వివేక భారత్‌

గాలికి... హోరు గాలికి తేడా ఏంటి? దేన్నైనా చుట్టిపడేసే హోరు. వానకు... జోరు వానకు భేదం ఏంటి? ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించే జోరు. తీగకు.. విద్యుత్తు తీగకు వైరుధ్యం ఏంటి? చిమ్మచీకట్లను సైతం వెలుగులుగా మార్చే విద్యుత్తు. సమస్యలను చుట్టి పక్కన పడేయగల ఆ హోరు... ఈ యువత. కష్టాలను ఇష్టంగా అధిగమించే     ఆ జోరు... ఈ యువత.

Updated : 12 Jan 2019 00:26 IST

నేడు వివేకానంద జయంతి

వివేక భారత్‌

గాలికి... హోరు గాలికి తేడా ఏంటి? దేన్నైనా చుట్టిపడేసే హోరు. వానకు... జోరు వానకు భేదం ఏంటి? ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించే జోరు. తీగకు.. విద్యుత్తు తీగకు వైరుధ్యం ఏంటి? చిమ్మచీకట్లను సైతం వెలుగులుగా మార్చే విద్యుత్తు. సమస్యలను చుట్టి పక్కన పడేయగల ఆ హోరు... ఈ యువత. కష్టాలను ఇష్టంగా అధిగమించే     ఆ జోరు... ఈ యువత. ఎలాంటి ఎదురుదెబ్బలైనా తట్టుకొని పదిమంది జీవితాల్లో వెలుగులు నింపగల ఆ విద్యుత్తు... ఈ యువత. ‘పది మంది యువకులనివ్వండి దేశ భవిష్యత్తును తిరగరాస్తానన్న’ ఓ వివేకానందుడా... ఇదిగో శక్తులు నిండిన యువకులు... సమాజ హితం కోసం పాటుపడుతున్న ధీరులు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్ఫూర్తిదాయకమైన ‘ఈతరం’ కథనాలివి...

జైజవాన్‌..మోహన్‌

వివేక భారత్‌సైన్యంలో చేరాలంటే... సవాలక్ష పరీక్షలు. ఫిట్‌నెస్‌, మెడికల్‌ టెస్టులు. ఇన్నీ చేసి ఎంపికైతే కఠోర శిక్షణ... సైనికుడిగా ఉండాలంటేనే ఇన్ని చేయాలి. అదే లెఫ్ట్‌నెంట్‌ కావాలంటే.. ఇంతకు మించిన కఠోర శ్రమ అవసరం. వీటన్నింటినీ అధిగమించి లెఫ్ట్‌నెంట్‌ అయ్యాడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు మోహన్‌.

జ్వలించే తపన, అకుంఠిత దీక్ష... ఎంతటి లక్ష్యాన్నైనా సాధించేలా చేస్తాయని నిరూపించాడు పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన ముళ్లపూడి మోహన్‌. ముళ్లపూడి రామసుబ్రహ్మణ్య వరప్రసాద్‌, అచ్చమాంబ దంపతుల కుమారు డు మోహన్‌కు చిన్ననాటి నుంచి సైన్యంలో చేరాలనేది ఆశయం. ఆలోచనలను ఎటూ మళ్లించలేదు. 2014లో ఇంటర్మీడియట్‌ పూర్తైన వెంటనే ఇండియన్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేశాడు. యూపీఎస్‌సీ నిర్వహించిన ఈ పరీక్షలకు 6 లక్షల మంది హాజరైతే 500 మంది ఉత్తీర్ణత పొందారు. తర్వాత సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌.ఎస్‌.బి.) ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించిన ముఖాముఖీలకు 90 మందే అర్హత సాధించారు. వైద్య పరీక్షల అనంతరం 50 మందిని తుదిగా ఎంపిక చేశారు. వీరిలో ఒకడు మోహన్‌. వీరికి నాలుగు సంవత్సరాలు బీటెక్‌ కోర్సుతో పాటు ప్రపంచంలోని వివిధ రకాల ఆయుధాలను వినియోగించడం, గుర్రపు స్వారీ, స్విమ్మింగ్‌ వంటి విభిన్న అంశాల్లో ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చారు.

105 పరీక్షలు
ప్రతి సెమిస్టర్‌కి 105 పరీక్షలు ఉండేవి. దీనిలో ఏ పరీక్ష ఉత్తీర్ణత సాధించకపోయినా కోర్సులో ఆరు నెలలు వెనక్కి పంపిస్తారు. గుర్రపు స్వారీ తదితర శిక్షణలో కింద పడి కేరళ, రాజస్థాన్‌లకు చెందిన ఇద్దరికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. అలాంటి భయాలేవి మోహన్‌ దరిచేరలేదు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేశాడు. రాష్ట్రపతి రాతపూర్వకంగా ఇచ్చిన లేఖతో ఇండియన్‌ కమిషన్‌లోకి ప్రవేశించాడు. నవంబరు 8న గయా ఆర్మీ లెఫ్ట్‌నెంట్‌గా బాధ్యతలు స్వీకరించి తన చిన్ననాటి కలను సాకారం చేసుకున్నాడు. ‘లక్ష్యం నిర్దేశించుకున్నాక... పక్కచూపులు చూడకుండా ముందుకు సాగాను. ఫలితం సాధించాను. భారత సైన్యానికి మెరుగైన సేవలు అందించడమే ప్రస్తుతం నా ముందున్న కర్తవ్యమ’ని గుండెమీద చెయ్యేసి మరీ చెబుతాడు ముళ్లపూడి మోహన్‌.

- కందుల శ్రీనివాసరావు

 
వివేకా సూక్తి: ఫలితం గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో... ఆ ఫలితం పొందేందుకు ఉపయోగించే పద్ధతులపై అంతే శ్రద్ధ చూపు.

అక్షర చైతన్యం

వివేక భారత్‌దువు విలువ తెలిసిన కుర్రాడు చదువుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఎంతోమంది యువత ఉన్నతికి ఉపయోపడుతున్నాడు. సొంతంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంచేస్తూ... సొంతూరిలో గ్రంథాలయం నెలకొల్పి అక్షర చైతన్యం తీసుకొస్తున్నాడు. ఉపాధి వెలుగులు పండిస్తున్నాడు సిరిసిల్లకు చెందిన నాగుల పూర్ణచందర్‌.

పూర్ణచందర్‌ టెక్‌ మహేంద్రలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఉద్యోగ నిమిత్తం మూడు సంవత్సరాలు అమెరికాకు వెళ్లవలసి వచ్చింది. అక్కడ ఏదో తెలియని వెలితి. చదువుకునే రోజుల్లో తాను ఎదుర్కొన్న సమస్యలు గుర్తొచ్చేవి. తనలా ఎవ్వరూ కష్టపడకుండా చేయాలని సంకల్పించాడు. అమెరికా నుండి మధ్యలోనే తిరిగి వచ్చేశాడు. తన దగ్గరున్న చిన్నమొత్తంతో, స్నేహితుల సహకారంతో గ్రంథాలయాన్ని స్థాపించాడు. నడిపించాడు. నడిపిస్తున్నాడు. 1200 పుస్తకాలతో మొదలైన ఈ గ్రంథాలయంలో ప్రస్తుతం 4000కి పైగా పుస్తకాలు యువతకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. మొదట 4గంటలే తెరిచి ఉంచే పుస్తక భాండాగారం ప్రస్తుతం 24 గంటలూ నిరుద్యోగులకు సేవలందిస్తోంది. గ్రంథాలయంలో ఒక గదిని సాంకేతిక శిక్షణకు కేటాయించారు. 12 అడుగుల ప్రొజెక్టర్‌ స్క్రీన్‌, తదితర ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. టీ-సాట్‌లాంటి ప్రభుత్వ ఛానళ్లలో టెలికాస్ట్‌ అయ్యే వివిధ పోటీ పరీక్షలకు తరగతులను ప్రదర్శిస్తున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన శేఖర్‌ గ్రంథాలయంలో చదువుకుని టెట్‌లో 16వ ర్యాంకు సాధించాడు. కరుణాకర్‌, మమతలు ఇటీవల విడుదలైన పంచాయతీ కార్యదర్శి పరీక్ష ఫలితాలలో ఎంపికయ్యారు. కరుణాకర్‌ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్షలో పాసయ్యారు. ఇలా అనేకమంది ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఈ గ్రంథాలయం సోపానాలు పరుస్తోంది. ‘గ్రంథాలయాన్ని స్థాపించిన అయిదు సంవత్సరాల్లో మూడు వేలకు పైగా విద్యార్థులు సేవలు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. అక్షర చైతన్యం ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ద్వారా యువతకు కెరీర్‌ గైడెన్స్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామ’ని ఆనందంగా చెప్పాడు పూర్ణచందర్‌.

- తవుటు సౌమ్య, సిరిసిల్ల

వివేకా సూక్తి: నీ వెనుక ఏముంది? ముందేముంది? అన్నది కాదు ముఖ్యం. నీలో ఏముంది అనేది ముఖ్యం. అదే నీతో పాటు పదిమందిని నడిపిస్తుంది.

వివేక భారత్‌

సినిమా తరంగం
రూ.5500తో స్పేస్‌ షార్ట్‌ ఫిల్మ్‌

వివేక భారత్‌

చిన్న షార్ట్‌ఫిల్మ్‌ తీయటమంటే.. అందులోని విజువల్స్‌ అంత అందంగా ఉండదు ఆ జర్నీ. ఆ దారిలో కష్టాలుంటాయి. బాధలు, వెతలూ ఉంటాయి. వీటన్నింటినీ అధిగమించి ‘ది కౌంట్‌డౌన్‌’ అనే ఓ తొమ్మిది నిమిషాల సైన్స్‌ఫిక్షన్‌ షార్ట్‌ఫిల్మ్‌ను కార్తీక్‌ మాజేటి అనే కుర్రోడు తీసేశాడు. అయితే అందులో వింతేముందీ.. అంటారా. అవును వింతే ఉంది. తెలంగాణలోని కోల్‌మైన్‌లో ఈ సినిమాని కార్తీక్‌ షూట్‌ చేశాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి అన్నీ తానై.. ఆస్ట్రోనాట్‌ దుస్తులు సైతం తానే కుట్టుకున్న సినిమా ప్రేమికుడతడు. 5500 రూపాయలతో ‘ద కౌంట్‌డౌన్‌‘ లఘుచిత్రం తీసి మంచి సందేశంతోపాటు... స్ఫూర్తినీ చాటాడు కార్తీక్‌ మాజేటి.

* కార్తీక్‌ది హైదరాబాదే. ఇక్కడే ఈ షార్ట్‌ఫిల్మ్‌ స్క్రీనింగ్‌ జరిగింది. ‘ద కౌంట్‌డౌన్‌’ నిర్మాణానికి ఎంత ఖర్చై ఉంటుందో ఊహించండని చిత్రం చేసిన పది మందిని అడిగితే.. ‘యాభై వేలు.. లక్ష.. రెండు లక్షలు..’ ఇలా చెప్పుకొచ్చారంతా. అయితే 5500 రూపాయలతో ఈ సినిమా తీశానని కార్తీక్‌ చెప్పటంతో అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. స్పేస్‌షూట్‌, హెల్మెట్‌కి రూ.2400, లొకేషన్‌కి ప్రయాణం, వసతికి రూ.2500, సెట్‌ డిజైన్‌తో పాటు టైప్‌రైటర్‌ ఖర్చు రూ.600. తనతో పాటు పనిచేసిన ఇద్దరూ  ఉచితంగా పనిచేశారు. ఇంట్లోనే వీఎఫ్‌ఎక్స్‌, ఎడిటింగ్‌ జరిగింది. ఇలా మొత్తం ‘కౌంట్‌డౌన్‌’ ఫిల్మ్‌ విలువ 5500 రూపాయలని కార్తీక్‌ చెప్పటంతో సభికులంతా చప్పట్లతో అభినందించారు. ఆక్సిజన్‌ దొరకనంతగా ఈ భూమిని మనం కాలుష్యం చేస్తున్నామని సైన్స్‌ఫిక్షన్‌ తరహాలో చెప్పి యువతను ఆకట్టుకుంటున్నాడు కార్తీక్‌.

వివేక భారత్‌

* ఐఐటీలో చదివే సమయంలో సినిమా పిచ్చి పట్టుకుంది కార్తీక్‌కి. ఒక సంవత్సరం పాటు యూట్యూబ్‌ చూసి పాఠాలు నేర్చుకున్నాడు. దీంతో పాటు ఇతనికి ట్రావెలింగ్‌ ప్యాషన్‌. ఐఐటీ ఇంటెర్న్‌షిప్‌ ఆస్ట్రియాలో చేశాడు. ఆ సమయంలోనే ప్రతీ వారాంతం యూరప్‌లో పది దేశాలు చుట్టేశాడు. యూట్యూబ్‌లో ‘అద్వైత‘ అనే ఛానెల్‌ను క్రియేట్‌ చేసి.. తన అభిరుచిపై దృష్టిపెట్టాడు. బుద్దగయ ట్రావెల్‌ ఫిల్మ్‌ చేశాడు. ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. ఆ తర్వాత రాజస్థాన్‌, సిక్కిం, ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌, అండమాన్‌, కర్ణాటక.. ఇలా కొన్ని ప్రదేశాలు తిరిగి షూట్‌ చేశాడు. ‘మై గ్రేట్‌ ఎస్కేప్‌’ పేరుతో ట్రావెల్‌ సిరీస్‌ చేసి కొన్ని యూట్యూబ్‌లో ఉంచాడు. ప్రస్తుతం సినిమానే తన లోకమంటున్న ఈ యువకుడు భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలు చేస్తాడో మరి!

- రాళ్లపల్లి రాజావలి

వివేకా సూక్తి: గమ్యం స్థిరంగా ఉండాలి. మార్గం కచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నంలో రాజీ పడకూడదు. అప్పుడే విజయం మనదవుతుంది.

యువ ‘రక్తం’

వివేక భారత్‌‘రా’ అంటే రక్త దానం, ‘జీ’ జీవ కారుణ్యం, ‘వ’ అంటే వన సంరక్షణ... ఈ మూడు లక్ష్యాలతో రాజీవ సంస్థ నడుపుతున్నారు కొందరు యువకులు. సేవ చేస్తూ... మనసున్న వారితో చేయిస్తున్నారు. ఎన్నో ప్రాణాలకు కొత్త ఊపిరిలూదుతున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం కేంద్రంగా సంస్థను హరీష్‌ స్థాపిస్తే... సోదరుడు మహేశ్‌, స్నేహితులు దుర్దేశ్‌, శివ, అజయ్‌, రమేశ్‌, వరప్రసాద్‌, మధుకర్‌ తదితరుల సహకారంతో నడుపుతున్నారు.
సకాలంలో రక్తం దొరకక ఎవరి ప్రాణాలు పోకూడదని ఈ యువత కృషి చేస్తోంది. రక్తదానం చేస్తోంది. చేయిస్తోంది. జిల్లాలో రక్తనిధికి పేరెన్నికగన్న బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రి నిర్వాహకులు సైతం రక్తం అవసరమైతే వీరిని సంప్రదిస్తారు. ఎవరికి రక్తం అవసరమున్నా 90004 19604, 94904 38618కు ఫోన్‌, వాట్సాప్‌ మెసేజో, ఫేస్‌బుక్‌లో పోస్టు చేయమని వారు సూచిస్తున్నారంటే యువత సేవ ఎంత మెరుగ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎక్కడైనా మనుషులు, మూగజీవాలు అచేతనంగా పడిఉంటే వీరి హృదయాలు స్పందిస్తాయి. జంతువులను చేరదీసి, సంరక్షిస్తారు.  అవసరమైన మనుషులకు ప్రాథమిక చికిత్స అందించి అనాథాశ్రమంలో చేర్పిస్తారు. మొక్కల పెంపకంపై పట్టణంలోని పలుపాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించి వన సంరక్షణకు నడుం బిగించారు. ఊరిలో కన్నా ఊరిబయట చెట్లను కాపాడుకోవడమే లక్ష్యంగా భావించి వాటి సంరక్షణకు ట్యాంకులతో నీరు పోసి పెంచుతున్నారు. ‘‘నాన్న సుబ్బరాయుడును ఒప్పించి అమ్మ సేపూరి రజని పేరిట ధర్మవరం మార్కెట్‌ యార్డు ఎదురుగా ఉన్న ఆరు సెంట్ల స్థలాన్ని రాజీవ సంస్థకు ఇచ్చాం. అక్కడ అనాథ వృద్థులకు ఆశ్రమ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భవనం పూర్తి అయితే దిక్కులేని ఎంతో మందికి నీడ లభిస్తుంద’ని ఆనందంగా చెప్పాడు హరీష్‌.
 

- అబ్దుల్‌ ఖాదర్‌పాషా, అనంతపురం

వివేకానంద: మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు. శక్తితో ఎంతో మందికి ఉపయోగపడతారు.

సంగీత కెరటం

వివేక భారత్‌రిక్కీకెజ్‌. పుట్టింది బెంగళూరు. చదివింది దంత వైద్యవిద్య. అయితే ఏంటి? అంటారా? ఆ యువకుడు చేస్తున్న సంగీత కచేరీల్లోనే ఉంది విశేషం. సామాజిక రుగ్మతలపై చైతన్యం తెచ్చేందుకు సంగీతాన్ని సాధనంగా చేసుకున్న రిక్కీ ఈ మార్గంలో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించాడు. ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయంపై మక్కువతో ఇప్పుడు రైతుల్లో చైతన్య గీతికలు ఆలపిస్తున్నాడు.

రిక్కీకి బాల్యం నుంచి సంగీతమంటే ఇష్టం. తల్లిదండ్రులేమో చదువుకోమని చెప్పేవారు. వారి కోరిక మేరకు బాగా చదువుకుంటూనే కీబోర్డ్‌, గిటార్‌ నేర్చుకున్నాడు. 2003లో మొదటి ఆల్బమ్‌ విడుదల చేశాడు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగాడు. 2015లో ‘విండ్స్‌ ఆఫ్‌ సంసారా’కు గ్రామీ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన సూచన మేరకు పర్యావరణ కాలుష్యంపై దృష్టిపెట్టాడు. 2015 నవంబరులో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పారిస్‌లో జరిగిన సదస్సులో అనేక మంది దేశాధినేతల ఎదుట పర్యావరణ హితంపై ‘శాంతి సంసారా’ ఆల్బమ్‌ను ఆలపించాడు.  రిక్కీ సేవలను గుర్తించిన యునిసెఫ్‌ అతన్ని  ప్రచారకర్తగా నియమించింది. పర్యావరణం, ప్లాస్టిక్‌పై అనేక రచనల చేసి తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్నాడు. 27పిల్లల గీతాలను స్వరపరిస్తే... వీటిలో కొన్నింటిని ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈలో సిలబస్‌లో చేర్చారు. ‘సంగీతాన్ని మనం డబ్బుకోసం సృష్టించకూడదు. అది మన గుండెలోతుల్లోంచి రావాలి. అప్పుడే దాన్ని విజయం కోరి వరిస్తుంద’ంటూ యువ సంగీత కెరటమై ఎదుగుతున్నాడు రిక్కీ.

- సురేశ్‌ రావివలస, విశాఖపట్నం

వివేకా సూక్తి: మందలో ఒకరిగా ఉండకు... వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు.

వివేక భారత్‌

‘‘స్వామీజీ గ్రంథాల్ని క్షుణ్ణంగా పఠించాను. అవి చదివిన తర్వాత మాతృదేశం పట్ల నాకున్న ప్రేమ వెయ్యి రెట్లు అధికమైంది’’

- గాంధీజీ

వివేక భారత్‌

‘‘భారతదేశం గురించి తెలుసుకోవాలంటే వివేకానందుణ్ణి అధ్యయనం చేయండి. ఆయనలో అంతా పురోగామిత్వమే ప్రకటితమవుతుంది. తిరోగమనానికి, నైరాశ్యానికి తావుండదు’’

- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

వివేక భారత్‌

‘వివేకానందుని ధైర్యసాహసాలు అసమానం. ఆయన పురుష సింహంగా వెలుగొందారు. ఆ మహనీయుడి దివ్యశక్తి ప్రభావం ఇప్పటికీ అత్యున్నత స్థాయిలో మనపై ప్రసరిస్తూనే ఉంది’’

- శ్రీఅరవిందులు

వివేక భారత్‌

‘‘‘దేశప్రజలు ప్రగతిని సాధించడానికి ఉపకరించే పద్ధతిలో స్వామీజీ వేదాంతాన్ని ఆచరణ యోగ్యమైన శాస్త్రంగా విశదీకరించారు. ఆయన వ్యక్తిత్వం చాలా ఉత్కృష్టమైనది. స్వామీజీ గురించి రాసినప్పుడల్లా నేను ఆనందసాగరంలో మునిగితేలుతాను’’

- నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని