Updated : 06 Nov 2021 06:08 IST

దగా చేసి వెళ్లిపోతావనుకోలేదు

దివారం సాయంత్రం. ఎప్పట్లాగే రైల్వేస్టేషన్‌కి వెళ్లి నాకిష్టమైన బెంచీపై కూర్చున్నా. ‘హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ నాలుగో నెంబర్‌ ప్లాట్‌ఫాం నుంచి బయల్దేరడానికి సిద్ధంగా ఉంది’ అనౌన్స్‌మెంట్‌ వినపడింది. నా కళ్లల్లోంచి రెండు చుక్కలు బొటబొటా రాలాయి. రైలు కదులుతోంది. అచేతనంగా చేయి ఊపా. రైలు స్పీడందుకుంది. ఆ వేగాన్ని మించి నా మనసు జ్ఞాపకాల్లోకి పరుగెడుతోంది.

‘ప్రేమ కవితలు రాస్తారు. రాజకీయ నాయకుల అవినీతిని అక్షరాలతో చీల్చి చెండాడతారు. మీ కలానికి రెండువైపులా పదును ఉన్నట్టుందే’ ఎఫ్‌బీలో ఓరోజు మెసేజ్‌. పంపింది సిరి. మన రాతల్ని మెచ్చుకుంటే ఎవరికైనా సంతోషమేగా! నేనూ మాట కలిపా. అలా మొదలైంది మా పరిచయం. మెసేజ్‌లు మాటలై, వ్యక్తిగత విషయాలూ షేర్‌ చేసుకోవడానికి ఎక్కువ రోజులేం పట్టలేదు.

సిరిలో నాకు బాగా నచ్చింది తన వ్యక్తిత్వం, మొండి ధైర్యం. చిన్నప్పుడే వాళ్ల నాన్న చనిపోయారు. తనకో అక్క. అమ్మ ఒప్పుకోలేదని ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోయిందట. అప్పట్నుంచి తనే కుటుంబ బాధ్యతలు తీసుకుంది. చదువుతూనే పార్ట్‌టైం ఉద్యోగం చేస్తోంది. వయసుకి మించి ఆలోచించేది. మనుషుల్ని బాగా అర్థం చేసుకునేది. ఎవరికైనా ఇంతకుమించి ఏం కావాలి? అందుకే ఓరోజు చెప్పేశా. పెళ్లంటూ చేసుకుంటే నిన్నేనని. ‘ఓహో అలాగా.. అయితే సారు వైజాగ్‌ వస్తారా? నన్ను హైదరాబాద్‌ రమ్మంటారా?’ అంది. తను వ్యంగ్యంగా అడిగినా అది పెద్ద సమస్యే. అంతలోనే ‘పోనీలే.. నేనే నీకోసం అక్కడికొస్తా.

ఉద్యోగం చేస్తా. కానీ మనతోపాటు మా అమ్మ కూడా ఉంటుంది. అదీ నా షరతు’ అంది. సంతోషంగా ఒప్పుకున్నా.

ఆరోజు ఏప్రిల్‌ 19. ఆఫీసుకి వెళ్తుండగా ఎదురొచ్చింది. నా కళ్లను నేనే నమ్మలేకపోయా. మొదటిసారి నా మనసుకి నచ్చిన నేస్తం కళ్లెదురుగా ఉంది. ఏంటిలా అంటే ‘పిచ్చిమొద్దూ.. ఈరోజు నీ బర్త్‌డే. నాక్కాబోయే శ్రీవారిని సర్‌ప్రైజ్‌ చేద్దామని ఇలా ప్లాన్‌ చేశానన్నమాట’ అంది. ఆరోజు సెలవు పెట్టా. చార్మినార్‌, బిర్లా టెంపుల్‌, ట్యాంక్‌బండ్‌ అన్నీ తిప్పి చూపించా. సాయంత్రం ప్యారడైజ్‌కి వెళ్లాం. అమ్మలా ముద్దలు కలిపి నోట్లో పెట్టింది.

తనని దిగబెట్టడానికి రైల్వేస్టేషన్‌కి వెళ్లా. బెంచీపై కూర్చొని గంటసేపు మాట్లాడుకున్నాం. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకున్నాం. రైలు ఎక్కడానికి వెళ్తుంటే ప్రాణం విలవిల్లాడిపోయింది. అది గమనించిందేమో. పరుగున వెనక్కి వచ్చింది. నన్ను అమాంతం కౌగిలించుకొని వెక్కివెక్కి ఏడ్చింది. నాకూ కన్నీళ్లాగలేదు. పది క్షణాలయ్యాక తేరుకొని తన మెడలోని గోల్డ్‌చైన్‌ తీసి నా మెడలో వేసింది. ‘ఇక నుంచి నేను నీకు అమ్మనవుతా. నువ్వు నాన్నలా నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి’ అంది. తలూపుతూ బై చెప్పా. అలా ఏడాదిలో తను నాలుగు సార్లు హైదరాబాద్‌ వచ్చింది. రెండుసార్లు నేను వైజాగ్‌ వెళ్లా.

2020 జనవరిలో తనకో ఉద్యోగం చూశా. జులైలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా ఖర్మకొద్దీ తన ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌ పోయాయి. బోర్డుకెళ్లి తెచ్చుకునేసరికి నెలైంది. ఈలోపు కరోనా లాక్‌డౌన్‌. సిరి సమయానికి రాలేకపోయింది. పరిస్థితులు సద్దుమణిగాక వేరే ఉద్యోగం చూద్దాంలే అనుకున్నా. కానీ జరిగింది వేరు. 2020 జూన్‌ 11. నా జీవితం తలకిందులైన రోజు. సిరి రోడ్డు దాటుతుంటే రాంగ్‌రూట్‌లో వచ్చిన బైకర్‌ ఢీకొట్టాడట. తలకి బలమైన గాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు నా ప్రాణం ప్రాణాలు విడిచింది. సిరి అమ్మ ఏడుస్తూ ఫోన్‌ చేశారు. అష్టకష్టాలు పడి అక్కడికి వెళ్లినా ప్రాణసఖి చివరిచూపు కూడా దక్కలేదు.

ఏడాదిన్నరైనా ఇప్పటికీ తనని మర్చిపోలేకపోతున్నా. తను చివరిసారిగా చెప్పిన మాట గుర్తొచ్చినప్పుడల్లా దుఃఖం ఆగట్లేదు. ‘నీకోసం పుట్టిన ఊరు, బంధువులు అందర్నీ వదులుకొని వచ్చేస్తున్నా. నువ్వంటే నాకు ఎంత ప్రేమో అర్థం చేసుకోరా’ అని. పిచ్చి సిరీ.. నాకూ నువ్వంటే ప్రాణమే అని చెప్పాలని ఉంది. కానీ అర్ధాంతరంగా నన్ను మోసం చేసి వెళ్లిపోయావెందుకు? అని నిలదీయాలనుంది. కానీ ఎలా? అందుకే తను నన్ను కావలించుకొని ఏడ్చిన స్టేషన్‌కి నెలకి నాలుగు సార్లైనా వెళ్తుంటా. మేం కబుర్లు చెప్పుకున్న బెంచీపై కూర్చొని తనని వెతుక్కుంటూనే ఉన్నా.

- చందు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts