దూరమైంది ప్రియనేస్తం.. చేరువైంది విజయం

2014లో డిగ్రీ పూర్తైంది. కన్నవాళ్లకు ఇంకా భారంగా ఉండటం నాకిష్టం లేదు. ఏదైనా ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో ఓ శిక్షణాసంస్థలో చేరా. గ్రూప్స్‌, బ్యాంకు, రైల్వే ఉద్యోగాలతోపాటు పలు ప్రవేశపరీక్షలకు శిక్షణ ఇచ్చేవారక్కడ.

Updated : 09 Dec 2022 12:39 IST

దూరమైంది ప్రియనేస్తం.. చేరువైంది విజయం

‘ప్రేమలో గెలిస్తే ఏమొస్తుంది? మహా అయితే పెళ్లవుతుంది. ఓడిపోతే... ఏదో సాధించి చూపించాలనే కసి పుడుతుంది’ అంటున్నాడో కుర్రాడు.

2014లో డిగ్రీ పూర్తైంది. కన్నవాళ్లకు ఇంకా భారంగా ఉండటం నాకిష్టం లేదు. ఏదైనా ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో ఓ శిక్షణాసంస్థలో చేరా. గ్రూప్స్‌, బ్యాంకు, రైల్వే ఉద్యోగాలతోపాటు పలు ప్రవేశపరీక్షలకు శిక్షణ ఇచ్చేవారక్కడ. క్లాసులో కొత్తగా చేరిన ఒకమ్మాయిని చూడగానే నా గుండె లయ తప్పింది. చాలాసార్లు మాట కలపాలని ప్రయత్నించినా ధైర్యం చాల్లేదు. ఓరోజు అనుకోకుండా ఎదురుపడితే ‘హాయ్‌’ చెప్పా. కనీసం మొహం చూడకుండానే వెళ్లిపోయింది. అవమానంగా ఫీలయ్యా. ఎలాగైనా తనతో ఫ్రెండ్షిప్‌ చేయాలనే పంతం పెరిగింది. తను రోజూ మా హాస్టల్‌ ముందు నుంచే క్లాసుకెళ్లేది. ఆమె ఏ రంగు డ్రెస్‌ వేసుకుందో చూసి నేనూ అదే రంగు వేసుకొని వెళ్లేవాణ్ని. అయినా పట్టించుకుంటేగా!

ఓరోజు నోటీసుబోర్డులో మార్కుల జాబితా చూస్తోంది. మంచి ఛాన్స్‌ అనుకుంటూ వెళ్లి ‘క్లాస్‌ ఫస్టా? సెకండా?’ చొరవగా పలకరించా. ఎప్పట్లాగే మొహం చిట్లించింది. ఇక లాభం లేదని అక్కణ్నుంచి కదులుతుంటే ‘నేను వేసుకునే కలర్‌ డ్రెస్సే నువ్వూ వేసుకుంటున్నావ్‌. ఏంటి సంగతి?’ అంది. అక్కడే గెంతులేయాలన్నంత సంతోషం. అయినా ఏం మాట్లాడకుండా అక్కణ్నుంచి జారుకున్నా. స్కూటీపై తన నిక్‌నేమ్‌ రాసుండేది. ఆ ముద్దుపేరుతోనే సంబోధించానోసారి. ‘ఫర్లేదు.. తెలివైనవాడివే. నాకోసం చాలానే కష్టపడుతున్నావ్‌’ అని మెచ్చుకుంది. ఇక నేను రెచ్చిపోవడానికి లైసెన్స్‌ దొరికినట్టే అనుకున్నా. కానీ నా దురదృష్టంకొద్దీ అప్పుడే ఓ పరీక్ష కోసం వేరే వూరెళ్లాల్సి వచ్చింది. పదిరోజులు క్లాసుకు హాజరు కాలేకపోయా. అదీ నా మంచికేనని తర్వాత అర్థమైంది.

‘ఏంటి ఎక్కడికెళ్లావ్‌? చెప్పి వెళ్లాలనే కామన్‌సెన్స్‌ లేదా?’ రాగానే నన్ను వూపేస్తూ అడిగింది. గాల్లో తేలిపోయా. ఆరోజే మా ఫోన్‌ నెంబర్లు తర్జుమా అయ్యాయి. ఆపై చాటింగ్‌లు.. మీటింగ్‌లు.. సినిమాలు.. షికార్లు.. కామనయ్యాయి. కోర్సు పూర్తికాకముందే మనసులూ ఇచ్చిపుచ్చుకున్నాం. స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలని బాసలు చేసుకున్నాం. ‘మనం జీవితాంతం ఇలాగే ఉంటాంగా? నువ్వు నన్ను మోసం చేయవుగా’ అనేది బేలగా. ‘నిన్నొదిలితే నా ప్రాణం వదిలినట్టే’ అభయమిచ్చేవాణ్ని. ఆ ప్రేమ అలాగే కొనసాగితే మేం ఈపాటికే భార్యాభర్తలయ్యేవాళ్లం. జరిగింది వేరు.

ఏమైందో తెలియదుగానీ కోర్సు పూర్తై ఇంటికెళ్లాక మాట్లాడ్డం మానేసింది. నేనది తట్టుకోగలనా? ఫోన్లు చేశా. ‘ఎందుకు మా అమ్మాయి వెంటపడుతున్నావ్‌?’ వాళ్ల నాన్న నిలదీశారు. ఇంటిచుట్టూ తిరిగా. ‘ఇంకోసారి కనపడితే జైళ్లొ ఉంటావ్‌’ బెదిరించారు. అయినా ప్రియసఖిని మర్చిపోవడం నావల్ల కాలేదు. దీంతో చదువుపై ఏకాగ్రత తగ్గింది. మరోవైపు ఉద్యోగం సంగతి ఏమైందని ఇంట్లోవాళ్ల ఒత్తిడి. ఎంజాయ్‌ చేయడానికే కోర్సులో చేరావంటూ సన్నిహితుల వెక్కిరింపులు. వెరసి తనపై పీకల్దాకా కోపం పెరిగింది.

ఆమెది మోసమో, ఇంట్లోవాళ్ల ఒత్తిడితో అలా చేస్తుందో అర్థం కాకపోయేది. కానీ నా ప్రేమ విలువ తెలియాలంటే.. తనే నా దగ్గరికి పరుగెత్తుకు రావాలంటే ఏదైనా సాధించి చూపించాలనే కసి మొదలైంది. అందుకు ఏకైక మార్గం జాబ్‌ కొట్టడం. వెంటనే పుస్తకం అందుకున్నా. రాత్రీపగలు మరచి ఐదునెలలు చదివా. నా కష్టం ఫలించింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగం దక్కింది. ఇప్పుడు నేను వూహించనంత గుర్తింపు, గౌరవం, ప్రశంసలు దక్కుతున్నాయి. నన్ను దూరం పెట్టి పరోక్షంగా నా విజయానికి కారణమైంది తనే. ఇప్పటికీ ఆమెకు దగ్గరవ్వాలనే కోరుకుంటున్నా.

- రమణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని