తేలిగ్గా తీసుకోదు. స్టెప్పులు, పాటకి పెదాల కదలిక.. ప్రతీదీ పక్కాగా వచ్చేదాకా వదలదు. హిందీలోని దాదాపు అందరు నాయికలని అనుకరిస్తూ వందల పేరడీలు చేసింది. బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ అంటే వినాకి పిచ్చి. తన సినిమా ఏదీ వదలదు. డైలాగులైతే అన్నీ కంఠస్థం. ‘నేను షారుక్‌ అభిమానిని కాదు.. భక్తురాలిని’ అనే వినా ఈ అభిమానంతోనే 2017లో ఇండియా వచ్చింది. ముంబయిలో కొద్దిరోజులు గడిపి వెళ్లింది. తాజాగా తన ‘పఠాన్‌’ పేరడీ వైరల్‌ కావడంతో భారత్‌ మీడియా సంస్థలన్నీ తన గురించి కథనాలు వెలువరించాయి. ఇండోనేషియాలో ఎప్పుడో పాపులర్‌ అయిన తను ఇప్పుడు ఇండియా యూత్‌కీ పరిచయమైంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని