అతడు ఆమై.. అందాల భరిణై

బయటికొస్తే చిన్నచూపు... పని చేద్దామంటే ఇచ్చేవాళ్లే ఉండరు... ట్రాన్స్‌జెండర్లకి ఎన్ని వెతలో! శ్రుతి సితార అందరిలా నా తలరాత ఇంతే అనుకోలేదు... ధైర్యంగా అడుగు ముందుకేసింది.. అందాల పోటీల్లో మెరిసింది. తాజాగా దేశానికి ప్రాతినిధ్యం వహించబోతోంది.

Published : 12 Jun 2021 01:49 IST

బయటికొస్తే చిన్నచూపు... పని చేద్దామంటే ఇచ్చేవాళ్లే ఉండరు... ట్రాన్స్‌జెండర్లకి ఎన్ని వెతలో! శ్రుతి సితార అందరిలా నా తలరాత ఇంతే అనుకోలేదు... ధైర్యంగా అడుగు ముందుకేసింది.. అందాల పోటీల్లో మెరిసింది. తాజాగా దేశానికి ప్రాతినిధ్యం వహించబోతోంది. ఆమె విజయగాథే ఇది!

శ్రుతి సితారది కేరళలోని వయిక్కోం. తొమ్మిదో తరగతి వరకు ప్రవీణ్‌ అనే అబ్బాయిగా పెరిగింది. చదువుకోవడానికి ఉత్తర్‌ ప్రదేశ్‌కి వెళ్లింది. అక్కడే మార్పులు మొదలయ్యాయి. అమ్మాయిల దుస్తులకు ఆకర్షితమవ్వడం, వారితో ఉండటానికి ఇష్టపడటం.. ఇలాంటివి. ముందు ఇదో మానసిక సమస్య అనుకుంది. తోటి విద్యార్థులు గేలి చేయసాగారు. తట్టుకోలేక ఇంటికొచ్చేసింది. కొన్నాళ్లయ్యాక తనలాంటి వాళ్లను కలిసింది. అప్పుడర్థమైంది తను అబ్బాయి కాదని. విషయం బయట పెడితే అవమానాలు, హేళన ఎదుర్కోవాల్సి వస్తుందని లోలోపలే కుమిలిపోయేది. కానీ ఎన్నాళ్లిలా? డిగ్రీ పూర్తయ్యాక విషయం తండ్రికి చెప్పింది. ఆయన ఆశ్చర్యపోలేదు, ఛీత్కరించుకోలేదు. అదృష్టవశాత్తు అన్నావదినలు, ఇరుగూపొరుగూ అర్థం చేసుకుని ఆదరించారు. ఇక తనకు నచ్చినట్టుగా పూర్తి అమ్మాయిగా మారిపోయింది. ప్రవీణ్‌ నుంచి శ్రుతిగా మారింది.

తనలాంటి వాళ్లు సమాజంలో చాలామంది ఉన్నారని తెలుసుకుంది. లోలోపలే కుమిలిపోతున్న వాళ్లకు ధైర్యం చెప్పాలనుకుంది. సామాజిక మాధ్యమాల్లో తన గురించి చెప్పింది. అప్పుడు మొదలయ్యాయి సూటిపోటి మాటలు, చీవాట్లు, అవహేళనలు. ముందు బాధ పడ్డా, తనకు తానే ధైర్యం చెప్పుకుంది. అందరూ గుర్తించేలా తనకంటూ గుర్తింపు, గౌరవం తెచ్చుకోవాలనుకుంది. పట్టుదలతో చదివి కేరళ ట్రాన్స్‌జెండర్‌ సెల్‌కి ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌గా ఎంపికైంది. అప్పుడే తనకి క్వీన్‌ ఆఫ్‌ ద్వాయా పోటీల గురించి తెలిసింది. రన్నరప్‌గా నిలిచింది. ఆపై ఈ ఏడాది ‘మిస్‌ ట్రాన్స్‌ గ్లోబల్‌ ఇండియా’ కిరీటం దక్కించుకుంది. ఈ అర్హతతో లండన్‌లో ఈరోజు జరగనున్న అంతర్జాతీయ అందాల పోటీల్లో మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించబోతోంది. ‘మేమూ అందరిలాంటి మనుషులమే. మాకూ ప్రతిభ ఉంటుంది. సమాజం ప్రోత్సహిస్తే మేమూ అన్నిరంగాల్లో రాణిస్తాం. ఈ పోటీల తర్వాత సినిమాల్లో ప్రయత్నిస్తా. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంటా’    అంటోంది శ్రుతి.         

- అనూష నీరుకొండ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని