మీరేమో గదిలో..ఆడేది స్టేడియంలో!

ఎప్పుడూ ఇంటి పక్క సందులోనో..కాలేజీ మైదానాల్లోనో క్రికెట్‌ ఆడటం.. ఇంతేనా? మీరే ఓ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో.. క్రికెట్‌ అభిమానుల హర్షధ్వానాల మధ్య..కోహ్లిలా సొగసైన షాట్‌లు కొడితే...ఫోర్‌లు, సిక్స్‌లకు గ్యాలరీ మొత్తం కేరింతలతో నిండిపోతే!! వినడానికి.. ఊహించడానికే కాదు....

Updated : 23 Mar 2019 01:31 IST

వర్చువల్‌ క్రికెట్‌

అంకురార్పణ

ఎప్పుడూ ఇంటి పక్క సందులోనో..కాలేజీ మైదానాల్లోనో క్రికెట్‌ ఆడటం.. ఇంతేనా? మీరే ఓ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో.. క్రికెట్‌ అభిమానుల హర్షధ్వానాల మధ్య..కోహ్లిలా సొగసైన షాట్‌లు కొడితే...ఫోర్‌లు, సిక్స్‌లకు గ్యాలరీ మొత్తం కేరింతలతో నిండిపోతే!!
వినడానికి.. ఊహించడానికే కాదు.. వర్చువల్‌ రియాలిటీతో దీన్ని సాధ్యం చేసి చూసించారు త్రివిక్రమ్‌ రెడ్డి, వసంత్‌సాయి.. ఇద్దరూ ఐఐటీయన్లే..వీళ్లే ‘ఐబీ క్రికెట్‌’ రూపకర్తలు.

ఏ గల్లీలో చూసినా కుర్రకారు బ్యాట్‌, బంతి పట్టుకొని కనిపిస్తారు. మన దేశంలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్‌ అది. క్రికెట్‌లో రాణించాలని.. జాతీయ జట్టు తరపున ఆడాలని కలలు కంటారు చాలా మంది. కానీ, ఆ అవకాశం అందరికీ దక్కదు. మరైతే.. కల కలగానే మిగిలిపోవాల్సిందేనా? అక్కడే వీళ్ల ఆలోచన మొదలైంది. వీఆర్‌ని వేదికగా చేసుకుని కలకి రూపం ఇవ్వాలనుకున్నారు. అగ్మెంటెడ్‌, వర్చువల్‌, మిక్స్‌డ్‌ రియాలిటీ కలయికతో క్రికెట్‌ అభిమానుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లగలిగారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), ఏఐ టెక్నాలజీలతో ఆటని మరింత యూజర్‌ఫ్రెండ్లీగా మార్చగలిగారు. ‘ఐబీ క్రికెట్‌’ పేరుతో క్రికెట్‌ అభిమానుల్ని అలరిస్తున్నారు. వయసు, ఫిట్‌నెస్‌తో సంబంధం లేకుండా అన్ని వయసుల వారూ క్రికెట్‌ని ఆస్వాదించేందుకు వర్చువల్‌ క్రికెట్‌ అనువైన వేదిక.

ఎలా ఆడాలంటే?
సింపుల్‌... ఓ వీఆర్‌ హెడ్‌సెట్‌, చేతిలో బ్యాటు. హెడ్‌సెట్‌ని ధరించగానే మీరున్న చోటుని మర్చిపోతారు. అంతర్జాతీయ క్రికెట్‌ ప్లేయరైపోతారు. ప్రత్యర్థి టీమ్‌ గ్రౌండ్‌లోకి అడుగుపెడుతుంది. గ్యాలరీ నిండా ప్రేక్షకులు. అరుపులు, చప్పట్లు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కోవచ్చు. లేదంటే ఇప్పటికే సభ్యులై ఉన్న ఇతర టీమ్‌లతోనూ ఆడొచ్చు. ఇంకా చెప్పాలంటే.. అమెరికాలో ఉన్న మీ మిత్రుడు బౌలింగ్‌ చేస్తుంటే అమలాపురంలో ఉన్న మీరు బ్యాటింగ్‌ చేయొచ్చు. అంపైర్ల మధ్యలో అంతర్జాతీయ ఫార్మెట్‌లోనే అన్నీ సాగుతాయి. మీ ఆటకు తగినట్టుగా కామెంట్రీ, స్కోర్‌బోర్డు అన్నీ లైవ్‌లోనే. ఫోర్‌.. సిక్స్‌.. ఏది కొట్టినా స్టేడియం మొత్తం ఛీర్స్‌ కొడుతుంది. ఆటలో మీరు చేసిన పొరబాట్లను కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో కరెక్టు చేసుకోవచ్చు. అంటే.. మీరో ఏఐ కోచ్‌ని పెట్టుకున్నట్టే. మీరు ఆడుతున్న వర్చువల్‌ మ్యాచ్‌ని ఇతరులు టీవీ, కంప్యూటర్లలో లైవ్‌ చూడొచ్చు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఐదు దేశాల్లో ఐబీ క్రికెట్‌ని పరిచయం చేశాం. క్రికెట్‌కి పెద్దగా ఆదరణ లేని సింగపూర్‌, దుబాయ్‌ల్లోనూ ఐబీ క్రికెట్‌ని ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు కూడా ఈ ఐబీ క్రికెట్‌ ఆడాలనుకుంటే హైదరాబాద్‌, వైజాగ్‌, భీమవరంలాంటి పలు ప్రాంతాల్లో ఈ ఐబీ గేమింగ్‌ జోన్లు ఉన్నాయి. వెళ్లి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనూ మీరూ ఆడొచ్చు.

 


 

మీరే అంతర్జాతీయ ప్లేయర్‌

ఇప్పటి వరకూ వచ్చిన గేమ్స్‌ ఏవైనా మీరో సెలబ్రిటీని సెలెక్ట్‌ చేసుకుని వారి స్థానంలో మీరు ఉన్నట్టుగా ఊహించుకుని గేమ్స్‌ ఆడేవారు. ఉదాహరణకు సచిన్‌ని సెలెక్ట్‌ చేసుకుని మిమ్మల్ని సచిన్‌లో చూసుకునేవారు. ఐబీ క్రికెట్‌ అలా కాదు. మీకు మీరుగానే అంతర్జాతీయ క్రికెటర్‌గా కెరీర్‌ని ప్రారంభించొచ్చు. ఎవరెవరు ఎక్కడున్నా మీ ఫ్రెండ్స్‌ అందరకూ కలిసి టీమ్‌గా ఆడొచ్చు. మీరు చేస్తున్న పరుగులతో మీకో ర్యాంకింగ్‌ వస్తుంది. బీటా టెస్టింగ్‌లోకి భాగంగా ఇప్పటికే పదిహేను వేలమంది యూజర్లు గేమ్‌లోకి లాగిన్‌ అయ్యి ప్లేయర్లుగా ర్యాంకింగ్‌ని మెరుగు పరుచుకుంటున్నారు. క్రికెట్‌ ప్రియులకు మరింత దగ్గరయ్యేలా ‘ఐబీ క్రికెట్‌ సూపర్‌ ఓవర్‌ లీగ్‌’ నిర్వహిస్తున్నారు. ఈ తరహా నిర్వహిస్తున్న మొట్టమొదటి వర్చువల్‌ టోర్నమెంట్‌ ఇదే. సెహ్వాగ్‌, సురేష్‌ రైనా, మెక్‌కల్లమ్‌లతో పాటు మొత్తం 12 మంది అంతర్జాతీయ క్రికెటర్లు లీగ్‌లో పాల్గొంటారు.

త్రివిక్రమ్‌                                              వసంత్‌సాయి

అంకుర సంస్థగా..
ప్రొయుగ పేరుతో మొదట అంకుర సంస్థని స్థాపించాం. దాన్నుంచి రూపుదిద్దుకుందే ఈ ‘ఐబీ క్రికెట్‌’. మేమిద్దం ఫౌండర్లుగా ఉన్న కంపెనీలో బృంద సభ్యులంతా ఐఐటీయన్లే. వర్చువల్‌ రియాలీటీ టెక్నాలజీపైనే మా దృష్టంతా. భవిష్యత్తులో వర్చువల్‌, అగ్మెంటెడ్‌, మిక్స్‌డ్‌ రియాలీటీ టెక్నాలజీ అన్ని రంగాల్లోనూ ప్రవేశిస్తుంది. ఎంతలా అంటే.. ఓ ఇద్దరు వ్యక్తులు వీఆర్‌ హెడ్‌సెట్‌లు పెట్టుకుని ముఖాముఖి మాట్లాడుకుంటారు. ఎవరు ఎక్కడున్నా అంతా కలిసి కూర్చున్నట్టుగా సమావేశాలు నిర్వహించొచ్చు. ఇక విద్యా రంగంలోనైతే వినూత్నమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వందల పేజీలున్న మెకానికల్‌ ఇంజినీరింగ్‌ టెక్స్ట్‌ పుస్తకాల్ని డ్రాయింగ్స్‌, విజువల్స్‌తో సులువుగా అర్ధమయ్యేలా వర్చువల్‌ పాఠాల్ని క్రియేట్‌ చేయొచ్చు. ఎడ్యుకేషన్‌ కంటెంట్‌ని వర్చువల్‌ రియాలిటీతో అందించాలన్నది మాకున్న లక్ష్యాల్లో ఒకటి. వీఆర్‌ టెక్నాలజీకున్న మహత్తుని ప్రపంచానికి పరిచయం చేయడానికే ముందు ‘ఐబీ క్రికెట్‌’ని పరిచయం చేశాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని