మిలీనియల్స్‌కి సక్సెస్‌ మెరుపు!

లాక్‌డౌన్‌.. వారాలు గడుస్తున్నకొద్దీ ఏం చేయాలో అర్థం కాని స్థితి.. అయోమయం.. ఆందోళన.. వీటిని జయించాలంటే? ప్రేరణ కలిగించే పుస్తకాలైనా చదవాలి. విజయతీరాల్ని చేరిన

Updated : 02 May 2020 00:21 IST
ఫాలో.. ఫాలో.. యూ!!!

లాక్‌డౌన్‌.. వారాలు గడుస్తున్నకొద్దీ ఏం చేయాలో అర్థం కాని స్థితి.. అయోమయం.. ఆందోళన.. వీటిని జయించాలంటే? ప్రేరణ కలిగించే పుస్తకాలైనా చదవాలి. విజయతీరాల్ని చేరిన వ్యక్తులనైనా గుర్తుకు తెచ్చుకోవాలి. నేటి తరంలో ఎక్కువ శాతాన్నిచదివించే పుస్తకమైనా.. ఫాలో అయ్యే యూత్‌ ఐకాన్‌ అయినా విరాట్‌ కోహ్లీనే!! మైదానం లోపలా బయటా తనదైన ఆట, వ్యక్తిత్వంతో మిలీనియల్స్‌కి బాగా దగ్గరయ్యాడు. మరైతే, ఈ విరాట్‌పర్వం నుంచి ఏం నేర్చుకోవచ్చు? యువత ఏం ఫాలో అవ్వొచ్చు? ఇప్పుడున్న గడ్డు కాలాన్ని ఎలా అధిగమించొచ్చు?

తపనే తీసుకెళ్లేది..

ఎంచుకున్న రంగం ఏదైనా ఉన్నత శిఖరాల్ని అందుకోవాలనే తపన ఉన్నప్పుడే కెరీర్‌ ముందుకు సాగుతుంది. విరాట్‌లోని తపన కూడా క్రికెట్‌ ఆడడం కాదు.. టీమ్‌ ఇండియాకి ఆడడం. ఆ కసీ, పట్టుదలే విరాట్‌ని ఇప్పుడు ఆ స్థానంలో నిలబెట్టాయి. భారత జట్టులో ఆడే అవకాశం వస్తుందా? రాదా? అనే స్థాయి నుంచి జట్టుకి కెప్టెన్‌ అయ్యే స్థితికి చేరడంలో తనదైన తపనే కారణం. తనకి ఓడిపోవడం అసలు నచ్చదు. అందుకే తనో రన్‌ మెషిన్‌లా ప్రతి ఇన్నింగ్స్‌లోనూ తనదైన పాత్ర పోషిస్తాడు.

మీలో సాధించాలనే తపన ఉంటే లాక్‌డౌన్‌ సవాళ్లు ఎన్నయినా ఎదుర్కొంటూ గెలుపు కోసం ఇన్నింగ్స్‌ ఆడుతూనే ఉంటారు. ఇంటికే పరిమితమైన ఈ సమయాన్ని నెట్‌ ప్రాక్టీస్‌లా వాడుకుని మీలో నైపుణ్యాల్ని మెరుగు పరుచుకోవాలి. చదువు, అంకుర సంస్థ, ఉద్యోగం.. మీరు ఉన్న రంగం ఏదైనా గేమ్‌ ప్లాన్‌ మార్చండి. కరోనా కుదుపునకో సవాల్‌ విసరండి.

నీరుగారిపోవద్దు

‘నా గురించి నాకు తెలుసు.. నేనేం చేయగలనో తెలుసు.. ఏం చేశానో తెలుసు.. ఇప్పుడూ పని పూర్తి చేయగలను.. ఓటమని భయమెందుకు? ధైర్యంగా ఆడాలంతే!!’ అని చెప్పే విరాట్‌ని నడిపించింది నమ్మకమే. అదే తనని రికార్డుల్ని బద్దలు కొట్టేలా చేస్తోంది. జట్టుని ముందుండి నడిపించాలన్నా.. తనే ఒంటరిగా పోరాడాలన్నా గెలుస్తామనే నమ్మకమే తన ఆయుధం.

నేడు దాడికి దిగిన ప్రాణాంతక వైరస్‌ మన ప్రత్యర్థి. ఇన్‌ స్వింగ్‌.. అవుట్‌ స్వింగ్‌.. స్పిన్‌.. బౌలింగ్‌ ఏదైనా కరోనాతో ఓపిగ్గా టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాలి. ఎలాగైనా గెలవాలి. కుటుంబాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్ని తెలివిగా అధిగమించాలి. మీ ఇంటికి మీరే కెప్టెన్‌ అవ్వాలి. ఆందోళన పోగొట్టి భవిష్యత్తు పట్ల నమ్మకం కలిగించాలి.

‘బలం’గా నిలబడాలి

మనలో స్కిల్‌ ఎంతున్నా.. బలంగా పోరాడే సత్తువ లేకపోతే పోరాటంలో గెలవలేం. అందుకే విరాట్‌ బలం తన ఫిట్‌నెస్‌. ఎక్కడా తగ్గకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు. రోజూ రెండు గంటలకు పైనే వర్కవుట్స్‌ చేస్తాడు. అందుకు తగిన పోషకాహారం తీసుకుంటాడు. అందుకే బ్యాట్‌తో బంతి బాదేటప్పుడు సింహం పంజాలా, పిచ్‌ మధ్య పరిగెత్తే సమయంలో చిరుత పరుగులా ఉంటుంది తన తీరు.

మోయలేని బరువెందుకు?

జింక ప్రాణ భయంతో పరిగెత్తాలన్నా.. పులి ఆకలి బాధ తీర్చుకోవాలన్నా మెరుపు వేగంతో పరిగెత్తాలి. అలా రెండూ వాటి పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయంటే.. అవి పాటించే ఆహార నియమమే. విరాట్‌ కూడా అదే చెబుతాడు. తినే ఆహారంతో మన ఆరోగ్యానికి ఎలా మేలు చేకూరుతుందో తెలుసుకోవడం అనివార్యం అంటాడు. ఒకప్పుడు నాన్‌ వెజిటేరియన్‌గా ఉండే కోహ్లీ ఇప్పుడు వెజిటేరియన్‌గా మారాడు. ఎప్పుడూ తనకంటూ ప్రత్యేక డైట్‌ ఫాలో అవుతాడు.

మీరు ఉన్న రంగం ఏదైనా మీరెంత ఫిట్‌గా ఉంటే అంత స్మార్ట్‌గా ఆలోచించగలుగుతారు. లాక్‌డౌనే కదాని ఆలస్యంగా నిద్ర లేవడం.. ఫోన్‌, టీవీలతో కాలక్షేపం చేయడం మానుకోవాలి. నిర్ణీత సమయాన్ని పెట్టుకుని ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టండి. ఇంట్లోనే హోమ్‌ వర్కవుట్స్‌ చేయండి. అప్పుడే ఆందోళన దూరమై మెదడు చురుకుగా పని చేస్తుంది.

ఇంట్లో ఉన్నాం కదా అని అందిన వాటిని ఆరగించొద్ధు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోండి. మీ కుటుంబ సభ్యులనూ ఆ దిశగా ప్రోత్సహించండి. మీరే చఫె్‌గా మారి పోషక విలువలున్న ఆహారాన్ని వండి వార్చండి.

ప్రేమలోనూ ప్రేరణే..

యవ్వనపు దశలో ప్రేమ పావురాల్ని ఎగరేయని వారుండకపోవచ్ఛు విరాట్‌ కూడా అంతే.. ప్రేమాయణంలోనూ తనదైన ముద్ర వేశాడు. ఒకరినొకరు అర్థం చేసుకుని కొనసాగించేదే ప్రేమంటే అని ఈ ముచ్చటైన జంట చాటుతోంది. అందుకే విరాట్‌, అనుష్కల జోడీ ‘విరుష్క’కి యువత ఫిదా అయిపోయారు.

ఒకరినొకరు అర్థం చేసుకుని.. ఇరువురి అభిప్రాయాలకూ విలువ ఇచ్చుకుంటూ ముందుకు సాగితే ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. ప్రేమించాలనుకునేవారు... ప్రేమలో పడిన వారు.. పడి లేచిన వారు.. అందరూ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. ‘ప్రేమని పొందడమే కాదు.. ఇవ్వడమూ అనివార్యం’ అని...

ఇంట్లో ఉన్నా, ఆఫీస్‌కి వెళ్లినా మీరేంటో చెప్పేది మీ డ్రెస్సింగే. అందుకే ఇంట్లోనూ క్లాస్‌గా కనిపించే టీ షర్ట్స్‌, షార్ట్‌ ప్రయత్నించండి. లాక్‌డౌన్‌తో ఎక్కువ సమయం ఇంట్లోనే.. షాపింగ్‌లూ లేవు.. కొత్తవి కొనేందుకు ఆన్‌లైన్‌ అంగళ్లూ లేవు.. అందుకే ఉన్నవాటితోనే మీదైన స్టైలింగ్‌ చేసుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు