నీ కోసమే నిరీక్షణ..

డిగ్రీ పూర్తై జాబ్‌ కోసం వెతుకుతున్న రోజులవి. ఓరోజు ఫేస్‌బుక్‌ తెరిచా. ‘హాయ్‌.. నాకు క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింద’నే మెసేజ్‌ కనిపించింది. పంపింది నా క్లాస్‌మేట్‌. టెన్త్‌ వరకూ టామ్‌ అండ్‌ జెర్రీలా ఉండేవాళ్లం. ‘కంగ్రాట్స్‌’ చెబితే సాయంత్రం ‘థాంక్స్‌’ అంది. అది మొదలు మేం ఒకర్నొకరం పలకరించుకోని రోజు లేదు....

Published : 26 Oct 2019 00:56 IST

డిగ్రీ పూర్తై జాబ్‌ కోసం వెతుకుతున్న రోజులవి. ఓరోజు ఫేస్‌బుక్‌ తెరిచా. ‘హాయ్‌.. నాకు క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింద’నే మెసేజ్‌ కనిపించింది. పంపింది నా క్లాస్‌మేట్‌. టెన్త్‌ వరకూ టామ్‌ అండ్‌ జెర్రీలా ఉండేవాళ్లం. ‘కంగ్రాట్స్‌’ చెబితే సాయంత్రం ‘థాంక్స్‌’ అంది. అది మొదలు మేం ఒకర్నొకరం పలకరించుకోని రోజు లేదు. కొన్నాళ్లయ్యాక శిక్షణ కోసం బెంగళూరు వెళ్తున్నానంది. అదే సమయంలో నాకూ ఉద్యోగమొచ్చింది. మామధ్య దూరం పెరిగినా ఫోన్లు, ఆన్‌లైన్‌ పలకరింపులతో దగ్గరయ్యాం.
తన మాటల్లో ఒక్కోసారి ఏదో చెప్పలేని బాధ కనిపించేది. ఉండబట్టలేక ఓ రోజు అడిగా. ‘ఏదో ఫ్యామిలీ ప్రాబ్లెమ్‌లే’ అంటూ దాటవేయబోయింది. ‘బాధలు చెప్పుకుంటే తగ్గుతాయి. అయినా నేను నీకు మరీ అంత దూరమా?’ అన్నా. నోరు విప్పింది. మా చెల్లి ఓ అబ్బాయిని ప్రేమిస్తోంది. తను లేకపోతే చనిపోతానంటోంది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే గొడవలవుతాయంటూ బాధ పడింది. కొద్దిరోజులు గడిస్తే పరిస్థితులు అవే సర్దుకుంటాయి. దానికేదైనా మార్గం ఆలోచిద్దామని ఓదార్చా. అప్పట్నుంచి ప్రతి విషయం నాతో పంచుకునేది. శిక్షణయ్యాక హైదరాబాద్‌ తిరిగొచ్చింది. జాబ్‌ పార్టీ అడిగా. సినిమా టికెట్లు బుక్‌ చేసింది. నా ఫ్రెండ్‌, తన స్నేహితులు ఐదుగురం వెళ్లాం. నా పక్కనే కూర్చున్నా నోట మాట పెగల్లేదు. చివర్లో అందరం ‘బై’ చెప్పుకున్నాం. ‘నీతో ఏమీ మాట్లాడలేకపోయా. నాకంతగా నచ్చలేదు’ అని సాయంత్రం మెసేజ్‌ చేశా.
ప్రతి రాత్రి 11గం.లకు ఫోన్‌ చేసుకునేవాళ్లం. ఓసారి మాటల్లో ఉండగానే ‘నీకెలాంటి అబ్బాయి కావాలి?’ అనడిగా. నేనూహించినట్టే, నాలో ఉన్న లక్షణాలే చెప్పింది. ఆరోజే తనపై ప్రేమ చిగురించింది. ఎన్నోసార్లు ప్రపోజ్‌ చేయాలనుకున్నా. ఎలా రియాక్ట్‌ అవుతుందో తెలియక భయంతో ఆగిపోయా. ఇలా కాదనుకొని రివర్స్‌లో వెళ్లాలనుకున్నా. నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నానని మెసేజ్‌ పెట్టా. ‘వావ్‌.. ఎవరామె? ఏం పేరు? ఎక్కడుంటుంది?’ ఫోన్‌ చేసి ఆతృతగా అడిగింది. మాట దాటేసా. ఆపై మేం మాట్లాడుకున్నప్పుడల్లా తనకి అదే టాపిక్‌.   ఓ సారైతే ‘తను అదృష్టవంతురాలు. నిజంగా నీలాంటివాడు దొరకడం లక్కీ. తను ఒప్పుకోకపోతే చెప్పు నేను ఒప్పిస్తాన’ంది. ఆ మాటతో నాకు ధైర్యం పెరిగింది. కొన్నాళ్లు ఉడికించాక అది నువ్వేనన్నా. తన మొహంలో ఏ ఫీలింగూ లేదు. ‘నేన్నిన్ను ఎప్పుడూ అలా చూడలేదు. మంచి ఫ్రెండ్‌గానే భావించా’ అంది. ఆ మాటతో నా గుండె చెరువైంది. అతి కష్టమ్మీద ఆ బాధ నుంచి తేరుకొని ఎప్పట్లాగే ఫ్రెండ్స్‌లాగ ఉందామన్నా. సరేనంది.
కొద్దిరోజులయ్యాక ‘నిజంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అంది. సంతోషంతో నా పాదాలు భూమ్మీద నిలవలేదు. నువ్వొప్పుకుంటే ఇప్పుడే.. ఈ క్షణమే చేసుకుంటానన్నా. కొంచెం సమయం ఇవ్వమంది. తనతో జరగబోయే పెళ్లి ఊహించుకుంటూ కలల్లో తేలిపోయా. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మళ్లీ ఏమైందో తెలియదు ‘నీ మెసేజ్‌లో ఉన్న ప్రేమ మాటల్లో కనిపించలేదు. సారీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను’ అంది. ఆ షాక్‌తో కన్నీళ్లాగలేదు.
ఇంత జరిగినా తను నా ప్రేమను, పెళ్లిని ఒప్పుకుంటుందనే నమ్మకముండేది. ఏ చిన్న అవకాశం వచ్చినా తనపై నాకెంత ప్రేమ ఉందో చెప్పాలని తపించేవాణ్ని. నేనోసారి బెంగళూరు టూరుకెళ్లా. వచ్చేటప్పుడు నా ఫ్రెండ్స్‌తోపాటు తనకీ ఓ రిస్ట్‌వాచీ తెచ్చి ఇచ్చా. ఇంటికెళ్లాక ఓపెన్‌ చేయమని చెప్పా. ఏవైనా గిఫ్ట్‌లైతే వద్దంది. అదేం కాదన్నా. ఇంటికెళ్లాక మెసేజ్‌ చేసింది. ‘నువ్వు నన్ను మోసం చేశావు. వద్దన్నా నాకు వాచీ ఇచ్చావు. ఇంకెప్పుడూ నాతో మాట్లాడకు’ అని. అందర్లాగే తనకీ ఒక ఫ్రెండ్‌లా వాచీ ఇచ్చా. పెద్ద ఖరీదేం కాదు. అందులో నేను చేసిన తప్పు, మోసమేంటో అర్థం కాలేదు. అదే విషయం చెబుదామంటే నా నెంబర్‌ని బ్లాక్‌ చేసింది. ఫోన్‌ చేయదు. వాళ్ల చెల్లితో వాచీ తిరిగి పంపించింది. ఆ రోజు నుంచి నాకు రోజూ నరకమే. ఇది జరిగి ఏడునెలలైంది. ఇప్పటికీ తన ఫోన్‌కాల్‌, మెసేజ్‌ కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. ప్లీజ్‌ ఒక్కసారి మాట్లాడు. నేను చెప్పేది విను. ఏదైనా తప్పుచేస్తే క్షమించు. నేను చేసిన ఆ చిన్న పొరపాటుకు ఇంత శిక్ష వేయడం భావ్యం కాదని వేడుకుంటున్నా.          

- ఉమా నాగరాజ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని