బృంద గాన విజయం

చదువు.. ఆ తర్వాత ఉద్యోగం అనుకునే యువత ఇప్పుడు తక్కువ. చదువు.. అటుపై స్టార్టప్‌ అంటున్న యువత ఎక్కువ.. ముఖ్యంగా జనరేషన్‌-జెడ్‌.. వీరి లక్ష్యం సిస్టమ్‌లో భాగమవ్వడం కాదు....

Published : 07 Mar 2020 00:42 IST

‘టిప్‌’టాక్‌!

చదువు.. ఆ తర్వాత ఉద్యోగం అనుకునే యువత ఇప్పుడు తక్కువ. చదువు.. అటుపై స్టార్టప్‌ అంటున్న యువత ఎక్కువ.. ముఖ్యంగా జనరేషన్‌-జెడ్‌.. వీరి లక్ష్యం సిస్టమ్‌లో భాగమవ్వడం కాదు.. వాళ్లే ఓ సిస్టంగా మారడం. అది అనుకున్నంత ఈజీ కాదు. వ్యవస్థగా మారేముందు వ్యక్తిగా నిర్దిష్టమైన ‘సిస్టమ్‌’ ఉండాలి. దాంట్లో ‘ప్రాసెసర్‌’ పద్ధతిగా పని చేయాలి. అప్పుడే.. అనుకున్న అంకురం ‘ప్రాసెస్‌’ అయ్యి, మార్కెట్‌లో చక్కని ‘రిజల్ట్‌’ ఇస్తుంది. అందుకే మదిలోని స్టార్టప్‌ ఆలోచనని ‘కంపైల్‌’ చేసే ముందు ఈ చెక్‌ పాయింట్స్‌ని సరి చూసుకోండి.
క్యారెక్టర్‌కి ఆఫర్‌ ఇవ్వండి  
బృందంగానే ఏదైనా సాధ్యం. అందుకే టీమ్‌లోని సభ్యుల విధేయత, విలువలు చాలా ముఖ్యం. మీరనుకునే లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. మీవైన విలువల్ని బృందం గౌరవించాలి, ఆకళింపు చేసుకుని అనుసరించాలి. నైపుణ్యాలకు నిత్యం పెంపొందించుకోవాలి. అలాంటి క్యారెక్టర్‌ ఉన్న వారికే అవకాశం ఇవ్వండి.
టైమ్‌ కంటే ముఖ్యమైంది
మీకున్న శక్తి, సామర్థ్యాల ఆధారంగానే ఉన్న సమయంలో ఏదైనా చేయగలరు. ఎక్కువ సమయం మీ ముందు ఉన్నప్పటికీ శక్తియుక్తులు సరిగా లేకుంటే ఆశించిన స్థాయిలో రాణించలేరు. అందుకే.. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కంటే.. మీ నైపుణ్యాలని చురుకుగా ప్రదర్శించడంపైనే దృష్టి పెట్టాలి. అప్పుడే డెడ్‌లైన్‌లోపు లక్ష్యాల్ని అందుకోడం సులభం అవుతుంది.
సవాలు మీతో మీకే..
అంకుర రూపకల్పనలో మీరే మొదలు..మీరే చివర.. అందుకే మిమ్మల్ని మీరే నిత్యం ప్రేరేపించుకోవాలి. మీతో మీరే ఛాలెంజ్‌ చేసుకోవాలి. ఒక్కసారి క్యాంపస్‌లు దాటుకుని కెరీర్‌ని ప్లాన్‌ చేసే క్రమంలో జీవితాన్ని అతి పెద్ద విశ్వవిద్యాలయంగా స్వీకరించాలి. రోజూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలి. ఆచరణలో పెట్టాలి.
నచ్చితేనే నిరంతర శ్రమ
యువత పారిశ్రామిక రంగంలో రాణించడం అంటే టెస్ట్‌ మ్యాచ్‌ ఆడినట్టే. టీ20లా ఓ ఇరవై ఓవర్లు ఆడితే గెలిచెయ్యవచ్చులే అనుకుంటే పొరపాటే. నచ్చి మొదలు పెట్టిన దాని కోసం నిరంతర శ్రమ చేయాలి. అప్పుడే యూటర్న్‌ తీసుకుందాం అనే ఆలోచన రాదు.
దూరదృష్టితోనే పయనం
ఓ పదేళ్ల తర్వాత ఇలా ఉండాలి అనుకోవడం విజన్‌. అలా దూరదృష్టితో అనుకున్న మీకల నిజం కావాలంటే.. విజన్‌తో పాటు దాన్ని చేరుకోవాలనే కోరిక బలంగా ఉండాలి. ఎదురయ్యే ఎత్తు పల్లాల్లో విజన్‌ వై-ఫై నెట్‌వర్క్‌లా స్థిరంగా ఉండాలే గానీ మొబైల్‌ నెట్‌వర్క్‌లా వచ్చి పోతుండకూడదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని