నా చివరి శ్వాస వరకూ.!

కొన్ని జీవితాలు కష్టపడటానికే పుడతాయి. నా జీవితమూ అలాంటిదే. 16 ఏళ్ల వరకూ హాయిగా సాగిపోయింది. నాన్న నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకునేవారు. కన్నీటి చుక్క ఎలా ఉంటుందో తెలియనంత అందమైన బాల్యం నాది. అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో....

Published : 19 Oct 2019 00:43 IST

కొన్ని జీవితాలు కష్టపడటానికే పుడతాయి. నా జీవితమూ అలాంటిదే. 16 ఏళ్ల వరకూ హాయిగా సాగిపోయింది. నాన్న నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకునేవారు. కన్నీటి చుక్క ఎలా ఉంటుందో తెలియనంత అందమైన బాల్యం నాది. అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్న చనిపోవటంతో జీవితం నరకప్రాయంగా తయారైంది. ఆ రోజు నుంచి కన్నీరు నా చెంపల మీద జారని రోజంటూ లేదు. కంటికి రెప్పలా చూసుకుంటాడనుకున్న అన్నయ్య ప్రేయసి ప్రేమలో పడి పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. అమ్మనాన్నల మరణం తరవాత నా బాధ్యత పిన్నివాళ్ల మీద పడటంతో వాళ్లు ఎప్పుడెప్పుడు నా బరువు దించుకుందామా అని చూసేవారు. చిన్నపిల్లనన్న జాలి లేకుండా  పెళ్లి అనే నరకంలోకి నెట్టేశారు. నిజంగా నరకమే అది. ఆ విషయంలో వారి మీద కోపం ఎప్పటికీ పోదు. పెళ్లై వెళ్తుంటే నన్ను దూరం చేసుకుంటారన్న బాధ వారిలో కనిపించలేదు. ఇప్పటికీ ఆ క్షణాలు తలచుకుంటే కన్నీరు ఆగదు. వద్దని ఎంతగా ఏడ్చానో.. ఇక తప్పదని తెలిసి మెట్టినింటిలోనైనా సంతోషమైన జీవితాన్ని, అందమైన బంధాలను అల్లుకుందామనుకున్నా. కానీ విధికి నేను సంతోషంగా ఉండటం నచ్చినట్టులేదు. కలలు కలలుగానే మిగిలిపోతాయని తెలుసుకోవటానికి వారం పట్టలేదు.
     అది వర్షాకాలం జోరుగా వర్షం కురుస్తోంది. చిన్నప్పుడు చినుకుల్లో తడుస్తూ డాన్స్‌ చేయటం అంటే మహా సరదాగా ఉండేది. కానీ ఇప్పుడు పంజరంలో చిలుకలా బంధి అయ్యాను. కిటికీ అద్దంలోంచి బయటకు చూస్తూ జీవితం కోల్పోయిన దానిలా ఈ చీకట్లను చీల్చుకువచ్చే మెరుపుల్ని, ఉరుముల్ని చూస్తూ కూర్చున్నా. ఇప్పుడు ఏడ్చేందుకు కన్నీటి బొట్టు కూడా మిగల్చకుండా పీల్చేసుకుందీ జీవితం. జీవం లేని మొహం.. మిగిలిందంతా నిస్సారం. బయట కారు ఆగిన శబ్ధం అయింది. కారు ఫ్లడ్‌ లైట్ల కాంతి కిటికీ అద్దం నుంచి లోపలి గోడ వరకు పడుతుంది. కారు తలుపు తెరుచుకుని బయట అడుగుపెట్టాడు. ఆయన వస్తున్నాడన్న ఊహే నాకు ఒంట్లో వణుకుపుట్టిస్తుంది. మెట్లమీద నుంచి బూట్ల శబ్ధం వినిపిస్తుంది. ఆ శబ్ధం దగ్గరికి వస్తున్నా కొద్దీ నా గుండె వేగం పెరిగిపోతుంది. దగ్గరి దాకా వచ్చాడు తలుపు గడియ పెడదామని వెళ్లాను. కానీ ఆలస్యం చేస్తే ఇంకా బాదుతాడని భయమేసి లైట్లన్నీ ఆర్పేసి చీకట్లో గోడకి నక్కి కూర్చున్నా. అప్పుడు నా పరిస్థితి చూసి నాకే జాలేసింది. ఎలాంటి జీవితం ఎలా అయిపోయింది. మా నాన్న గుర్తొచ్చాడు. బతికొచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తే బాగుండనిపించింది. గట్టిగా ఒకసారి హత్తుకుని ఏడవాలనిపించింది. తను లోపలికొచ్చి వెతుకుతున్నట్టుగా బూట్ల శబ్ధం చెబుతుంది. గట్టిగా అరుస్తూ పిలుస్తున్నాడు. మొబైల్‌ టార్చ్‌ ఆన్‌ చేసి వెతుకుతున్నాడు. ఆ టార్చ్‌ గదంతా తిరుగుతూ నా మొహం మీద పడింది. తల పట్టుకుని నేల మీదికి విసిరికొట్టాడు. ఆ దెబ్బకు శరీరం అంతా కంపించిపోయింది. అలసిపోయేదాకా కొట్టి వెళ్లిపోయాడు. ఆ దెబ్బలు నా జీవితం మీద కొట్టినట్లనిపించింది. ఇలానే ఉంటే నేను ఇక్కడే చనిపోతానేమో అని భయమేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ధైర్యం చేసి బయటపడ్డాను. మా అన్న దగ్గరికి వెళ్లి నేనక్కడ ఉండను. చదువుకుంటాను. అని చెప్తే పెద్ద గొడవైపోయింది. మా వదిన అసలు ఒప్పుకోలేదు. మా నాన్న కలగన్నట్లు నేను డాక్టర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నా. ప్రముఖ కళాశాలలో మెడికల్‌ సీటు ఉచితంగానే వచ్చింది. కష్టపడి చదివాను. రోజూ ఇంట్లో తిండి దండగ అని తిడుతుంటే భరించాను. నేను చదువుకున్న స్కూల్లోనే సాయంత్రం పూట పాఠాలు చెబుతూ ఖర్చులకు డబ్బులు సంపాదించుకున్నాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది ఒక్కరు కూడా ప్రేమగా చూడలేని నా బతుకు ఎందుకని. చదువు పూర్తి అయింది ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్‌గా ఉద్యోగం కూడా దక్కింది. కానీ కొన్నేళ్లుగా ఒత్తిడిలో ఉండటం, విపరీతంగా చదవటం, నిద్రలేమి, బతుకు పట్ల, జీవితం పట్ల విపరీతంగా ఆందోళన చెందటం. ఇవన్నీ కలిసి నా ఆరోగ్యం మీద దెబ్బకొట్టాయి. రెండోసారి హర్ట్‌ఎటాక్‌ వచ్చింది. జీవితం ఇంకా కుంగిపోయింది. ఇలా నిస్సారంగా సాగిపోతున్న నా జీవితంలో ఒక మలుపు. ఓ రోజు ఆసుపత్రిలో.. ఆడపిల్లను కని చనిపోయింది ఒక ఆవిడ. తన భర్త పాపను అక్కడే వదిలేసి వెళ్లాడు. ఒక అనాథగా ఆడపిల్ల ఎంత కష్టపడాల్సి వస్తుందో నాకు తెలుసు. ఆ కష్టం పాపకు రాకూడదనుకున్నా.. అందుకే చేరదీశాను. ఆ క్షణంలో నా ఆరోగ్యం బాగా లేదన్న విషయం మరిచిపోయాను. నేను పోతే ఈ బుజ్జిదాని బతుకు ఏమైపోతుందో అన్న ఆలోచన చేయలేదు. ఆరోగ్యం ఇంకా క్షీణించటంతో అందరికీ దూరంగా వచ్చి చిన్న ఆసుపత్రి పెట్టాను. దాని ముద్దుముద్దు మాటలతో, నవ్వులతో జీవితం ఇప్పుడు సాఫీగానే సాగుతున్నా ఎప్పుడూ వదలని కష్టాలు నన్ను చుట్టుముట్టేందుకు సిద్ధంగానే ఉంటాయన్న భయమూ వెంటాడుతూనే ఉంటుంది. నన్ను నా అన్నవాళ్లు విస్మరించినా, జీవితం విస్మరించినా, ఆరోగ్యం సహకరించకపోయినా.. ఒంటరిగా నా పోరాటాన్ని మాత్రం ఆపను. నా చివరి శ్వాస వరకూ పోరాడటానికైన సిద్ధమయే ఉన్నాను.                                                                                                                        

- లయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని