సీతమ్మ వాకిట్లో... సిరి ‘మల్లి’...

మా ఊరికి ట్రైన్లు ఉండవు. బస్సులోనే వెళ్లాలి. ఎప్పట్లా అయితే పచ్చగా పరుచుకున్న మా కోనసీమ

Updated : 23 Feb 2019 06:52 IST

మా ఊరికి ట్రైన్లు ఉండవు. బస్సులోనే వెళ్లాలి. ఎప్పట్లా అయితే పచ్చగా పరుచుకున్న మా కోనసీమ అందాలనీ, మెలికలు తిరిగిన కాలవలని చూసుకుంటూ.. తీరిగ్గా ఇంటికి వెళ్లేవాడినే. ఈ సారి ఏ అందాలూ నన్ను ఆకట్టుకోవడం లేదు. చెల్లాచెదురుగా మనసంతా ఆక్రమించుకున్న ఆమె జ్ఞాపకాలు తప్ప! తీరిగ్గా ఆగాగి వెళుతున్న ప్రైవేట్‌ బస్సుమీద ఎక్కడలేని కోపం వస్తోంది. లేటయితే తనని ఇంకెప్పటికీ చూడలేననే టెన్షన్‌ నిమిషనిమిషానికి నన్ను ముల్లులా గుచ్చుతోంది...

చివరికి చేరుకున్నాను.. ఆమె ఆఖరి యాత్రకి. ‘ఎప్పుడు వచ్చావురా?’ అని అమ్మ అడుగుతోంది. సమాధానం ఇవ్వాలనిపించలేదు. ‘ఏ బస్సుకి... వచ్చావురా. ఇంటికయినా వెళ్లావా’ మావయ్యో.. బాబాయో! పలకరిస్తున్నా పట్టించుకోలేదు. ముందు ‘సీతాయమ్మ’ని చూడాలనే ఆతృతే నాలో నిండిపోయింది. చూశాను. కళ్లనిండుగా ఆ రూపాన్ని జీవితాంతం దాచుకోవడానికి చూశాను. తను ఎలా ఉందంటే? ‘హమ్మయ్య.. ఇంక ఏ బాధ్యతలు లేవ’న్నట్టుగా తేలికపడిన మనసుతో, కళ నిండిన ముఖంతో మా నాయనమ్మ సీతాయమ్మ ముఖం వెలిగిపోతూ ఉంది. అప్పుడు చుట్టూ చూశాను. అమ్మమ్మలు, పిన్నులు, మామయ్యలు, బాబాయిలు కాకుండా వందలాది మందితో ఆ చావిడంతా కిక్కిరిసిపోయింది. వాళ్లకీ, నానమ్మకీ కనీసం బీరకాయపీచు బంధుత్వమూ లేదు. మరే బంధంతో వీళ్లంతా తనని చూడ్డానికి వచ్చారనుకుంటారా? ఆశించకుండా పంచిన ప్రేమ... ఆకలి వేసినప్పుడు ఆమె వడ్డించిన అన్నమే వాళ్లకీ ఆమెకీ ఉన్న బంధం. సీతయమ్మ... మా అమ్మకు స్వయానా మేనత్త. తాతయ్యతో పెళ్లయ్యాక మా ఊరు వచ్చేసింది. సీతంటే సీతలానే అందంగా ఉండేది. ఫొటోలో చూశాను. నాకు తెలిసే నాటికి ఓ మేడింట్లో ఉండేది. అప్పటికి వడ్డాణాలూ, వంకీలు, రాగిడీలు లేవు. తన దానగుణానికి కరిగిపోయాయి. పొయ్యికి మూడు పొక్కళ్లు ఉంటాయి కదా! కానీ వాళ్లింట్లో మూడో ఇటుక కింద ఓ రాగి కాగు అందులో వేడినీళ్లతో మరుగుతూ ఉండేది. ఎప్పుడు చూడు పొయ్యి మీద పెద్ద ఇత్తడి బిందెలో అన్నం కుతకుత ఉడికేది. ‘బస్తా బియ్యం పదిరోజులు కూడా రానివ్వడం లేదు  తులసమ్మా మీ అత్త’ అంటూ తాతయ్య అమ్మతో చెప్పేవాడు. నాయనమ్మకి పిల్లల్లేరు. అందుకే మేమంతా పిల్లలమే అయ్యాం! ఆడబడుచుల పిల్లల పురుళ్లూ, పుణ్యాలు అన్నీ నాయనమ్మ ఇంట్లోనే. ఆ పిల్లలకు నడకొచ్చాకే వాళ్లింటికి వెళ్లేవారు. నేను మేడింటికి వెళ్తే కారప్పూస పొట్లాలు, బూందీ పొట్లాలు చేయిపట్టనంతగా కొని పంపించేది. అప్పడప్పుడు మా నాన్న దగ్గర పాత బట్టలు అడిగి తీసుకునేది. ‘ఎందుకే నానమ్మా’ అంటే... ఒకతన్ని చూపించింది. పెడితే కనీసం తినడం రాని ఓ బికారి.  అలాంటి వాడికి గెడ్డం గీయించి... పొద్దుపొద్దునే టీ, టిఫిన్‌ చేసి పెట్టేది. వాడికోసమే ఈ బట్టలు అనేది. ఇవన్నీ చేసిపెట్టడానికి నానమ్మ దగ్గర మల్లిగాడు ఉండేవాడు. చిన్నప్పుడు ఏదో జాతరకి వచ్చి తప్పిపోయిన మల్లిని పనికి ఉంచింది. పేరుకే పనోడు కానీ బిడ్డకిందే లెక్క ఆమెకి. నానమ్మ దానగుణానికి ఆస్తులన్నీ కరిగిపోయాయి. తాతయ్య పదిహేనేళ్ల క్రితమే చనిపోయారు. చివరికి మల్లి మాత్రమే నానమ్మతో మిగిలాడు. అన్నట్టు నానమ్మ తోడికోడళ్ల పిల్లలని, పుట్టింటి తరపు వాళ్లలో ఒక్కరిని దత్తత తీసుకుంది. వాళ్లకు ఆస్తులు రాసిచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆస్తి పంచుకున్న వాళ్లు తప్పించి అప్పుడప్పుడు అన్నం తిన్న మాలాంటి వాళ్లంతా ఆమె పూలపల్లకి మోయడానికి వచ్చారు. ఫేస్‌బుక్‌లోనో, వాట్సప్‌ స్టేటస్‌లోనో కొటేషన్లు పంచుకోవడం మాత్రమే తెలిసిన మా తరానికి మంచితనానికి, దానగుణానికి అర్థం చెప్పే సజీవమైన రూపాన్ని చూడ్డానికే నేనంతలా పరుగు పెట్టా! స్మృతులతో పాటు, స్ఫూర్తి వెంట తెచ్చుకున్నా.

- సత్య, పాలకొల్లు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని