ఒక్కడి అడుగు 65 కొలువులు

ఒక దివ్వె వెలిగేంతవరకే ఆపసోపాలు. అది వెలిగాక ఆ ప్రాంతాన్నే వెలుగులమయం చేస్తుంది. మంచిర్యాల జిల్లా బోయపల్లి యువకుడు సిరికొండ సంతోష్‌ అలాగే కొలువుల దివ్వెగా మారాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో రెండు గ్రంథాలయాలు ఏర్పాటు చేశాడు.

Published : 31 Jul 2021 05:07 IST

ఒక దివ్వె వెలిగేంతవరకే ఆపసోపాలు. అది వెలిగాక ఆ ప్రాంతాన్నే వెలుగులమయం చేస్తుంది. మంచిర్యాల జిల్లా బోయపల్లి యువకుడు సిరికొండ సంతోష్‌ అలాగే కొలువుల దివ్వెగా మారాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో రెండు గ్రంథాలయాలు ఏర్పాటు చేశాడు. తాను లక్ష్యం చేరడమే కాదు.. అక్కడ చదివిన 65మంది కొలువులు సాధించడానికి ప్రేరణగా నిలిచాడు.

సంతోష్‌ది 2009లో డిగ్రీ పూర్తైంది. ప్రభుత్వ ఉద్యోగం అతడి కల. గ్రామంలోనే చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని పోటీ పరీక్షలకు సిద్ధం కాసాగాడు. కొన్నాళ్లకు పాలకుర్తి భాస్కర్‌గౌడ్‌, తోట రాజేష్‌లు తోడయ్యారు. ముగ్గురూ కలిసి గ్రూప్స్‌, బ్యాంకింగ్‌, రైల్వే.. ఇలా అన్ని పోటీ పరీక్షల మెటీరియల్‌ సేకరించడం మొదలుపెట్టారు. చూస్తుండగానే వాళ్ల గది చిన్నపాటి గ్రంథాలయంలా మారింది. ఆపై సంతోష్‌ గ్రూప్‌ 4లో ఉద్యోగం సాధించాడు. అతడి పేరు ఊరంతా మార్మోగిపోయింది. అతడ్ని స్ఫూర్తిగా తీసుకొని స్థానిక యువకులు ఒక్కొక్కరుగా ఆ లైబ్రరీకి వచ్చి పుస్తకాలు పట్టేవారు. స్థలం సరిపోకపోవడంతో 2017లో తాండూరులోని ఓ పాఠశాల భవనాన్ని కూడా అద్దెకు తీసుకొని పోటీ పరీక్షల నిలయంగా మార్చేశారు మిత్రత్రయం. రకరకాల పుస్తకాల్ని సేకరిస్తూ, నిర్వహణ ఖర్చులూ భరించసాగారు. ఇక్కడ చదివి ఉద్యోగాలు సాధించినవారు కృతజ్ఞతాభావంతో ఆర్థిక సాయం అందించడం మొదలు పెట్టారు. మొదటి ఇంటిని అద్దెకు ఇచ్చిన రామల్లుగౌడ్‌ అదే ఇంట్లో నిరుద్యోగులతో కలిసి చదువుకున్నారు. తాను పని చేస్తున్న తపాలాశాఖలో పరీక్ష రాసి పదోన్నతి పొందారు. అప్పట్నుంచి అద్దె తీసుకోవడం మానేశారు. అతడి కొడుకు సైతం అక్కడే ప్రిపేరై ఇస్రోలో రెండుసార్లు సైంటిస్టుగా, సింగరేణిలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా కొలువులు సాధించాడు. అలా బోయపల్లి, తాండూరుల్లో సంతోష్‌ మిత్రబృందం ఏర్పాటు చేసిన పోటీ పరీక్షల నిలయాల్లో చదువుకుని ఇప్పటివరకు 65 మంది గ్రూప్‌ 2, సైంటిస్టు, ఫారెస్ట్‌ ఆఫీసర్‌.. తదితర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.

- జంబుల తిరుపతి, తాండూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని