నాన్నని వదిలేశా..ప్రేమలో ఏడుస్తున్నా!

ఏంజెల్‌.. ప్రాణం.. బంగారుకొండ.. ఇవన్నీ నేనే. మా నాన్నకు. చాక్లెట్లు.. బొమ్మలు.. డ్రెస్‌లు.. స్కూటీ.. ఇవేంటి అడక్కముందే కొండమీద కోతినైనా తీసుకొచ్చి ఇచ్చేవారు. నేనేడిస్తే ఆయన కళ్లలో నీళ్లొచ్చేవి. నేను నవ్వితే ఆయనకి పండగ. నాన్నంత కాకపోయినా అమ్మకీ నేనంటే ఇష్టమే....

Published : 06 Apr 2019 00:14 IST

పెళ్లి బాజాలతో సినిమాల్లో శుభం కార్డు పడుతుంది...
కానీ పెళ్లితో జీవితం అనే సినిమా మొదలవుతుంది.

ఏంజెల్‌.. ప్రాణం.. బంగారుకొండ.. ఇవన్నీ నేనే. మా నాన్నకు. చాక్లెట్లు.. బొమ్మలు.. డ్రెస్‌లు.. స్కూటీ.. ఇవేంటి అడక్కముందే కొండమీద కోతినైనా తీసుకొచ్చి ఇచ్చేవారు. నేనేడిస్తే ఆయన కళ్లలో నీళ్లొచ్చేవి. నేను నవ్వితే ఆయనకి పండగ. నాన్నంత కాకపోయినా అమ్మకీ నేనంటే ఇష్టమే.
ఇంటర్‌దాకా నాన్నచాటు బిడ్డనే. బీటెక్‌లో నాకో కొత్త బంగారులోకం పరిచయమైంది. అందుక్కారణం రామ్‌. అర్జున్‌రెడ్డి సినిమాలో హీరోలా ఉండేవాడు. ఎవర్నీ లెక్కచేయని మనస్తత్వం. అనుకున్నది చేసేస్తాడు. కాలేజీలో తనంటే అమ్మాయిలందరికీ క్రేజ్‌. అలాంటిది తనంత తానొచ్చి మాట కలిపాడు. ముందు అవాయిడ్‌ చేశా. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తుంటే కాదనలేకపోయా. సెకండియర్‌కి వచ్చేసరికి మాటలు దాటి చాటుమాటుగా కలుసునేదాకా వెళ్లాం. వీకెండ్‌లో సినిమాలు, ఒకే కూల్‌డ్రింక్‌లో రెండు స్ట్రాలు, దుప్పట్లో దూరి వాట్సాప్‌లో వీడియో చాటింగ్‌లు.. అందరు ప్రేమికుల్లాగే మేం.
మా పెళ్లికి నాన్న ఒప్పుకుంటారని నా నమ్మకం. అదే ధైర్యంతో ఫైనలియర్‌లో మా ప్రేమ విషయం చెప్పా. ‘అబ్బాయి గురించి కనుక్కుంటా. కొంత టైమివ్వమ్మా’ అన్నారు. జరగబోయే వేడుక ఊహించుకుంటూ గాల్లో తేలిపోయా. వారం, పదిహేను రోజులు గడిచాయి. నాన్న ఏ విషయం తేల్చరే! ‘నిన్ను నాకిచ్చి చేయడం మీ డాడీకి ఇష్టం లేదేమో. వాయిదా వేస్తూ ఉంటే నీ మనసు మారుతుందని ఆయన ప్లాన్‌’ ఆవేశపడిపోయాడు రామ్‌. నాకూ అదే అనిపించి నిలదీశా. ‘కులం, డబ్బు పట్టింపులు నాకేం లేవమ్మా. కానీ ఆ అబ్బాయి క్యారెక్టర్‌ బాగోలేదని తెలిసింది. చదువులోనూ వెనకే. ఒక్కసారి ఆలోచించు ప్లీజ్‌’ అభ్యర్థించారు నాన్న. ప్రేమ మైకంలో కూరుకుపోయిన నాకవేం చెవికెక్కలేదు. నేను పట్టు వదల్లేదు. కన్నవాళ్లు మెట్టు దిగలేదు.
‘మేం మీ పెళ్లి పెద్దలవుతాం’ అన్నారు ఫ్రెండ్స్‌. నా బ్యాంకు ఖాతాలో అప్పుడప్పుడు నాన్న వేసిన మొత్తం ఉండనే ఉంది. గడప దాటాం. గుళ్లో దండలు మార్చుకున్నాం. సిటీలో కాపురం పెట్టాం. ఆర్నెల్లు చిలకాగోరింకల్లానే ఉన్నాం.

ఆ తర్వాత మొదలయ్యాయి కష్టాలు. ఇంటినుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఫ్రెండ్స్‌ సాయం ఆగిపోయింది. పస్తులుండాల్సిన పరిస్థితి. గత్యంతరం లేక ఓ దుస్తుల దుకాణంలో సేల్స్‌వుమన్‌గా చేరా. తనకి డిగ్రీ లేదు. చిన్న పనులు చేయడానికి నామోషీ. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ‘కనీసం బీటెక్‌ పూర్తి చేసినా ఏదైనా జాబ్‌ చేసేవాడివిగా’ అన్నానోసారి. ‘కాలేజీలో రోజూ నీ చుట్టే తిప్పుకున్నావ్‌. ఇంక నేనేం చదువుతాను?’ అన్నాడు కర్కశంగా. నా గుండె ముక్కలైంది. నా వెంట పడింది తను. జీవితాంతం నిన్ను గుండెలో పెట్టుకొని చూసుకుంటా అన్నది తను. ఇప్పుడు మాట మార్చేశాడు. మాటిమాటికీ కసురుకోవడం.. చీటికీమాటికీ అరవడం పరిపాటైంది. ఓరోజు నేను అమ్మను కాబోతున్నానని తెలిసింది. అదేసమయంలో రామ్‌ మరో అమ్మాయితో లవ్‌ నడిపిస్తున్నాడనీ తెలిసింది. పొగిలిపొగిలి ఏడ్చా. తనపై కోపంతో కడుపులో పిండాన్ని చిదిమేసుకున్నా.
రెండేళ్లు గడిచాయి. తను మారతాడనీ.. మళ్లీ నాపై ప్రేమ కురిపిస్తాడనీ ఎదురుచూసి అలసిపోయా. ఎంతో పోరు పెడితే ఏదో పనిలో చేరతాడు. నెలా, రెండు నెలలు గడవగానే మానేస్తాడు. ఇక నాముందే అమ్మాయిలతో ఫోన్‌లో సరసాలు. ఇలాంటి వాడ్ని ప్రేమించినందుకు నాపై నాకే కోపం, అసహ్యం వేస్తోంది. ఈ బాధలో అమ్మానాన్నలు గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపాగడం లేదు. మా నాన్న ఎంత గొప్పవారు? ప్రేమిస్తున్నా నాన్నా అంటే కోపంతో రగిలిపోలేదు. నా భవిష్యత్తు ఆలోచించి మంచి మాట చెప్పారు. పెడచెవిన పెట్టిన నాకు ఈ శాస్తి జరగాల్సిందే. ఇప్పటికిప్పుడు మా ఇంటికెళ్తే నన్ను గుండెలకు హత్తుకుంటారని తెలుసు. కానీ నాకే మొహం చెల్లడం లేదు. నాన్నా నీ మాట వినక తప్పు చేశా. కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని ఉంది.
ప్రేమ, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం హీరోయిజంలాగే ఉంటుంది. కానీ తప్పుడు వ్యక్తిని ఎంచుకుంటే నాలాగే ఏడవాల్సి వస్తుంది. కాలు గడప బయటపెట్టేముందు ఓసారి ఆలోచించండి.

- అనిత (పేర్లు మార్చాం)

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు