ఆన్‌లైన్‌ వర్కవుట్లా.. ఆగండి ఓ నిమిషం

కొవిడ్‌ దెబ్బతో చాలా రంగాలు ఆన్‌లైన్‌ బాట పట్టాయి. కుర్రకారు ఇష్టపడే వ్యాయామానికీ తప్పలేదు.

Published : 03 Jul 2021 01:28 IST

ఫిట్‌నెస్‌ మంత్ర

కొవిడ్‌ దెబ్బతో చాలా రంగాలు ఆన్‌లైన్‌ బాట పట్టాయి. కుర్రకారు ఇష్టపడే వ్యాయామానికీ తప్పలేదు. జిమ్‌కెళ్తే కరోనా సోకుతుందని ఇప్పటికీ చాలామంది ఇంట్లోనే వర్కవుట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఫిట్‌నెస్‌ ట్రైనర్ల సాయం తీసుకుంటున్నారు. పరిస్థితులు సద్దుమణిగినా ఈ ట్రెండ్‌ ఇంకా కొనసాగే అవకాశం ఉందంటున్నారు. ఆ ధోరణిలో మీరుంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.

* ఎంపిక: ఎలాంటి శిక్షకుడిని ఎంపిక చేసుకోవాలో ముందే స్పష్టత ఉండాలి. శరీరానికి ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటే యోగా, జిమ్నాస్టిక్స్‌లో నైపుణ్యం ఉన్న శిక్షకులను ఎంచుకోవాలి. బరువు తగ్గాలనుకుంటే జుంబా, స్కేటింగ్‌.. నిపుణులు కావాలి. ఎంపిక ఎప్పుడూ మన అవసరాలకు అనుగుణంగా ఉండాలి.

* జట్టుగా.. ఒంటరిగా: ఆన్‌లైన్‌ తరగతుల్లో ఒంటరిగా, జట్టుగా సెషన్లు నిర్వహిస్తున్నారు. గుంపులో ఉన్నప్పుడు శిక్షకులు సహజంగానే ఒక్కొక్కర్ని పట్టించుకునేది తక్కువే. మెరుగైన ఫలితాలు కావాలంటే, తొందరగా టార్గెట్లు చేరాలంటే వన్‌-ఆన్‌-వన్‌ సెషన్‌ ఎంచుకోవాలి.

* మన బడ్జెట్‌లో..

మార్కెట్‌లో వాళ్లకున్న డిమాండ్‌, నైపుణ్యం ఆధారంగా ఫీజులు తీసుకునే ట్రైనర్లుంటారు. మనం ఎంతవరకు భరించగలమో ముందే నిర్ణయించుకోవాలి. దానికి తగ్గవాళ్లనే ఎంపిక చేసుకోవాలి. మొహమాట పడకుండా ఈ విషయంలో బేరాలాడొచ్చు.

* ఆరా తీయాలి: ఫిట్‌నెస్‌ మనకు ఎంత ముఖ్యమో.. శిక్షణనిచ్చేవారి గురించి తెలుసుకోవడమూ అంతే ముఖ్యం. ట్రైనర్ల వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు పరిశీలిస్తే సమాచారం దొరుకుతుంది. రివ్యూలు చదివితే వాళ్ల ప్రతిభ ఎంతో.. అర్థమవుతుంది.

* ట్రయల్‌ క్లాస్‌: ముందే భారీగా ఫీజులు కట్టేసి తర్వాత నచ్చలేదని బాధ పడే బదులు నాలుగైదు ట్రయల్‌ క్లాసులు ఇవ్వమని అడగొచ్చు. ఇందులో తప్పేం లేదు. ఈ సమయంలోనే శిక్షకుడిపై ఓ అంచనాకు రావొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని