క్రేజీ ప్రపంచంలోనూ తాతకు ప్రత్యేకస్థానం

ఉరకలు వేసే ఉత్సాహానికి ఓ రూపమిస్తే అది ఆ అమ్మాయి. నెటిజన్లంతా ఆమెని ‘ఇంటర్నెట్‌ ఫైర్‌’ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. వేలాది మంది ఫాలోవర్స్‌తో ఆమె ఓ ఇన్‌స్ట్రాగ్రామ్‌ సంచలనం. అమెరికా యువత ప్రతిరోజూ

Published : 26 Jan 2019 00:21 IST

- ‘ఈతరం’తో గాంధీ మునిమనవరాలు మేథా

ఉరకలు వేసే ఉత్సాహానికి ఓ రూపమిస్తే అది ఆ అమ్మాయి. నెటిజన్లంతా ఆమెని ‘ఇంటర్నెట్‌ ఫైర్‌’ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. వేలాది మంది ఫాలోవర్స్‌తో ఆమె ఓ ఇన్‌స్ట్రాగ్రామ్‌ సంచలనం. అమెరికా యువత ప్రతిరోజూ తలుచుకునే నంబర్‌ వన్‌ మార్నింగ్‌ షో సహ వ్యాఖ్యాత. పేరు మేథ. ఇవన్నీ కాకుండా ఆమెకో గుర్తింపు ఉంది. అది గాంధీ మునిమనవరాలు మేథాగాంధీ అని. ఆధునికత్వం అచ్చులో పోసి తీసినట్టుండే మేథకి గాంధీ గురించి తెలిసిన విషయాలేంటో.. ‘ఈతరం’ తెలుసుకుంది.

* మీరు ఏ వయసులో మొదటిసారి గాంధీజీ గురించి తెలుసుకున్నారు?
ఊహ వచ్చినప్పట్నుంచి ఇప్పటిదాకా ఆయన కథ నాకు తెలియని సందర్భం అన్నది ఒకటున్నట్టూ, ఎవరో వచ్చి ప్రత్యేకంగా నాకు చెప్పినట్టు గుర్తులేదు. గాంధీజీ జీవితాన్ని చాలామంది పాఠ్య పుస్తకాల్లో చదివినట్టుగా ఒక కథలా నేను చదవలేదు. నేను పెరిగే క్రమంలో ఊహ తెలిసేనాటికే అమ్మానాన్నలు చెబుతున్నప్పుడు ఆయన పాటించిన విలువల్ని, జీవితాన్ని క్రమంగా గ్రహించాను. మీ అమ్మానాన్నలని మొదటిసారి ఎప్పుడు అమ్మానాన్నలుగా గుర్తించావ్‌ అంటే ఏం చెబుతాం. నాదీ అలాంటి అనుభవమే గాంధీజీ విషయంలో!

గాంధీజీ అనుసరించిన సత్యం, శాకాహార నియమాల వంటివి ఇప్పటి యువతలోనూ ఆసక్తి రేపుతున్నాయి. మీరేమంటారు?
క్రేజీ ప్రపంచం అనుకునే సమాజంలో కూడా ఆయన చెప్పిన విషయాలకి ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆయన చెప్పిన, పాటించిన జీవిత విలువలని నేను నూటికి నూరుశాతం గౌరవిస్తాను. కానీ నేనున్న పరిస్థితుల్లో వాటిని పాటిస్తానని మాత్రం చెప్పలేను. నాకు ప్రకృతి సంబంధించిన విషయాలపట్ల ప్రేమ ఎక్కువ. ముఖ్యంగా జంతువులపై. అలాని నేను ఆయనలా శాకాహారిని కాదు. కానీ మారడానికి ప్రయత్నిస్తున్నాను. చూద్దాం. తక్కిన విషయాలంటారా.. నేనున్న ప్రపంచం వేరు. సగటు ఆధునిక అమ్మాయినే. అయితే ఓ విషయంలో నేను అదృష్టవంతురాలిననే చెప్పాలి. నేను నా ట్రాక్‌ దాటి బయటకు వస్తున్నప్పుడల్లా నా కుటుంబం మర్యాద, దయ వంటి వాటి గురించి గుర్తుచేస్తూనే ఉంటుంది.

హాట్‌బేబీసాస్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిరుచులు, ట్రావెలాగ్‌ వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తుంది. ఆమె వేసే పంచ్‌లు, వ్యంగ్యోక్తులంటే ఇన్‌స్టాగ్రామ్‌ యువత ప్రాణం పెడతారు. 52వేలమంది ఆమె ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్లని అనుసరిస్తున్నారు.
గుడ్‌మార్నింగ్‌.... బోస్టన్‌! అంటూ బోస్టన్‌ నగరాన్నే కాదు. యావత్‌ అమెరికానే ఒక్క కుదుపుకుదిపే కార్యక్రమం ‘ఎల్విస్‌డ్యురాన్స్‌ మార్నింగ్‌ షో’. ఎక్కడా మూసకు తావివ్వకుండా... పొద్దుపొద్దునే బండెడు ఉత్సాహాన్ని కాఫీ కప్పులో పోసి అందించే ఆ కార్యక్రమానికి ప్రధాన వ్యాఖ్యాత ఎల్విస్‌ అయితే సహ వ్యాఖ్యాత మేథాగాంధీ.

* ఆమెరికాలో ఎప్పుడు స్థిరపడ్డారు?
మా పెదనాన్న శాంతిగాంధీ డాక్టర్‌. ఆయన వచ్చిన తర్వాత నాన్న ప్రదీప్‌ కూడా వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు.

* మీ అమ్మానాన్నల గురించి...
మా అమ్మ యూఎస్‌ పోస్టల్‌ సర్వీస్‌కి చెందిన హ్యుమన్‌ రిసోర్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. నాన్నది వ్యాపారœం. అయితే అమ్మ జీవితం నా అంత సాఫీగా సాగలేదు. వర్ణవివక్ష వంటి అనేక అంతరాలని ఎదుర్కొని తనా స్థాయికి ఎదిగింది. చెల్లెలు ప్రియాగాంధీ. పీడియాట్రిక్‌ నర్స్‌గా శిక్షణ తీసుకుంది. యువతలో లైంగిక విజ్ఞానం పెంచే దిశగా చిన్న సైజ్‌ ఉద్యమమే సాగిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన యువత కోసం స్కూళ్లలో క్లినిక్‌లు తెరిచి యువతలో లైంగికపరంగా వచ్చే శారీరక, మానసిక సమస్యలపై పోరాడుతోంది. అన్నింటికీ మించి తను అమ్మకూచి... నాన్న కూచి. నా దృష్టిలో తనో అద్భుతం. నాకు దేశాలు చుట్టిరావడం అంటే ప్రాణం. పర్యటనలే నా ప్రపంచం. గత ఏడాది మొదటి నెలంతా భారత్‌లోనే ఉన్నాను. ముంబయి ఇష్టమైన నగరం.

* గాంధీజీ 150 జయంతి వేడుకలని మీరు ఎలా జరుపుకొన్నారు?
నేనో విషయం చెబుతాను. నేను లేదా మేం ఆయన వారసులం మాత్రమే కానీ భక్తులమో, గాంధీగిరిని ప్రదర్శించాలనుకునేవాళ్లమో కాదు. నలుగురి దృష్టిలో పడటం కోసం గాంధీని ఇంటి పేరుగా మార్చుకునే వాళ్లను చూశా. నువ్వు అసలు గాంధీ వారసురాలివేనా అని నన్ను అడిగేవాళ్లని చూశా. కానీ నేను వీటన్నింటికి దూరం. నేను మా వారసత్వాన్ని గౌరవిస్తా. తక్కిన వాళ్లలాగే ఆయన గురించి తెలుసుకుంటా.

 

మేథాగాంధీ మరెవరో కాదు. గాంధీజీ పెద్దకొడుకు హరిలాల్‌గాంధీ మనవరాలే ఈ అమ్మాయి. భారతీయతకు, గాంధీగిరీకి పూర్తిగా దూరంగా అమెరికాలోని మియామిలో పుట్టి పెరిగింది. అచ్చంగా పడమటిదేశాల సంస్కృతికి ప్రతినిధిలా వంకీలు తిరిగిన బ్లాండెడ్‌ జుట్టుతో, అమెరికన్‌ యాసతో గలగలమంటూ నాన్‌స్టాప్‌గా మాట్లాడుతుంది. అయినా సరే నా భారతీయ మూలాలింకా పదిలం అని చెప్పడానికా అన్నట్టుగా మధ్యమధ్యలో తళుక్కుమనే ముక్కుపుడక.. చారడేసి కళ్లు జిగేల్‌మంటాయి.

* మీకే కనుక గాంధీజీతో కలిసి భోజనం చేసే అవకాశం వస్తే ఆయనతో మీరేం మాట్లాడతారు?
నేటి ప్రపంచ పరిణామాలని మీరు పైనుంచి చూస్తూనే ఉన్నారా తాతయ్యా? సరే మిమ్మల్ని తట్టుకోలేనంతగా నిరాశ నిస్పృహల్లోకి నెట్టేసిన మీ కుటుంబసభ్యులు ఎవరు? తప్పకుండా నేను కూడా ఆ సభ్యుల్లో ఉండే ఉంటాను కాబట్టి... ఇప్పుటికైతే ఈ ప్రశ్న దాచుకుంటాను. మరెప్పుడైనా వేస్తానులే!

- శ్రీ సత్యవాణి గొర్లె


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని