మళ్లీ తన ముఖం చూడలేదు

ఒక్కోసారి ఇబ్బంది పడ్డా... అదీ మన మంచికే అనుకోవాలి. దేన్నైనా నమ్మండి.. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. ఎందుకంటే నా జీవితంలో జరిగిన సంఘటన నన్ను ఛిన్నాభిన్నం చేసింది.

Published : 01 Jun 2019 01:32 IST

ఒక్కోసారి ఇబ్బంది పడ్డా... అదీ మన మంచికే అనుకోవాలి. దేన్నైనా నమ్మండి.. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. ఎందుకంటే నా జీవితంలో జరిగిన సంఘటన నన్ను ఛిన్నాభిన్నం చేసింది.
నాకు ఇద్దరు అక్కలు, ఒక చెల్లి. ఒక్క అబ్బాయినే అవడంతో గారాబంగా పెంచారు. నేను గవర్నమెంట్‌ ఉద్యోగం చేయాలన్నది మా నాన్న కోరిక.  నా లక్ష్యమూ అదే. అయితే మనసు మాట వినదే. ఇంటర్‌ సెకండియర్‌ అయిపోతుందనగా స్నేహలత నా మనసులోకి ప్రవేశించింది.  చదువు అటకెక్కింది. స్నేహే లోకమైంది. ఇంటర్‌ పాసయ్యాను. డిగ్రీ పూర్తిచేసే సమయానికి మా విషయం ఇంట్లో తెలిసిపోయింది. అమ్మా నాన్న నచ్చజెప్పారు. అయినా వినలేదు. పై చదువులు చదవమన్నారు. ఉద్యోగం చేస్తానని వేరే ఊరికి వచ్చాను. వచ్చిన జీతంలో రూపాయి మిగల్చకుండా అంతా స్నేహ కోసమే ఖర్చు పెడుతూ వచ్చాను. అదీ సరిపోక ఇంకా ఇంటి దగ్గరి నుంచి డబ్బులు తెచ్చుకునేవాడ్ని. ఆమెకే కాకుండా వాళ్ల అక్క కోసమూ ఖర్చు పెట్టేవాడ్ని. ఎందుకంటే స్నేహ వాళ్లింట్లోనే ఉండేది. అక్క, పిల్లలకు ఒంట్లో బాలేదు. బావ మంచి వాడు కాదు, ఒక్క రూపాయి ఇవ్వడు అంటూ ఎప్పుడూ ఏదో కారణంతో డబ్బులడిగేది. ఒకసారి బంగారు తనఖా పెట్టి మరీ డబ్బులిచ్చా. నాన్నకు తెలిసి డబ్బులిచ్చి విడిపించాడు. ‘ఒరేయ్‌ ఒకసారి ఆ అమ్మాయి గురించి తెలుసుకోరా’ అని చెప్పినా వినిపించుకోలేదు. నెమ్మదిగా హైదరాబాద్‌లో ఉంటున్న చెల్లి వాళ్లింటికి మకాం మార్చాను. ఆమె వాళ్ల అక్కబావతో కలిసి హైదరాబాద్‌కు వచ్చేసింది. నేనే దగ్గరుండి ఇల్లు అద్దెకిప్పించా. ఇక్కడా ఖర్చంతా నేనే భరించేవాడ్ని. నాకు షిఫ్ట్‌లవారీగా డ్యూటీ ఉండేది. ఇంటికి ఫోన్‌ చేయకపోయినా, సమయం దొరికినప్పుడల్లా తనకు ఫోన్‌ చేసేవాడిని. నా టైమింగ్స్‌ ఏంటో తెలుసు కాబట్టి వేరేవాళ్లతో సఖ్యతగా మెలిగేది. అనుకోకుండా ఫోన్‌ చేస్తే ఏవో సాకులు చెప్పేది. స్నేహ, వాళ్ల అక్క ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఒక రోజు ఉన్నట్టుండి స్నేహ ఫోన్‌ చేసింది. ‘వీధిలో వాళ్లు మమ్మల్ని తిడుతున్నారు. నిన్ను రమ్మంటున్నారు’ అనే సరికి వెంటనే వెళ్లాను. అక్కడికెళ్లాక తెలిసింది ఏంటంటే ఇంటి ఓనర్‌ మేడమీదికొచ్చినప్పుడు వాళ్లక్క, ఆమె సన్నిహితుడు  కలిసి ఓనర్‌ను కట్టేసి నగలతో పారిపోయారు. స్నేహ దొరికిపోయింది. నేను వెళ్లే సరికి నన్నూ పట్టుకున్నారు. ఆవేశంగా ఉన్న ఆ ఇంటి యజమాని, వీధిలో వాళ్లు మా మీద చేయిచేసుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లారు. నా ప్రమేయం లేకుండా తప్పు చేసిన వాడిలా తల దించుకోవాల్సి వచ్చింది. ‘స్నేహా ఇదంతా ఏంటని’ అడిగితే తను పలకలేదు. తన కళ్లల్లో ఎలాంటి భయం, సిగ్గు, పశ్చాతాపం కనిపించలేదు. ఒక్కసారిగా కళ్లముందు అమ్మా, నాన్న అందరూ కనిపించారు. నా గురించి తెలిస్తే మా పరువు పోతుంది రకరకాల ఆలోచనలతో తెల్లారిపోయింది. నేను ఇంటికి రాలేదని రాత్రంతా చెల్లి ఫోన్‌ చేస్తూనే ఉంది. పోలీసులను బతిమిలాడగా 11.30 సమయంలో ఫోన్‌ ఇచ్చారు. చెల్లికి విషయం చెప్పాను. వెంటనే నాన్న హైదరాబాద్‌కు వచ్చి నన్ను విడిపించాడు. ఇంత జరిగినా తను నాతో ఏం మాట్లాడలేదు. నేను ప్రయత్నించినా స్పందించలేదు. తను నన్ను ఎంత మోసం చేసిందో నాకు తెలిసొచ్చింది. మళ్లీ ఎప్పుడూ తను ముఖం చూడలేదు. రెండేళ్లు గడిచేసరికి... నేను తన మాయలోంచి బయటపడ్డాను. అమ్మానాన్నలు చెప్పినట్లు నడుచుకుంటున్నా. మంచి ఉద్యోగం, భార్య, పిల్లలు ఇప్పుడు నా జీవితం హాయిగా సాగుతోంది.
ఫ్రెండ్స్‌... అమ్మాయి మోసం చేసిందని నేను ఆరోజు ఆత్మహత్యాయత్నం లాంటి పిచ్చిపనులు చేసుంటే.. నా తల్లిదండ్రులు ఎంత బాధపడేవారు? కాస్త ఓపికతో జీవితాన్ని చక్కదిద్దుకోకుంటే... ఈరోజు నేను ఇలా ఉండేవాడ్ని కాదు. దయచేసి ప్రేమించే వారి గురించి పూర్తిగా తెలుసుకోండి.

- నవీన్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని