కారుణ్య శబ్ద చైతన్యం

సంస్థ.. సినిమా.. సామాజిక చైతన్యం..దేని గురించి చెప్పడానికైనా ‘ఏవీ’లు (ఆడియో విజువల్‌) చేస్తారు..అందుకే దాన్నే కెరీర్‌గా ఎంచుకున్నాడు సంతోష్‌ కుమార్‌..ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.. అంతేనా.. ఏకంగా తన కారునే స్టూడియోగా మార్చేశాడు....

Published : 04 Jan 2020 01:01 IST

సంస్థ.. సినిమా.. సామాజిక చైతన్యం..దేని గురించి చెప్పడానికైనా ‘ఏవీ’లు (ఆడియో విజువల్‌) చేస్తారు..అందుకే దాన్నే కెరీర్‌గా ఎంచుకున్నాడు సంతోష్‌ కుమార్‌..ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.. అంతేనా.. ఏకంగా తన కారునే స్టూడియోగా మార్చేశాడు.. ‘మీడియా ఎఫ్‌.ఎక్స్‌’ అనే సంస్థను స్థాపించి పలు సామాజిక అంశాలపై ప్రజల్ని చైతన్య పరుస్తూ తనదైన ప్రత్యేకతను చాటుతున్నాడు..
విశాఖ నగరానికి చెందిన వై.సంతోష్‌ కుమార్‌ చిన్ననాటి నుంచి విభిన్నంగా, వినూత్నంగా ఆలోచించడానికి ఇష్టపడేవారు. చదువుతోపాటే విజువల్‌ ఎఫెక్ట్స్‌ రూపకల్పనపై దృష్టిపెట్టారు. బీఏ పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్‌ వెళ్లి విజువల్‌ ఎఫెక్ట్స్‌పై పూర్తిస్థాయి శిక్షణ కూడా పొందారు.  డబ్బింగ్‌లోనూ మెలకువలు నేర్చుకున్నారు. తొలుత చిన్నచిన్న సంస్థలకు అవసరమైన ఏవీలను తయారుచేస్తూ ఉపాధి పొందడం మొదలుపెట్టారు. అనంతరం తానే సొంతంగా ‘మీడియా ఎఫ్‌.ఎక్స్‌’ అనే సంస్థను స్థాపించారు.
కారే స్టూడియోగా మారింది....
వివిధ దృశ్యాల చిత్రీకరణకు వెళ్లడం, వాటిని స్టూడియోకు తీసుకెళ్లి మెరుగులు దిద్దడం కంటే స్టూడియోనే లొకేషన్‌ వద్దకు తీసుకెళ్తే మంచి ఫలితాలుంటాయని సంతోష్‌ కుమార్‌ భావించారు. అనుకున్నదే తడవుగా ఆడియో స్టూడియోకు అవసరమైన పరికరాలను కారులోనే బిగించుకున్నారు. వీడియో చిత్రీకరణల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు కారులో ఏర్పాటుచేసుకున్న స్టూడియోలోనే ఏవీ రూపకల్పనకు అవసరమైన పనులన్నీ పూర్తి చేసుకుంటూ అత్యంత నాణ్యమైన ఏవీల రూపకర్తగా గుర్తింపు పొందారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూయార్క్‌ తదితర సుదూర ప్రాంతాల వారికి అవసరమైన ఏవీలనూ వేగంగా పూర్తిచేసి పంపుతుంటారు.


* పోలీసు అమరవీరుల దినం సందర్భంగా సంతోష్‌ కుమార్‌ రూపొందించిన ‘ఖాకీల ఊపిరి’ ఏవీని ఒక్కరోజులో లక్షల మంది వీక్షించారు. డీజీపీ గౌతం సవాంగ్‌ దాన్ని వీక్షించి సంతోష్‌ కుమార్‌ను అభినందించారు.


* విశాఖ అందాలు చూపిస్తూ దేశభక్తిని పెంపొందించేలా ‘దట్‌ ఈజ్‌ ఇండియా’ అనే ఆల్బమ్‌ను తయారుచేశారు.


* నాలుగేళ్లుగా జీవీఎంసీ నిర్వహించే వివిధ కార్యక్రమాల ప్రచారానికి ‘మీడియా ఎఫ్‌.ఎక్స్‌’ సేవల్ని కూడా తీసుకుంటున్నారు.


* విశాఖ నగరంలో ఉన్న కాలుష్య తీవ్రత.... దాన్ని నియంత్రించడానికి అవసరమైన చర్యలను సూచిస్తూ ఏవీ రూపొందించారు.


* రోడ్డుప్రమాదాల బారిన పడి మృత్యువును కొని తెచ్చుకోకూడదన్న సందేశంతో మరో ఏవీని విడుదల చేశారు.


- బీఎస్‌ రామకృష్ణ ఈనాడు, విశాఖపట్నం

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు