పర్యావరణానికి పచ్చని తరంగమై

పర్యావరణానికి హానిచేసే వ్యర్థాలన్నప్పుడు..  మనకి ఒక్క ప్లాస్టిక్‌ మాత్రమే గుర్తొస్తుంది. ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉండే హానికారక సీసం, పాదరసం, నికెల్‌, కోబాల్ట్‌ వంటి వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఆలోచించలేదు కానీ విశాఖకు చెందిన అనిల్‌ ఆ పని చేశాడు. వాతావరణంలోకి విషం చిమ్మే ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలని రీసైక్లింగ్‌ చేసే సంస్థను మొదలుపెట్టి టన్నుల కొద్దీ వ్యర్థాలు...

Published : 27 Jul 2019 00:36 IST

పర్యావరణానికి హానిచేసే వ్యర్థాలన్నప్పుడు..  మనకి ఒక్క ప్లాస్టిక్‌ మాత్రమే గుర్తొస్తుంది. ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉండే హానికారక సీసం, పాదరసం, నికెల్‌, కోబాల్ట్‌ వంటి వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఆలోచించలేదు కానీ విశాఖకు చెందిన అనిల్‌ ఆ పని చేశాడు. వాతావరణంలోకి విషం చిమ్మే ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలని రీసైక్లింగ్‌ చేసే సంస్థను మొదలుపెట్టి టన్నుల కొద్దీ వ్యర్థాలు సేకరిస్తూ పర్యావరణంపై తన ప్రేమను చాటుకుంటున్నాడు...

విశాఖ నగరానికి చెందిన అనిల్‌కుమార్‌కు పర్యావరణం అంటే ఎనలేని మక్కువ. హైదరాబాద్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన అనిల్‌...  ఆ తరువాత విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో పర్యావరణశాస్త్రంలో ఎమ్మెస్సీ పూర్తిచేశాడు. తరువాత న్యూజిలాండ్‌ వెళ్లి ‘రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌’లో మాస్టర్స్‌ పూర్తి చేశాడు. సహజ వనరులను ఎలా కాపాడుకోవాలి. పర్యావరణానికి హానిచేసే ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను ప్రత్యామ్నాయ అవసరాలకు ఎలా ఉపయోగించుకోవచ్చు?ఈ విషయాల్లో ప్రజల్లో చైతన్యం కల్పించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ విషయాలన్ని ఔపోసన పట్టాడు. మంచి వేతనంతో ఉద్యోగం పొందే అవకాశం ఉన్నా పర్యావరణ పరిరక్షణకు నేరుగా తానే రంగంలోకి దిగాలనుకున్నాడు. 2014లో తన మిత్రులు ప్రణీశ్‌వర్మ, రేవతిల భాగస్వామ్యంతో ‘గ్రీన్‌వేవ్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సొల్యూషన్స్‌’ అనే సంస్థను స్థాపించాడు.

ఏ వ్యర్థాలు వేరుచేస్తారు...
వాస్తవానికి ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్మూలించడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. పనికిరాని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్లోని విడిభాగాలని జాగ్రత్తగా వేరుచేయాలి. ఇందుకోసం సుశిక్షితులైన నిపుణుల సేవలు చాలా అవసరం. అందుకే తనతోపాటు మరో ఐదుగురు నిపుణులను నియమించుకున్నాడు. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్లో ఉపయోగించే లెడ్‌, మెర్క్యురీ, కాడ్మియం, ఆర్సెనిక్‌, నికెల్‌, కోబాల్ట్‌ వంటి వాటిని వేరుచేస్తారు. ఇవి వాతావరణంలో కలిస్తే వాటి కారణంగా క్యాన్సర్‌, నరాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వీటితోపాటు ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్లో ఉండే ప్లాస్టిక్‌, ఇనుము, గ్లాస్‌, ఫైబర్‌, రబ్బరు, అల్యూమినియం, కాపర్‌ తదితరాలను సేకరిస్తారు. ఆయా లోహాలని హైదరాబాద్‌, బెంగళూరుల్లో ఉన్న రీసైక్లింగ్‌ కేంద్రాలకు పంపిస్తారు.

రాష్ట్రవ్యాప్త అనుమతి.....
గ్రీన్‌వేవ్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సొల్యూషన్స్‌ ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి అనుమతి సంపాదించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను సేకరించడానికి అధీకృత సంస్థగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఈ-వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌ -2016’ ప్రకారం ప్రతి సంవత్సరం ఏ సంస్థ ఎంత పరిమాణంలో ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను నిర్మూలించిందన్న విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు నివేదిక ఇవ్వాలి. ఆ నిబంధన ఆధారంగా అనిల్‌ పలు సంస్థల వద్దకు వెళ్లి ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను ఇచ్చి పర్యావరణానికి మేలు చేసేలా సహకరించాలని చేస్తున్న విజ్ఞప్తులకు ఆ సంస్థలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్రస్తుతం గ్రీన్‌వేవ్స్‌ సంస్థ సంవత్సరానికి 240 టన్నుల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేయగలుగుతోంది.

జీవిత భాగస్వామి కూడా...
అనిల్‌ భార్య బ్రాహ్మణికీ పర్యావరణం అంటే ఎనలేని మక్కువ. పర్యావరణ శాస్త్రంలో ఎమ్మెస్సీ చేసి, అనిల్‌తోపాటే న్యూజిలాండ్‌లో ఎం.ఎస్‌.చేసింది. తరువాత అతని పనిలోనూ భాగస్వామిగా మారింది. కార్యాలయం వెలుపలి వ్యవహారాలు అనిల్‌ చక్కబెడుతుండగా.. పిల్లల్లో ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలపై అవగాహన కల్పించడం, ఆయా వ్యర్థాలను ఉపయోగించి అందమైన ఉపకరణాలను తయారుచేయడం వంటివి నేర్పిస్తూ పర్యావరణ పరిరక్షణకు తనవంతు కృషి చేస్తోంది బ్రాహ్మణి.

ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను సాధారణ వ్యర్థాలతో కలిపి డంపింగ్‌ యార్డ్‌లకు తరలిస్తే ఆయా వ్యర్థాల నుంచి వెలువడే వాయువుల కారణంగా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.  దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ-వ్యర్థాల నిర్మూలనకు శ్రీకారం చుట్టాం. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సాధ్యమైనంత భారీ పరిమాణంలో ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్మూలించే అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో చాలా సంస్థలు మమ్మల్ని ఆశ్రయించి ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను ఇస్తున్నాయి. విశాఖ, విజయవాడ, కర్నూలు, హైదరాబాద్‌ తదితర చోట్ల మా సేకరణ కేంద్రాలున్నాయి. సేకరించిన వ్యర్థాల్ని రీసైక్లింగ్‌కు పంపుతున్నాం.

- అనిల్‌
- బీఎస్‌ రామకృష్ణ
ఈనాడు - విశాఖపట్నం

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని