స్నేహంలో వంచన.. ప్రేమలోనూ మోసం!

‘దోస్త్‌ మేరా దోస్త్‌.. తూ హై మేరీ జాన్‌..’ నాకు స్నేహితులు తక్కువ. ఉన్నవాళ్లలో మురళి అంటే నాకు ప్రాణం. ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్లం. మా స్నేహాన్ని చూసి క్యాంపస్‌ కుళ్లుకునేది. కానీ, ఓ రోజు మొదటిసారి మురళిపైన కోపం వచ్చింది. కారణం ఓ అమ్మాయి. వాడు నాతో మాట్లాడటం తగ్గించాడు. కలవడంలోనూ అదే గ్యాప్‌.

Published : 15 Feb 2020 01:06 IST

‘దోస్త్‌ మేరా దోస్త్‌.. తూ హై మేరీ జాన్‌.. నాకు స్నేహితులు తక్కువ. ఉన్నవాళ్లలో మురళి అంటే నాకు ప్రాణం. ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్లం. మా స్నేహాన్ని చూసి క్యాంపస్‌ కుళ్లుకునేది. కానీ, ఓ రోజు మొదటిసారి మురళిపైన కోపం వచ్చింది. కారణం ఓ అమ్మాయి. వాడు నాతో మాట్లాడటం తగ్గించాడు. కలవడంలోనూ అదే గ్యాప్‌. ఆ సమయంలో నాకు అమ్మాయి మీద విపరీతమైన కోపం వచ్చింది. మురళిని నాకు ఆ రాక్షసి దూరం చేస్తోంది అనిపించింది. వాడ్ని ఎప్పుడు పలకరించినా.. పొడిపొడి మాటలతో  సమాధానం చెప్పేవాడు. నా మనసు నొచ్చుకుంది. దాంతో వాడిని అవాయిడ్‌ చేశాను. వాడితో మాట్లాడటం మొత్తం మానేశా. వాడు నాతో మాట్లాడాలని ప్రయత్నించినా.. పట్టించుకోలేదు.

ఓ రోజు మా ఇద్దరి మధ్య స్నేహం చెడటానికి కారణమైన అమ్మాయి నన్ను పలకరించింది. ‘ఎందుకు నీ ఫ్రెండ్‌ మురళితో మాట్లాడటం లేదు. మీరిద్దరు మాట్లాడుకోకుంటే.. నా వల్ల మీ ఇద్దరి స్నేహం చెడిందని కాలేజీ అంతా అనుకుంటోంది. ప్లీజ్‌ నువ్వు మునపటిలానే మురళితో మాట్లాడవా?’ అని అడిగింది. నేను ఓ నవ్వు నవ్వి అక్కడి నుంచి వచ్చేశా. ఓ రోజు నేను కాలేజీకి వస్తుంటే కొంతమంది నన్ను చూసి నవ్వుతున్నారు. ‘పాపం వీడు మురళిని ఎంత నమ్మాడురా. వాడేమో అమ్మాయి మాయలో పడి.. వీడ్ని పట్టించుకోవడం లేదు. ఎంతైనా స్నేహం కన్నా.. ప్రేమ గొప్పదిరా. అవసరమైతే ప్రేమకోసం స్నేహాన్ని త్యాగం చేయడంలో తప్పు లేదు’అని వాళ్లు నాకు వినబడేలానే మాట్లాడుతున్నారు. కాలేజీ అంతా ఇదే వ్యాపించింది. మురళి, ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్నారు అని. ఈ విషయాలు విన్న తర్వాత నాకు వాడిపై మరింత కోపం పెరిగింది. ఇక జన్మలో వాడి మొహం చూడకూడదు అనుకున్నా. ఎంత నమ్మాను వాణ్ని. వాడి ప్రేమ విషయాన్ని నా దగ్గర దాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ అమ్మాయే వీణ్ని మార్చి ఉంటుంది. నాతో మాట్లాడవద్దు అని ఉంటుందని నేను అనుకున్నా. నిజంగా ఆ అమ్మాయి అలా చెప్పిందా? లేక వీడే దూరం పెడుతున్నాడా? ఏది వాస్తవమో ఆలోచించే స్థితిలో నేను లేను. ఓ రోజు మళ్లీ ఆ అమ్మాయి నన్ను పిలిచింది. ప్లీజ్‌ నీతో ఓ విషయం అర్జంటుగా మాట్లాడాలి. అంది. నేను కుదరదు అన్నా. ప్లీజ్‌.. ప్లీజ్‌.. అంది.. సరే చెప్పు అన్నా.. ఇక్కడ కాదు.. అందరూ ఉన్నారు.. పక్క క్లాస్‌రూంలో ఎవరూ లేరు. అక్కడికి పదా అంది. చెబితే ఇక్కడ చెప్పు.. లేకుంటే మానుకో.. నీతో అంత ఏకాంతంగా మాట్లాడే అవసరం లేదు. సారీ. ఇప్పటికే మీ ఇద్దరి వల్ల కాలేజీలో నవ్వులపాలవుతున్నా.. అని చెప్పేశా. ఆ ఏముందిలే వాళ్ల ఇద్దరి మధ్య ఏదో చిన్న గొడవ వచ్చి ఉంటుంది. నన్ను సర్దుబాటు చేయమని చెప్పడానికొచ్చిందేమో అనుకున్నా. మర్నాడు ఆమె కాలేజీకి రాలేదు. ఆ మర్నాడూ రాలేదు. ఇంతలో బాంబులాంటి వార్త కాలేజీ అంతా పాకింది. ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది అని.. మురళి ఆ అమ్మాయిని మోసం చేశాడని. నేను నమ్మలేకపోయా. ‘అయ్యో! ఎంత పనిచేశా. ఆమెతో మాట్లాడి ఉంటే విషయం తెలిసేదే. పాపం ఆ అమ్మాయి ఎంత మదనపడిందో అని’.. అప్పటికీ నా స్నేహితుణ్ని నేను అనుమానించలేదు. కానీ మురళి తన అంత్యక్రియలకు రాలేదు. కొద్దిరోజులు ఎవరికీ కనిపించకుండా పోయాడు. కాలేజీలో మరుసటి రోజు ‘ఎలాగూ నా ఫ్రెండు  చనిపోయింది. బతికున్నవాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు’ అని ఓ అమ్మాయి అంటుండగా విన్నా. నమ్మలేకపోయా. అది మొదలు వాడి ముఖం మళ్లీ చూడలేదు. మా అమ్మ కూడా అంది.. ‘నువ్వు వాడిని దూరం పెట్టిందే నయమైంది బిడ్డా.. లేకుంటే పోలీసులు ఎంక్వైరీలని నిన్ను కూడా పరేషాన్‌ చేసేవాళ్లు’అని. ఇదే మాట మిగతా స్నేహితులూ అన్నారు. కొందరైతే కొన్నాళ్లు నన్ను కూడా భయం భయంగా చూశారు. తర్వాత రెండు మూడుసార్లు మురళి ఫోన్‌లో నన్ను కాంటాక్ట్‌ అవ్వాలని ప్రయత్నించినా.. నేను వాడికి అవకాశం ఇవ్వలేదు. ‘ఓ అమ్మాయి. నువ్వు ఎక్కడ ఉన్నా.. నీ ఆత్మ శాంతించుగాక. నిన్ను వంచించిన ఆ ద్రోహికి నేను మిత్రుణ్ని అయినందుకు నన్ను మన్నించు.’ 

- మహ్మద్‌ దియాన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని