Published : 01 Feb 2020 01:23 IST

నా కామ్రేడ్‌ నువ్వే..!

నాకు తొమ్మిదేళ్లప్పుడనుకుంటా.. ఇంటికి దూరంగా మంచి స్కూల్‌లో చేర్పించాలని బోర్డింగ్‌ స్కూల్‌లో చేర్చారు నాన్న. దానికి ముందురోజు నాకింకా గుర్తు. రాత్రి ఏడుస్తూ.. ‘అమ్మా నేను హాస్టల్‌కి వెళ్లను ఇక్కడే బాగా చదువుకుంటా.. నీతోనే ఉంటా.. అస్సలు అల్లరి చేయను, నిన్నసలే ఇబ్బంది పెట్టను. నాన్నని సైకిల్‌ కొనివ్వమని ఏడవను. నువ్వు చెప్పిన పని చేస్తా.. నాన్న చెప్పినట్టే వింటా.. ప్లీజ్‌ అమ్మా హాస్టల్‌ వద్దు.. ఇక్కడే చదువుకుంటానని నాన్నకి చెప్పమ్మా..’ అంటూ ఒకటే ఏడుపు.. దానికి అమ్మ చెప్పిన సమాధానం.. ‘చిన్నూ.. అక్కడ చాలా మంది ఫ్రెండ్స్‌ ఉంటారు. బాగుంటుంది.. అనవసరంగా భయపడుతున్నావ్‌. ప్రశాంతంగా పడుకో’ అని జోలపాడింది. కళ్లు మూసుకున్నానేగానీ నిద్ర పట్టలేదు.. తెల్లారినంత తొందరగానే అమ్మ చెప్పిందే నిజమయ్యింది. కొన్ని రోజులే ఆదివారాల్లో పేరెంట్స్‌ రాక కోసం.. హోం సిక్‌ సెలవుల కోసం వేచి చూశా. తర్వాత అలవాటైపోయింది. స్కూల్‌ ఫ్రెండ్స్‌తో బంధం అనిర్వచనీయమైంది. అప్పుడు దాచుకున్న ఆటోగ్రాఫ్‌ పుస్తకాలు.. దాంట్లోని సంతకాలు.. స్వార్థం ఎరుగని ఊసులు.. కళ్లముందు కదలాడుతున్నాయి.
మళ్లీ ఇంజినీరింగ్‌లో.. అదే తంతు. ర్యాంకు రాష్ట్రాలు దాటి వెళ్లమంది. కానీ, నాకు ఇష్టం లేదు. ఇప్పటికే చాలా ఏళ్లు ఇంటిని మిస్‌ అయ్యా.. ఇప్పుడూనా? ఎందుకంటే మాదో ఉమ్మడి కుటుంబం. అందరం కలిసి ఓ 20 మంది ఉంటాం. ప్రతి రోజూ పండగే. భోజనం అంటే బంతిభోజనాలే అలాంటి ఇంటిని వదిలి వెళ్లాలా? ఏడుపు ఆగట్లే. తాతయ్యకి నేనంటే చాలా ఇష్టం. నా బాధ చూసిన ఆయన పేరెంట్స్‌ మనసు మార్చే ప్రయత్నం చేసినా వర్క్‌అవుట్‌ అవ్వలేదు. చివరికి వెళ్లాల్సిన రోజు వచ్చేసింది. అందరూ రైల్వే స్టేషన్‌కి సెండాఫ్‌ ఇవ్వడానికి వచ్చారు. రైలు బయలుదేరింది. నాకేమో వేరే దేశం వెళ్తున్న ఫీలింగ్‌. స్టేషన్‌ దాటాక వచ్చి కూర్చున్నా. ఎదురుగా అచ్చం మా అమ్మలా ఉంది ఒకావిడ. కానీ, ముఖాన బొట్టు లేదు. ఇంతలో ఆమె పక్కనే వచ్చి కూర్చుంది తను. రైలు ఎక్కేముందు చూసిన అమ్మాయే. అంత బాధలోనూ తన అందం ఇట్టే ఆకట్టుకుంది. తనని ఎదురుగా చూసేసరికి నాకు బాధ కాస్త తగ్గినట్టు అనిపింది. మాట కలుపుదాం అనుకుంటే వాళ్ల అమ్మ ఏమనుకుంటుందో అనే భయం. ఓ రెండు గంటల జర్నీ.. నా ఫోన్‌, తన ముఖం చూడ్డంతోనే గడిచిపోయింది. ఇంతలో ‘ఇవి తింటావా బాబూ..’ అని చేతిలో స్నాక్స్‌ పెట్టింది. తింటూ మాట్లాడితే తెలిసింది. వాళ్ల అమ్మాయిదీ నేను వెళ్లే కాలేజే. నాలుగేళ్లు నేను అనుకున్నంత కష్టం కాదులే అనుకున్నా. తనతో మాట కలిపా. పేరు అంజలి. హాయ్‌.. అంటూ తను ఇచ్చిన షేక్‌ హ్యండ్‌ ఇప్పటికీ మర్చిపోలేను. చేయి వణకడం చూసి తను నవ్వింది. ట్రైన్‌ వేగం అందుకుంది. అంతే వేగంగా మా ఇంజినీరింగ్‌ కూడా. నాలుగేళ్లలో అంజలి నన్నెంతో ప్రభావితం చేసింది. ఫ్రెండు.. గైడు.. అన్నీ. తను ఓ రోజు చెప్పిన మాటలు నా సంకల్పాన్నే మార్చేశాయి. నా గమ్యం తన మాటల నుంచే పుట్టిందంటే అతిశయోక్తి కాదు. ఇంటికి తిరుగు ప్రయాణంలో అందర్నీ కలుస్తానన్న ఆనందం కంటే.. అంజలీ నాతో చెప్పిన మాటలు బలంగా నన్ను మరెక్కడికో తీసుకెళ్లాయి.
ఇంట్లో గడిపిన ఆ హాలీడేస్‌లో నేను ఇచ్చిన ట్విస్ట్‌లకు మా తాతకి హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. అమ్మకైతే గుండె ఆగినంత పనైంది. అయినా.. నా నిర్ణయం మారలేదు. మళ్లీ నన్ను ట్రయిన్‌ ఎక్కించిన రోజు తాత.. ‘రేయ్‌.. మనవడా.. నీ ప్రేమ ఎంతో ఉన్నతమైంది. వీరుడివిరా! వెళ్లిరా’ అన్నాడు. ట్రైన్‌ ఎక్కిన నాకు.. కుటుంబానికి దూరం అవుతానన్న బాధే లేదు. ఎందుకంటే నాది దేశమంత కుటుంబం. నేను వెళ్లింది ఆర్మీకి. కొన్ని నెలలైనా ఇంట్లో వాళ్లని చూడకుండా ఉండడమే కష్టమైన నాకు ఏడాది గడిచినా ఇంటిపై ధ్యాస మళ్లలేదు. ఈ వేసవికి ఇంటికి వస్తున్నా. గర్వంగా ఉంది. నిబ్బరంగా నడుస్తున్నా. ప్లే బాయ్‌ లాంటి నేను ఇలా ఎందుకు మారా? ఓ ఎమోషన్‌ మార్చింది.  అది ఓ ఆర్మీ నాన్నకి కూతురుకీ మధ్య ఎమోషన్‌. ‘నాన్న నువ్వు నా హీరో. ఎందుకో తెలియదు నువ్వేసుకున్న డ్రస్సు.. తగిలించుకున్న బ్యాడ్జ్‌.. వేసుకున్న బూట్లు.. చూస్తుంటే ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది. నేను పెళ్లి చేసుకునేవాడు నీలా వీరుడై ఉండాలి’ అంది. అది విన్న నాన్న ఉప్పొంగిపోయాడు. కూతురిని చూసి మురిసిపోయాడు. కానీ, కూతురి కలని నిజం చేయకుండానే విధి నిర్వహణలో ప్రాణాలు విడిచాడు. ఆ కూతురు అంజలీనే. ఎమోషన్‌ని పంచుకుంది నాతోనే. విన్న రోజు మొదలు.. తనతో నా స్నేహం.. ప్రేమగా మారి.. ఆర్మీ అధికారిగా ముందుకెళ్లేందుకు సిద్ధం అయ్యింది. నా ప్రేమని తను కోరుకున్న హీరోలానే చెప్పాలనుకున్నా. ధైర్యంగా.. హుందాగా. ఇది నువ్వు ఇచ్చిన సంకల్పం. ఇది మీ నాన్నకి అంకితం. ఇంకొన్ని నెలల్లో నిన్ను, కుటుంబాన్ని చూసేందుకు గర్వంగా ఎదురు చూస్తున్నా!!

- నాని


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు