గుండె పగిలిపోనివ్వొద్దు

అందరి అమ్మాయిల్లాగా నాదీ పెద్దలు కుదిర్చిన పెళ్లి. అమ్మాయి అందంగా లేదని, ఇష్టంలేని పెళ్లి చేశారని వరుడు నన్ను వదిలేశాడు. ఇరువైపుల పెద్దలు కాపురం నిలబెడదామని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇలా సంవత్సరం గడిచిపోయింది. దురదృష్టవంతురాలినని అంతా...

Updated : 31 Dec 2018 17:42 IST

గుండె పగిలిపోనివ్వొద్దు

గుండె పగిలిపోనివ్వొద్దు

అందరి అమ్మాయిల్లాగా నాదీ పెద్దలు కుదిర్చిన పెళ్లి. అమ్మాయి అందంగా లేదని, ఇష్టంలేని పెళ్లి చేశారని వరుడు నన్ను వదిలేశాడు. ఇరువైపుల పెద్దలు కాపురం నిలబెడదామని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇలా సంవత్సరం గడిచిపోయింది. దురదృష్టవంతురాలినని అంతా సూటిపోటి మాటలన్నారు. అలాంటి పరిస్థితుల్లో నా కాళ్లమీద నేను నిలబడితే ఈ బాధలు తప్పుతాయనిపించింది. దాంతో పీజీ పూర్తిచేసి ఉద్యోగ  ప్రయత్నం చేశా. ఓ కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించా. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి. అప్పుడు నా సహోద్యోగికి ప్రియుడిగా పరిచయమయ్యాడు అతను. అందరితో కలుపుగోలుగా ఉండే  ఆ వ్యక్తి మాకు దూరపు బంధువని తెలిసింది. దీంతో ఇంకాస్త చనువు పెరిగింది. అలా నా సహోద్యోగి, అతను, నేను మంచి స్నేహితులం అయ్యాం. అయితే కొన్నాళ్లకు వారిద్దరి మధ్యా పెళ్లి విషయంలో వివాదం తలెత్తింది. విడిపోయారు. చాన్నాళ్లు ఆ అమ్మాయిని అతను మరిచిపోలేకపోయాడు. దాంతో ఓ స్నేహితురాలిగా ఓదార్చేదాన్ని.  బహుశా ఆ రోజు నేను వేసిన తప్పటడుగు అదేనేమో! క్రమంగా అతను నాకు దగ్గరయ్యాడు. ఆమె ప్రేమ కంటే నా సహవాసం సంతోషం కలిగిస్తుందని, పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించాడు. ‘నేను ఇప్పటికే  ఓ సారి దెబ్బతిన్నా...మళ్లీ ఏదైనా సమస్య వస్తే తట్టుకోలేను. అలాంటి ఆలోచనలు వద్దు’ అన్నా.  అతను ‘అలాంటిదేమీ జరగద’ని హామీ ఇచ్చాడు. నాలో భరోసా కల్పించాడు. అప్పటి నుంచి నా ఆలోచనలూ, బాధలూ, భావోద్వేగాలూ, అవసరాలు... అన్నీ అతనే. ఒక్కమాటలో చెప్పాలంటే అతనే నా ప్రపంచం. నా ప్రేమ అందరికీ తెలియాలని నేను అనుకునేదాన్ని. అతనేమో! ‘చెల్లి పెళ్లయ్యేవరకూ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు.. మళ్లీ ప్రేమంటే అంతా ఎగతాళి చేస్తార’ని నమ్మించాడు. అయితే ఒక్కోసారి నలుగురిలో నాతో అతను ప్రవర్తించే తీరు అభద్రతను కలిగించేది. అడిగితే ఒట్టేసి మరీ ‘చెల్లి పెళ్లి అవ్వగానే మనం పెళ్లి చేసుకుందాం. అనుమానాలేమీ పెట్టుకోకు’ అని చెప్పేవాడు. నాలుగేళ్లు గడిచిపోయాయి. అది 2016 నా జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు మిగిల్చిన సంవత్సరం. కొన్నాళ్లుగా అతని మాటలో, ప్రవర్తనలో చాలా తేడా కనిపించేది. ఫోన్‌కీ పాస్‌వర్డ్‌లు పెట్టుకునేవాడు. మన మధ్య దాపరికాలు ఏంటి? అని అడిగితే ‘నీకు అనుమానం’ అంటూ ఎదురు తిరిగేవాడు. ఆ సమయంలోనే కొందరు స్నేహితులు అతనితో మరో అమ్మాయిని చూశామని చెప్పారు. నేను ప్రశ్నిస్తే... ‘వాళ్ల మాటలు నమ్ముతావా? నన్ను నమ్ముతావా’ అంటూ బుజ్జగించేవాడు. ఓ రోజు అతని ఫోన్‌ నా చేతిలో ఉండగా కాల్‌ వచ్చింది. మాట్లాడమంటే కంగారుపడ్డాడు. ‘ఆమె స్నేహితురాలు మాత్రమే.. మా మధ్య ఏమీలేద’ని బుకాయించాడు. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు మాటిచ్చాడనీ, నాలుగు నెలలుగా ఆమెతో ప్రేమలో ఉన్నాడని నాకు తెలిసింది. ఒక్కసారిగా షాక్‌కి గురయ్యా. ‘ఆ అమ్మాయితో అతనికి ఈడూ, జోడూ బాగుంటుంది... నిన్నెలా ప్రేమిస్తాడు’ అని సహోద్యోగులు అంటుంటే చచ్చిపోయేదాన్ని. వాళ్లే ప్రేమికులు నేనే మధ్యలో అనవసరంగా వెళ్లానని అందరూ అనుకున్నారు. నా కాల్స్‌  బ్లాక్‌ చేశాడు. తను తప్పు చేశాడని తెలిసినా... మారితే చాలనుకున్నా. ఎంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేసినా... అతను మా విషయం చెప్పకుండా నేనే తన వెంట పడ్డానని ప్రచారం చేశాడు. నాలుగేళ్లు నాతో ప్రేమగా ఉండి, నాతోనే సంతోషమన్న వ్యక్తి ఇప్పుడు నీతో ఉంటే సంతోషమే ఉండదంటుంటే  తట్టుకోలేకపోయా. ఆత్మహత్యా ప్రయత్నం చేశా. స్నేహితుల చొరవతో బతికి బయటపడ్డా. ప్రస్తుతం మానసిక నిపుణుల కౌన్సెలింగ్‌, మందులతో నా విపరీత ఆలోచనలు తగ్గాయి. కొద్దికొద్దిగా అతని ప్రేమ నాటకం నుంచి బయటపడుతున్నా. అందమైన, ఆస్తులున్న అమ్మాయిలే కావాలనుకునే అబ్బాయిలు... ముందే వారినే చూసుకుంటే నాలాంటి వాళ్ల గుండెలు పగిలిపోవు కదా!

- శ్వేత, (పేరు మార్చాం)

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని