వయసు 29.. ఆవిష్కరణలు 100కు పైనే! 

ఇంట్లోకి వచ్చిన వాళ్లకి కాఫీ, టీలు ఇవ్వటానికి రోబోలు చేసిన ఆ కుర్రోడు....పన్నెండేళ్లకే 40 వేల సంవత్సరాల క్యాలెండర్‌ రూపకల్పన.. వరల్డ్‌ రికార్డు మరో ఏడాదికే కృత్రిమ కాలు తయారీ.. ఆ వెంటనే మైనంతో రాకెట్‌ ఇంధనం...అబ్దుల్‌కలాం చేతులు మీదుగా ‘బాలశ్రీ’ అవార్డు..ఇలా వయసుతో పాటు ఎన్నో ఆవిష్కరణలు.. బాలశాస్త్రవేత్త, బాలమేధావిగా గుర్తింపు. ఇప్పుడతని వయసు 29 ఏళ్లు... ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఫోర్బ్స్‌ ఆసియా పురస్కారం సొంతం చేసుకుని, 23 దేశాల్లోని ముప్ఫయ్యేళ్లలోపు వయసుండే స్ఫూర్తిదాయక విజేతల్లో ఒక్కడయ్యాడు....

Updated : 06 Apr 2019 05:31 IST

ఇంట్లోకి వచ్చిన వాళ్లకి కాఫీ, టీలు ఇవ్వటానికి రోబోలు చేసిన ఆ కుర్రోడు....పన్నెండేళ్లకే 40 వేల సంవత్సరాల క్యాలెండర్‌ రూపకల్పన.. వరల్డ్‌ రికార్డు మరో ఏడాదికే కృత్రిమ కాలు తయారీ.. ఆ వెంటనే మైనంతో రాకెట్‌ ఇంధనం...అబ్దుల్‌కలాం చేతులు మీదుగా ‘బాలశ్రీ’ అవార్డు..ఇలా వయసుతో పాటు ఎన్నో ఆవిష్కరణలు.. బాలశాస్త్రవేత్త, బాలమేధావిగా గుర్తింపు. ఇప్పుడతని వయసు 29 ఏళ్లు... ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఫోర్బ్స్‌ ఆసియా పురస్కారం సొంతం చేసుకుని, 23 దేశాల్లోని ముప్ఫయ్యేళ్లలోపు వయసుండే స్ఫూర్తిదాయక విజేతల్లో ఒక్కడయ్యాడు..ఆ యువ శాస్త్రవేత్తే గోరకవి ప్రవీణ్‌కుమార్‌. ఈ నేపథ్యంలో ‘ఈతరం’ పలకరిస్తే... ‘టెక్నాలజీ అందరి ప్రాథమిక హక్కు.. టెక్నాలజీ సమానత్వం ఉన్నప్పుడే అసలైన అభివృద్ధి’ అని చెప్పుకొచ్చారు. సైన్స్‌ అంటే భయం వద్దు..  అర్థం చేసుకుంటే సులభం.. యువత ఈ రంగంలోకి వస్తే ఆర్థికంగా, ‘హార్టికం’గా కూడా ఉన్నతస్థితికి చేరొచ్చు అని ఈతరానికి సూచిస్తున్నాడు.

కెరీర్‌ ట్రాక్‌ రికార్డు, ఫీ ఫ్యాక్టరీ స్టార్టప్‌ వల్లే ఫోర్బ్స్‌ పురస్కారం లభించింది. ఇదో గొప్ప గుర్తింపు, ప్రోత్సాహం, బాధ్యత కూడా. ఈ స్థితి అమ్మానాన్న, గురువుల చలువే..వారి ప్రోత్సాహమే లేకుంటే ఇంతదాకా వచ్చేవాణ్ణి కాదేమో! మా నాన్న పేరు జి.ఎన్‌.శంకర్‌, ట్రిపుల్‌ ఎమ్‌.ఏ., ఎమ్‌.కాం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. బాల్యంలో నేను అడిగే ప్రశ్నల్ని ఏనాడూ కొట్టిపడేయలేదు.. ఓపిగ్గా సమాధానాలిచ్చేవారు. ఒకవేళ తనకి తెలీకుంటే పుస్తకాలు, ప్రొఫెసర్ల ద్వారా తెల్సుకుని మరీ జవాబిచ్చేవారు. అమ్మ పేరు జి.రామలక్ష్మి. ఎమ్‌.ఎ చేసింది, నవలా రచయిత్రి.. మొత్తం 24 నవలలు రాసింది. సాయిబాబా సచ్ఛరితం, తిరుపతి దేవస్థానంపై పుస్తకాలు రాసింది. నా కోసమే.. నవలా రంగాన్ని వదిలేసుకుంది మా అమ్మ. ఇక మా అన్నయ్య నా కంటే పదేళ్లు పెద్ద. అతని పుస్తకాల్లోని సైన్సుపాఠాల్ని చిన్న తరగతుల్లోనే అర్థం చేసుకునేవాణ్ణి. మా అన్నయ్య అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారిప్పుడు.


 

ఇదే ‘ఫీ ఫ్యాక్టరీ ’
మన దేశంలోని చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తేనే మంచి ఉత్పత్తులు వస్తాయి. దేశ ఆర్థికవృద్ధి కలుగుతుంది. మా ఫీ ఫ్యాక్టరీ స్టార్టప్‌.. సాంకేతికతను అమ్మటం, పంచటమే కాదు.. ప్రతిభ ఉన్న ఐడియాలను వెతికి.. ఇన్‌పుట్స్‌ ఇచ్చి, ప్రోత్సహించి చిన్న,మధ్యతరగతి పరిశ్రమలకు టెక్నాలజీ అందేట్లు చేస్తుంది. సమాజం చైతన్యంగా, సౌకర్యవంతంగా ఉండాలంటుంది సైన్సు. మా ఫీ ఫ్యాక్టరీ స్టార్టప్‌ ఉద్దేశం కూడా ఇదే. మేం ఇటీవలే జీఎఫ్‌పీ (గోరకవి ఫిల్లర్‌ పార్టికల్స్‌) అనే పౌడర్‌తో ప్యాకేజింగ్‌లో ఉపయోగపడే బ్రౌన్‌ పేపర్‌ను తయారు చేశాం. ఇది గట్టిగా, తేలికగా ఉంటుంది. వాస్తవానికి ఈ టెక్నాలజీని పండ్లరసాల  సంస్థల ప్యాకేజ్‌లకి అమ్మొచ్చు. మేం అలా చేయలేదు. దేశంలోని 45 చిన్న,మధ్యతరగతి పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మా స్టార్టప్‌ కేవలం నాలుగు నెలల సమయంలోనే 200 విశ్వవిద్యాలయాలతో అనుసంధానమైంది. ఇప్పటికే 28 కోట్ల రూపాయల వ్యాపారం చేశాం. ఇలా టెక్నాలజీతో అందరికీ లాభం చేకూరాలి. అనతికాలంలోనే ఈ స్టార్టప్‌ని ఫోర్బ్స్‌ సైతం గుర్తించటం ఎంతో ఆనందదాయకం..


 

అన్నయ్యను నిద్రలేపటానికి రోబో చేశా..
రెండోతరగతి నుంచే మానాన్న కొనిచ్చిన బొమ్మల్ని విడగొట్టి వాటి విడిభాగాలతో ప్రయోగాలు చేసేవాణ్ణి. బొమ్మలు పోయినా ఇంట్లో తిట్టలేదు. అప్పట్లో నేను చేసిన బుల్లి ఇన్నోవేషన్స్‌ నాకు ఇంకా గుర్తున్నాయి. మా ప్రిన్సిపాల్‌ అయితే ఉపయోగం లేని వస్తువుల్నిచ్చి వాటితో పనికొచ్చేవి చేయమనేవారు. ఆరోతరగతిలోనే సొంతంగా రోబోలు తయారు చేశా. మా అన్నయ్యకు నిద్రెక్కువ. తనను నిద్రలేపటానికి ఓ రోబో కుక్కపిల్ల తయారు చేశా. నిద్ర లేవటం ఆలస్యమైతే చాలు రోబో కుక్కపిల్ల అన్నయ్యమీదకి వెళ్లి సుస్సుపోసేది. ఇంట్లోకి వచ్చిన అతిథులకు టీ, కాఫీలు తెచ్చిచ్చేందుకు ఓ రోబో చేశా. ఇలా చిన్నప్పుడు యాభై రోబోలు చేశా.


 

ఎనిమిదో తరగతిలో 40వేల సంవత్సరాల క్యాలెండర్‌..
ఇంట్లోనే చిన్న డేరా వేసుకుని.. అందులోనే పడుకునేవాణ్ణి. అదే నా ప్రయోగశాల. దానికి మళ్లీ ఓ రోబోను కాపలా ఉంచుకునేవాణ్ణి.  ఒకరోజు ఎ.డి., బి.సి అంటే ఏమిటి అని మా నాన్నను అడిగా. ‘ఆఫ్టర్‌ డెత్‌.. బిఫోర్‌ క్రైస్ట్‌’ అని చెప్పారు. ‘అలాగయితే క్రీస్తు జీవించిన 32 ఏళ్లు ఏమయ్యాయని అడిగా. నాన్న వెంటనే ఓ.యూ. చరిత్ర విభాగానికి కాల్‌ చేసి ఎ.డి అంటే ‘అన్నో డొమినీ (జీసస్‌ పుట్టినప్పటి నుంచీ అని అర్థం)’ అని జవాబిచ్చారు. ‘క్రీస్తు పుట్టింది జనవరి 1 తేదీ కావాలి కదా.. మరి డిసెంబరు 25న పుట్టినరోజెందుకు చేసుకుంటున్నాం? మధ్యలో అరు రోజులేవీ’? అని ప్రశ్నించా. ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రపంచంలోని 30 రకాల క్యాలెండర్లు పరిశీలించా. అన్నిచోట్లా ఏదో గందరగోళం. దీంతో మొదట 150 సంవత్సరాలు.. తర్వాత రెండువేల సంవత్సరాలు.. చివరగా 40వేల సంవత్సరాల క్యాలెండర్‌ రూపొందించా. ఇదో వరల్డ్‌ రికార్డు. నేనప్పుడు ఎనిమిదో తరగతి, వయసు పన్నెండేళ్లు. ఆ తర్వాత అంధులకోసం 30వేల సంవత్సరాల క్యాలెండర్‌ను బ్రెయిలీలో చేశా. ఆ క్యాలెండర్‌ కార్యక్రమానికి వచ్చిన దివ్యాంగులను చూసి బాధపడ్డా. కొందరు కృత్రిమకాళ్లు అమర్చుకున్నారు కానీ అవి అంత అనువుగా లేవని అనిపించింది. దీంతో డ్యురాలమిన్‌ అనే పదార్థంతో చవకైన, తేలికైన కృత్రిమకాలును తయారు చేశా. అది మోకాలు, మడిమల దగ్గర వంగేలా ఉండటం గమనార్హం. దీంతో 20 కిలోమీటర్ల వేగంతోనైనా పరుగెత్తొచ్చు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేనపుడు కొవ్వొత్తి మైనాన్ని బాగా వేడిచేశా. అది కరిగి కరిగి చివరికి భగ్గుమని మండిపోయింది. మైనంతో రాకెట్‌ ఇంధనం చేయచ్చనే ఆలోచన దీన్నుంచే పుట్టుకొచ్చింది. అదే సమయంలో అబ్దుల్‌ కలాంగారి చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘బాలశ్రీ’ అవార్డును అందుకోవటం మర్చిపోలేని అనుభూతి. నా ప్రయోగాలు చూసి.. బాలశాస్త్రవేత్త, బాలమేధావి అనేవారు. అప్పుడప్పుడూ కలాంగారితో ఉత్తరప్రత్యుత్తరాలు కూడా చేస్తుండేవాడిని.


 

కొన్ని కమర్షియల్‌ ఇన్నోవేషన్స్‌
40వేల సంవత్సరాల క్యాలెండర్‌, 30వేల సంవత్సరాల బ్రెయిలీ క్యాలెండర్‌ కృత్రిమ కాలు తక్కువ ఖర్చుతో ఫుడ్‌ ప్రిజర్వేటర్‌ బ్రెయిలీ టైప్‌రైటర్‌ (600 విడిభాగాలను కేవలం 24 విడిభాగాలకు తగ్గించి ధరనూ, బరువును గణనీయంగా తగ్గించాడు. స్పైనల్‌ రీస్టోరేషన్‌ (ఎముకలు విరిగిపోయినపుడు ఇంజక్షన్‌ ఉపయోగించి సెట్‌ చేయడం) అతి తక్కువ ధరలో నీళ్ల ఫ్యూరిఫికేషన్‌ టెక్నాలజీ ప్రపంచమంతా అంతరించిపోతే విత్తనాల్ని కాపాడే టెక్నాలజీ ప్యాకెట్స్‌లో ఫోమ్‌లా ఉండే దోశపిండి బయోఇథనాల్‌ క్యాటలిస్ట్‌ పత్తినుంచి బయోడీజిల్‌ ప్రస్తుతం అగ్రికల్చర్‌ వేస్ట్‌ నుంచి ఏవియేషన్‌ ఫ్యూయల్‌ చేస్తున్నారు.


 

సైన్సు అంటే భయం పోవాలి..
ఆల్టర్‌నేట్‌ కరెంట్‌ను కనిపెట్టిన నికోలస్‌ టెస్లా అంటే నాకిష్టం. ఆయనే నాకు స్ఫూర్తి. ఆయనలా శాస్త్రవేత్తనవ్వాలనుకున్నా. నా గురించి చిన్నపిల్లలకు తెలియాలనే ఆశ ఉండేది. అమెరికాలోని ఓ రచయిత్రి మలాలా, ఎమ్మావాట్సన్‌.. లాంటి 50 అన్‌స్టాపబుల్‌ కిడ్స్‌ గురించి పుస్తకం రాస్తే.. అందులో నా గురించి రాయటం గ్రేట్‌గా ఫీలయ్యా.

ఓ.యూ.లో కెమికల్‌ ఇంజనీరింగ్‌ చదివా. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీలో చేరాను. కొన్ని కారణాల వల్ల డ్రాపవుట్‌ అయ్యా. ఇప్పటివరకూ 100 ఇన్నోవేషన్స్‌ చేస్తే అందులో 28 ఇన్నోవేషన్స్‌ అమెరికా, యూరప్‌ దేశాలకి అమ్మాను. భారతీయుడిగా పెద్ద దేశాలకు ఇన్వెన్షన్స్‌ అమ్మటం గొప్ప అనుకున్నా. 250 రంగులనిచ్చే నెయిల్‌ పెయింటర్‌ పెన్‌ను కనుగొన్నా. నా గొప్ప విజయం, పరాజయం కూడా అదే. దాన్ని ఓ సంస్థకి అమ్మేస్తే ‘నెయిల్‌ పాలిష్‌ సీసాలను అమ్మితే లాభం. ఇదెందుకూ? అని నా టెక్నాలజీని పక్కనబెట్టింది. ఇలాంటి కష్టాలు, గుణపాఠాలెన్నో తగిలాయి. అన్నీ మంచికే అనుకున్నా. ప్రస్తుతం మన దేశం కోసమే టెక్నాలజీని తయారు చేయాలని నిర్ణయించుకున్నా. కార్బన్‌ ఫైబర్‌ టెక్నాలజీ మీద పనిచేస్తున్నాం. దీంతో రాకెట్స్‌ చేయనున్నాం. ప్రైవేటు రాకెట్లను తయారు చేయటంలో ఆసియానుంచి తొలి ఏవియేషన్‌ స్టార్టప్‌ మాదే. నాకు తెలిసి.. సమస్యను గుర్తిస్తే సగం పరిష్కారం లభించినట్లే. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మనకి టెక్నాలజీ సమానత్వం లేదు. దీన్ని మనం సాధించాలి. అలా కావాలంటే పిల్లల్లో సైన్సు అంటే భయం తగ్గించి, ఇష్టం పెంచాలి. సైన్సుతోను డబ్బులు బాగా సంపాదించొచ్చు. మీకు ల్యాబ్‌ కావాలంటే కొన్ని ప్రభుత్వ సంస్థలు ప్రొఫెసర్లు, సహాయకులను నియమిస్తాయి. ఇలాంటి అవకాశాన్ని యువత ఉపయోగించుకోవాలి. ఇతరుల సమస్యను మీ సమస్యగా భావించి స్టార్టప్స్‌ చేస్తే పదిమందికి ఉపయోగపడతాయి. నేను వాణిజ్యపరంగా మూడు ఇన్నోవేషన్స్‌ కనుగొంటే.. వాటిలో కనీసం ఒకటి సమాజానికి ఉపయోగపడాలన్నదే నా లక్ష్యం. జర్మనీలో శాస్త్రవేత్తలు నడుస్తుంటే వాళ్లతో జనాలు ఫొటోలు, సెల్ఫీలు దిగుతారు. అలా మన దగ్గరా శాస్త్రవేత్తల్ని గుర్తించే రోజు రావాలి. మనదేశం సైన్సులో దూసుకెళ్లాలన్నదే నా కల.

- రాళ్లపల్లి రాజావలి, ఫొటోలు: వసంత్‌ ఘంటసాల

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని