తోక కుక్కను ఊపకూడదు

ఉన్నత ఉద్యోగం.. లక్షల్లో జీతం..అక్కడితో ఆగిపోతే ఎలా? ఆ వేతనంలో కొంత భాగాన్ని పెట్టుబడిగా మార్చేస్తే! మీ ఆలోచనను అంకురంగా మలచి నిలిస్తే! అప్పుడు మీ లక్ష్యం ఏదై ఉండాలి?మీ విజన్‌ ఎలా ఉండాలి?

Updated : 13 Apr 2019 03:46 IST

స్టార్టప్‌ కోచ్‌

ఉన్నత ఉద్యోగం.. లక్షల్లో జీతం..అక్కడితో ఆగిపోతే ఎలా? ఆ వేతనంలో కొంత భాగాన్ని పెట్టుబడిగా మార్చేస్తే! మీ ఆలోచనను అంకురంగా మలచి నిలిస్తే! అప్పుడు మీ లక్ష్యం ఏదై ఉండాలి?మీ విజన్‌ ఎలా ఉండాలి?

ఆ మూలాల్ని దాటాలి

డిగ్రీలు, పీజీలు సంపాదించేందుకు లక్షల్లో ఖర్చు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించాక ఒకటే లక్ష్యం. కోట్లల్లో సంపాదించడం. ఊహ తెలిసిన నాటి నుంచి ఇదే మైండ్‌లో బాగా రిజిస్టర్‌ అయ్యేలా చుట్టూ అందరూ ప్రభావితం చేస్తారు. ‘బాగా చదువుకుని బాగా సంపాదించాలి’ దీన్ని వంట పట్టించుకున్న వారందరూ అనుకున్న లక్ష్యాన్ని చేరతారు. కానీ, ఎప్పుడైతే ఆర్జించిన మొత్తంతో స్టార్టప్‌ పెట్టారో ఆ క్షణం నుంచి మూలాల్ని బ్రేక్‌ చేయగలగాలి. సంపాదించిన లక్షల్ని కోట్లలా చూడాలనుకుని అంకురాన్ని స్థాపిస్తే దాని ఆయువు ఎక్కువ కాలం నిలవదు. వ్యక్తి ఓ వ్యవస్థగా మారాలంటే ఉద్దేశాల పరిధి ఉన్నతంగా ఉండాలి. అప్పుడు డబ్బే మిమ్మల్ని ఫాలో అవుతుంది.

ముందే ఆలోచించాలి

క్యాంపస్‌లో ప్లేస్‌మెంట్‌ అయ్యింది మొదలు.. హైక్‌ వస్తుందంటే చాలు. హై..హై నాయకా అంటూ దీంట్లో నుంచి దాంట్లోకి దూకేస్తుంటారు. సంపాదనే లక్ష్యంగా కప్పలాగా ఒక చెలమ నుంచి మరో చెలమలోకి క్షణం ఆలోచించకుండా దూకేస్తారు. ఇది అప్పటికి తప్పేం కాదు. కానీ, అంకురం వైపు ఆలోచన మళ్లిందో అప్పుడు ఆచితూచి ఆలోచించాలి. ఎందుకంటే.. ఒక్కసారి దూకితే ఈదడం అనివార్యమవుతుంది. ఒడ్డుకి చేరడం అంత ఈజీ కాదు. మీరే కాదు. మీతో కలిసి పని చేసే బృందాన్ని కూడా కప్పల్లా కాకుండా చేపల్లా ఎదురు ఈదేలా మార్చాలి.

ఉద్దేశం ముఖ్యం..

అంకురాల నిర్వహణలో ఉన్న 90 శాతం మంది చేసే పనులు తోకే కుక్కను ఊపినట్టుగా ఉంటాయి. స్టార్టప్‌ ఊపిరిపోసుకుంది మొదలు ప్రా‘ఫిట్‌’గా ఉండేందుకు మొగ్గు చూపుతుంటారు. అంకురం మూల ఉద్దేశం డబ్బు కంటే గొప్పగా ఉండాలి. ఒక పారిశ్రామిక వేత్తని కేవలం డబ్బే ప్రభావితం చేస్తోందంటే.. తోకే కుక్కను ఊపినట్టు అవుతుంది. ఉన్నతమైన ఆశయాల్ని అందుకునే క్రమంలో ధన సంపాదన తోడై వస్తుందని నమ్మినప్పుడే సక్సెస్‌ చేరువవుతుంది. రంగం ఏదైనా స్థాపించిన అంకురం ప్రజల దైనందిన జీవితంలో భాగం కావాలని నిర్ణయించుకుంటే ఓటమి అంచుల్లోనూ హోప్‌ చెయ్యందిస్తుంది.

సుదీర్గ ప్రయాణానికి భరోసా..

ఐడియా మీ ఒక్కరిదే అయ్యుండొచ్చు. అది కార్యరూపం దాల్చాలంటే మీకో సైన్యం కావాలి. ఆ సైన్యంలో మీరు రాజైతే వారికి సంకల్పబలం ఎంత గొప్పదో చెప్పగలగాలి. మీరిచ్చే జీతం కంటే మీతో కలిసి చేయాలనుకునే సుదీర్ఘ ప్రయాణమే గొప్పదన్న భావన బృందానికి కలగాలి. అలాంటి నమ్మకం కలగాలంటే.. మీరు తోకలా ఊగ[కూడదు. కొండలా బలంగా నిలబడాలి. అప్పుడే.. మీరు చూస్తున్న దృఢమైన ఆశయాల్ని వారికీ కనిపించేలా చేయగలుగుతారు.

- కోటిరెడ్డి సరిపల్లి, కేజీవీ సంస్థ ఛైర్మన్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని