అప్‌డేట్‌ అవ్వాల్సిందే!

కంపైల్‌ చేయలేని కోడింగ్‌లా మారిన కరోనా.. ఇప్పుడు యువతకి పెద్ద సవాలే అనుకోవాలి. ఎందుకంటే..ఈ మహమ్మరి మనిషి ఆరోగ్యంపైనే కాదు.. ఆదాయ వనరులపైనా తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు యువత చదువు, ఉద్యోగాల్ని ఊహించని విధంగా మార్చేసింది. ముఖ్యంగా మిలీనియల్స్‌ మూడు షిప్టుల్లో పని చేసే టెక్నాలజీ రంగాన్నయితే నాలుగు గోడలకే పరిమితం చేసింది.

Published : 30 May 2020 01:05 IST

జరసోచో!

కంపైల్‌ చేయలేని కోడింగ్‌లా మారిన కరోనా.. ఇప్పుడు యువతకి పెద్ద సవాలే అనుకోవాలి. ఎందుకంటే..ఈ మహమ్మరి మనిషి ఆరోగ్యంపైనే కాదు.. ఆదాయ వనరులపైనా తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు యువత చదువు, ఉద్యోగాల్ని ఊహించని విధంగా మార్చేసింది. ముఖ్యంగా మిలీనియల్స్‌ మూడు షిప్టుల్లో పని చేసే టెక్నాలజీ రంగాన్నయితే నాలుగు గోడలకే పరిమితం చేసింది. భవిష్యత్తుపై బంగారు కలలు కన్న టెకీలది ఇప్పుడు దిక్కు తోచని స్థితి. ఇప్పుడేం చేయాలి? కెరీర్‌ తలుపులు మూసుకుపోతున్నా.. తమదైన   స్కిల్‌తో కిటికీలను తెరచి భవిష్యత్తుని చూడాలంటే ఏం చేయాలి? అప్‌డేట్‌ అవ్వాలి. లాక్‌డౌన్‌ వెర్షన్లను మార్చుకున్నట్టుగానే.. యువత కూడా అప్‌డేట్‌ వెర్షన్‌లోకి అడుగుపెట్టాలి.. ఊహించని రీతిలో మనతో టీ20 మ్యాచ్‌ ఆడిన కరోనాతో టెస్ట్‌ సిరీస్‌ ఆడాలి. క్రీజ్‌లో నిలబడాలి.. అది సంధించే అన్ని రకాల బంతుల్ని  డిఫెండ్‌ చేస్తూ వికెట్‌ని కాపాడుకోవాలి..పిచ్‌పై కాస్త కుదుటపడితే పరుగులన్నీ మనవే అని గుర్తించాలి. అందుకు ఇప్పుడు నెట్‌ ప్రాక్టీస్‌లో మెలకువల్ని నేర్చుకోవాలి...
కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కి సిద్ధమా?
ఓటమికి తలొగ్గని వాడే కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ చేస్తాడు. అందుకే ఇప్పుడు మీరు కెప్టెన్‌గా మారాలి. ఆఫీస్‌ క్యాబిన్లు.. కెఫెటేరియా టేబుళ్ల మధ్యే కాదు. కిలో మీటర్ల దూరంలో వర్క్‌ప్లేస్‌లు ఏర్పాటు చేసుకున్నా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడుతూ గెలుపు దిశగా పయనించడం నేర్చుకోవాలి. మీరు టీమ్‌లో ఒక్కరిగా.. టీమ్‌ని నడిపించే టీఎల్‌గా అందర్నీ ప్రభావితం చేస్తూ నిరుత్సాహాన్ని మీ నెట్‌వర్క్‌ పరిధిలోకి రాకుండా జాగ్రత్త పడాలి. వర్క్‌ ఫ్రం హోమ్‌ని కూడా సక్సెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చేయాలి. గెలుస్తామనే ధీమా ఒక్కటి చాలు.. ఆటని ఆస్వాదించడానికి. చివరి బంతిని బలంగా కొట్టేదాకా ఎప్పుడూ ఓటమిని అంగీకరించకూడదు. అలాంటి వాడే నాయకుడు. అతన్ని ఏ కంపెనీ.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోదు.
ఆడడమే కాదు..ఆడించాలి కూడా!
ప్రత్యర్థిని నిలువరించాలన్నా.. తోటి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాలన్నా భావోద్వేగాల్ని అవసరమైన చోటే పండించాలి. అప్పుడే గెలుపు అందనంత దూరం నుంచి అల్లంత దూరంలోకి వచ్చేస్తుంది. అందుకే తెలివితేటలతో పాటు ‘ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌’ కూడా అవసరం. డ్రస్సింగ్‌ రూమ్‌లో భావోద్వేగాలు ఒకలా.. మైదానంలో మరోలా ఉన్నప్పుడే ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆట రసవత్తరంగా మారుతుంది. అందుకే.. మీలోని పనిమంతుడితో పాటు నలుగురినీ పనిమంతులుగా చేసే ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ని పెంచుకోవడం అనివార్యం. అప్పుడే మీ స్థానాన్ని యాజమాన్యం గుర్తిస్తుంది.
కొత్త షాట్స్‌ నేర్చుకోవాలి
పిచ్‌లు అన్నీ ఒకేలా ఉండవు.. బంతులన్నీ ఒకేలా పడవు..  అందుకే ఎప్పటికప్పుడు కొత్త షాట్స్‌ కొట్టే ప్రయత్నం చేయాలి. మీరున్న రంగం ఆధారంగా దాంట్లో చోటు చేసుకోనున్న మార్పులకు సిద్ధం అవ్వాలి. నేడు విజృంభిస్తున్న కరోనా కుదుపుతో పలు రంగాల్లో విప్లవాత్మమైన మార్పులు రానున్నాయి. ఆయా టెక్నాలజీ అప్‌డేట్స్‌ని అందిపుచ్చుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలి.  ఇప్పటికే వర్క్‌ ఫ్రం హోమ్‌ కొత్త టెక్నాలజీలను పరిచయం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), రోబోటిక్స్‌.. లాంటివి పనిలో భాగం కావచ్చు. వాటితో కలిసి పని చేయాల్సి రావొచ్చు. అందుకే భవిష్యత్తు టెక్నాలజీపై అంచనా, అవగాహన తప్పనిసరి.
గేమ్‌ ఫార్మాట్‌ మారుతుంది...
క్రికెట్‌ తన ఫార్మాట్‌లు మార్చుకుంటూ టీ20తో నేటి తరానికి మరింత దగ్గరయ్యింది. ఐపీఎల్‌తో ప్రపంచ దేశాల ప్లేయర్స్‌ని కలగలిపేసింది. ఇదే మాదిరిగా చేస్తున్న ఉద్యోగం, చదువుల్లోనూ ఎదురయ్యే మార్పులకు సిద్ధం కావాల్సిందే. లాక్‌డౌన్‌ తర్వాత సంస్థల రూపు మారొచ్చు. పని వేళల్లో మార్పులు రావొచ్చు లేదా పూర్తిగా ఇంటి నుంచే పని చేయాల్సి రావొచ్చు. అప్పుడు వర్క్‌ స్టేషన్‌ ఎక్కడైనా.. పని వాతావరణం ఎలా ఉన్నా ఫోకస్‌ పనిపై ఉండాలి. కలిసి పని చేసే టీమ్‌కి కనెక్టు కావాలి. వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ రానున్న మార్పుల్ని ఈ రోజే ఊహిస్తూ వాటికి తగ్గట్టుగా స్కిల్‌ని మార్చుకోవడమే నేటి తరం పఠించాల్సిన సక్సెస్‌ మంత్రం.


పంచుకుందాం

సమ్‌థింగ్‌..సమ్‌థింగ్‌..
నేను నేనుగా లేనంటే..
తను ఇక్కడే.. ఎక్కడో.. ఉన్నట్టు!

- నిషా


తన కళ్లలోకి చూడాలంటే..

ఈత అయినా వచ్చుండాలి.. లేదంటే  నిండా మునిగేందుకైనా సిద్ధ పడాలి..
- శ్రీను, వైజాగ్‌



క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఆఫర్‌ లెటర్‌ పట్టుకుని దిగుతున్నా.. తను మళ్లీ అదే మెట్లపై ఎదురైంది.. కాలం మళ్లీ మమ్మల్ని ఫ్రెషర్స్‌గా మార్చేస్తే బాగుండేది.. మా ప్రేమని గెలిపించుకునేవాడిని..!
- రియాన్‌, హైదరాబాద్‌


వాడితే పోలా..ఫొటోలు ఆకట్టుకునేలా...

మీ ఫొటోలోని ఆకాశంలో ఉన్న మేఘాలను కదిలిస్తే! లేదా వాటర్‌ఫాల్స్‌ దగ్గర మీరు తీసుకున్న ఫొటోలో నీటిని ప్రవహింప చేస్తే! మీ చేతిలో ఉన్న కాఫీ కప్పులో పొగలు వచ్చేలా చేస్తే! అదేంటి ఫొటోలో ఇవన్నీ కదులుతాయా! అంటారా? ఈ యాప్‌తో కదిలించొచ్చు. పేరు Enlight Pixaloop ఇదో ఫొటో యానిమేటర్‌ యాప్‌. ఫొటోలో మీకు కావాల్సిన ప్రదేశాన్ని ఎంచుకుని ప్లే చేస్తే చాలు సింపుల్‌గా బొమ్మ కదిలేస్తుంది. అంటే మీ ఫొటోలని ఓ యానిమేటెడ్‌ ఫొటోలుగా మార్చొచ్చన్నమాట. అలా యానిమేట్‌ చేసిన ఫొటోలకి అందమైన ఎడిట్స్‌ చేస్తూ ప్రాణం పోసేయొచ్చు. అందుకు అనేక ఎడిటింగ్‌ టూల్స్‌ ఉన్నాయి. మరింకెందుకాలస్యం డౌన్‌లోడ్‌ చేసి ఓ సారి ప్రయత్నించండి.

- రఘు, ఏలూరు


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని