పోరు భూమిలో.. పెళ్లిళ్ల జోరు!

రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య భీకర పోరు సాగుతోంది. ఇది ఎవరికీ నచ్చని విషయం. అందరికీ నచ్చే విషయం ఏంటంటే ఆ కదన రంగంలోనే మనసులు కలిసిన కొన్ని జంటలు మనువాడుతున్నాయి.

Published : 02 Apr 2022 02:16 IST

రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య భీకర పోరు సాగుతోంది. ఇది ఎవరికీ నచ్చని విషయం. అందరికీ నచ్చే విషయం ఏంటంటే ఆ కదన రంగంలోనే మనసులు కలిసిన కొన్ని జంటలు మనువాడుతున్నాయి.

లీసా ఇవశ్చేంకో, వలేరీ ఫిల్మొనోవ్‌లు ఉక్రెయిన్‌లోని కీవ్‌ నగరవాసులు. ఎన్నో ఏళ్లుగా ‘నాకు నువ్వు.. నీకు నేను..’ అని పాడుకుంటున్న ప్రేమికులు. మొన్నటిదాకా అంతా బాగానే ఉంది. ఇంతలో యుద్ధం ముంచుకొచ్చింది. యువత సైన్యంలో చేరాలని అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు కదన రంగంలోకి దిగారు ఈ ప్రేమికులు. పోరు ముగిసేలోగానే తమ బతుకు తెల్లారిపోతుందేమో అనే అనుమానం వచ్చింది. దాంతో యుద్ధక్షేత్రంలోనే వివాహంతో ఒక్కటవ్వాలనుకున్నారు. సైనిక దుస్తులే పెళ్లి వస్త్రాలయ్యాయి. జవాన్లే బంధువులయ్యారు. తుపాకుల మోతలే మేళతాళాలయ్యాయి. నగర మేయర్‌ వితాలీ క్లిట్స్చ్‌కో పెళ్లి పెద్దగా మారారు. అందరి సమక్షంలో ఉంగరాలు మార్చుకొని.. ఒకరి కౌగిళ్లలో మరొకరు ఒదిగిపోయారు. అంతర్జాలంలో అందరి దృష్టిలో పడిపోయారు. ‘పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఈ రణంలో మేం వీరమరణం పొందవచ్చు. ఆ పరిస్థితే వస్తే మేం భార్యాభర్తల్లా చనిపోవాలనుకుంటున్నాం. అందుకే పెళ్లి చేసుకున్నాం’ అన్నారు. ఈ తంతు అంతర్జాలంలో వైరల్‌గా మారింది. అంతకుముందు క్లెవెట్స్‌, నటాలియా వ్లాదిస్లేవ్‌ అనే జంట బాంబ్‌ షెల్టర్‌లో ఒక్కటయ్యారు. యుద్ధం మొదలైన నెలరోజుల్లో ఈ తరహా వివాహాలు ఎనిమిది జరిగాయట. పెళ్లిళ్లు ఎక్కడ, ఎవరితో, ఎలా జరగాలో స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. ఉక్రెయిన్‌ సైనికులకు మాత్రం యుద్ధభూమిలో జరగాలని రాసి పెట్టి ఉందేమో!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని