క్షమిస్తావని ఆశతో..!

ఆమె ఆప్యాయతకు ప్రతిరూపం. అనురాగానికి నిలువెత్తు నిదర్శనం. నా కష్టసుఖాలన్నింటిలో తనుంది....

Published : 21 Mar 2020 00:19 IST

మె ఆప్యాయతకు ప్రతిరూపం. అనురాగానికి నిలువెత్తు నిదర్శనం. నా కష్టసుఖాలన్నింటిలో తనుంది. తనే మా అక్క శారద. తోడబుట్టకపోయినా అంతకంటే ఎక్కువ. అలాంటి అక్క నాతో మాట్లాడడమే మానేసింది. నన్నో శత్రువులా చూస్తోంది. ఎందుకంటే..

చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రం. పేదరికం నా తోబుట్టువు అనుకోవాలి. అయినా.. మొదట్నుంచీ చదువులో ముందుండేవాడ్ని. ఎప్పటికైనా నువ్వు ఉన్నతమైన కొలువులో స్థిరపడతావని అందరూ అంటుండేవారు. కానీ, సాయానికి ఒక్కరూ ముందుకొచ్చేవారు కాదు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే బీటెక్‌ పూర్తి చేశా. కొన్ని నెలలు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షకు సన్నద్ధమయ్యాను. కానీ విఫలమయ్యా. దాచుకున్న డబ్బులు మొత్తం ఖాళీ అయ్యాయి. ఏం చేయలేని పరిస్థితి. రోజులు గడిచేందుకు ఎన్నో ఇబ్బందులు పడాల్సివచ్చేది. ఆ సమయంలోనే మా కాలనీలోని పెద్దాయన ఓ వ్యక్తిని పరిచయం చేశాడు. తనకు నా గురించి చెబితే ఆర్థిక సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. కొద్ది రోజుల్లోనే నన్ను ఆదుకున్న వ్యక్తిని నోరారా బాబాయ్‌ అని పిలిచేంతలా కలిసిపోయా. కొన్ని రోజులకు బాబాయ్‌ శారదని పరిచయం చేశాడు. తనే మా అక్క. తన రాకతో నా జీవితంలో చీకటి రోజులు తొలగిపోయాయి. తోబుట్టువులా నా ఎదుగుదలని కోరుకుంది. నాలో నమ్మకాన్ని పెంచింది. నేను చేసే ప్రతీ ప్రయత్నంలోనూ తన ప్రోత్సాహం కొండంత బలంలా అనిపించేది. పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వమని హైదరాబాద్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో చేర్చింది. ప్రతి నెలా హాస్టల్‌ ఫీజు చెల్లించేది. నేనూ కష్టపడి చదివేవాడిని.. చూస్తుండగానే ఏడాది పూర్తయింది...

ఓ రోజు అక్క ఫోన్‌.. ‘రేయ్‌ నాన్నా.. లల్లీ అని నాకు తెలిసిన అమ్మాయి. నీకు సరైన జోడి. తనను పెళ్లి చేసుకుంటే నీ లైఫ్‌ బాగుంటుంది’ అంది. లల్లీని చూడటానికి వెంటనే కాకినాడకు రమ్మంది. అక్క మాట కాదనలేక వెళ్లా. అక్కడ వారి ఏర్పాట్లు చూసి షాక్‌ అయ్యా. ఇంట్లో కూడా చాలా మంది ఉన్నారు. ఉమ్మడి కుటుంబం అనుకుంటా. నాకేమో అలాంటి వాతావరణమే తెలియదు. పైగా అప్పటికి నాకు పెళ్లి ఆలోచనే లేదు. అక్క మాట కాదనలేక లల్లీని చూడడానికి వెళ్లా. తనకి నేను నచ్ఛా ఆ విషయం అందరిముందు ధైర్యంగా చెప్పింది కూడా. నేనే ఏం చెప్పలేకపోయా. అడిగితే తర్వాత చెబుతా అని సమాధానం దాటేశా. నిజానికి లల్లీ నా కళ్ల దగ్గరే ఆగిపోయింది. మనసుని చేరలేదు. అందరి ముందు తను నచ్చలేదు అని చెప్పడం బావుండదని.. అక్కకి నా నిర్ణయాన్ని తర్వాత చెబుదాం అనుకుని అక్కడి నుంచి వచ్చేశా. రోజులు గడుస్తున్నాయ్‌.. అక్క కూడా నన్ను పలు మార్లు అడిగింది. అయినా సమాధానం దాటేశా. కెరీర్‌లో సెటిల్‌ అయ్యే పనిలో పడ్ఢా ఏడాది పూర్తయింది. లల్లీ నామీదే ఆశలు పెట్టుకొని తనకొచ్చిన సంబంధాలన్నీ తిరస్కరిస్తోంది. అది తెలిసి నేను చేస్తున్నది కరెక్టు కాదు అనిపించింది.

అక్కకి విషయం ఎలాగైనా చెప్పేయాలని వెళ్లా. కానీ, అక్కకేమో తనతో నా భవిష్యత్తు బాగుంటుందని నమ్మకం. నాలా ఏ అండ లేనివాడికి అలాంటి పెద్ద ఫ్యామిలీ సపోర్టు అవసరం అని అక్క ఉద్దేశం. కానీ, నాకేమో అమ్మాయి నచ్చలేదు. ఆ విషయం అక్కకి చెప్పడానికి ధైర్యం చాల్లేదు. అది గౌరవమో.. అభిమానమో నాకు తెలీదు. మళ్లీ చెప్పకుండానే వెనుదిరిగా. పోనీ.. లల్లీనే చేసుకుందామా? అని ఆలోచించా. మనసుకు నచ్చని ఏ బంధమైన శాశ్వతంగా కొనసాగదేమో అని భయపడ్ఢా ఇలాగే ఇంకొన్ని నెలలు.. లల్లీ తనకొచ్చే సంబంధాలు చెడగొడుతూనే ఉంది. ఓ రోజు అక్క నుంచి ఫోన్‌.. ‘పెళ్లి గురించి మాట్లాడ్డానికి బావ, నేనూ వస్తున్నాం. ఎన్ని రోజులని వాయిదా వేస్తావ్‌?’ అంది. ధైర్యం చేసుకొని అసలు విషయం చెప్పేశా. అక్క నుంచి ఎలాంటి స్పందన లేదు. కొన్ని సెకన్లకు కాల్‌ కట్‌ అయ్యింది. మళ్లీ కాల్‌చేశా. ఎత్తలేదు. వెళ్లాను.. మాట్లాడలేదు. ఇప్పటికీ మాట్లాడడం లేదు. ఇంకెన్నాళ్లకు మాట్లాడుతుందో తెలియదు. విషయం తెలుసుకున్న లల్లీకి ఇంకొకరితో నిశ్చితార్థం అయ్యింది. అక్కా.. నీకు ఒకటి చెప్పాలి.. నన్ను అర్థం చేసుకున్న వారిలో నువ్వే ముందుంటావు. నాకేం కావాలో నాకంటే నీకే బాగా తెలుసు. కానీ మనసుకు నచ్చని వివాహం మాత్రం చేసుకోలేనక్కా. నీకు ఆ విషయం ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. తమ్ముడిగా నన్ను అర్థం చేసుకుని మునుపటిలా నాతో మాట్లాడతావని కోరుకుంటూ.. నన్ను క్షమిస్తావనే ఆశతో..!’

- కొత్తపల్లి శ్రీకాంత్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని