పెళ్లి కళ వచ్చేసిందా.. బాలా?

ఇంకొద్దిరోజుల్లో శుభ ముహూర్తాలట. ఎక్కడ చూసినా పీపీపీ.. డూడూడూ.. సందళ్లు షురూ! ఆ మాట వినగానే అమ్మాయిల చెక్కిళ్లు ఎరుపెక్కుతాయి. అబ్బాయిలు అంతరిక్షాన్ని అధిరోహించినట్టు ఫీలవుతారు. ఆపై బ్యాచిలర్‌ పార్టీలు.. బారాత్‌ ధూంధాంలు. అబ్బో.. కథ ఘనంగానే ఉంటుంది.

Published : 15 Oct 2022 00:21 IST

ఇంకొద్దిరోజుల్లో శుభ ముహూర్తాలట. ఎక్కడ చూసినా పీపీపీ.. డూడూడూ.. సందళ్లు షురూ! ఆ మాట వినగానే అమ్మాయిల చెక్కిళ్లు ఎరుపెక్కుతాయి. అబ్బాయిలు అంతరిక్షాన్ని అధిరోహించినట్టు ఫీలవుతారు. ఆపై బ్యాచిలర్‌ పార్టీలు.. బారాత్‌ ధూంధాంలు. అబ్బో.. కథ ఘనంగానే ఉంటుంది. హా.. అన్నట్టు ‘పెళ్లంటే పందిళ్లు.. చప్పట్లు.. తాళాలు తలంబ్రాలే కాదు... కుర్రకారు జీవితానికో కొత్త పండగ. ఏడడుగులు వేస్తూ కొత్త దశలోకి ప్రవేశించడానికి ముందే సరదాగా, సీరియస్‌గా ముగించాల్సిన కొన్ని ముచ్చట్లు ఉన్నాయ’ంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.


నచ్చింది చేసేద్దాం

ఉన్నది ఒకటే జిందగీ. ఆ జీవితం జీవించడానికే. పొదుపు ముఖ్యమే గానీ దానికీ అదుపు ఉండాలి. పైసా పైసా దాస్తూ.. సరదాల్ని పక్కన పడేస్తుంటే జీవితం నిస్సారంగా తయారవుతుంది. కుర్రతనం మళ్లీ రాదు గనక.. పెళ్లికి ముందే మనసుకి నచ్చింది చేయాలి. మనం వేరొకరికి సొంతం కాకముందే మనసుకి నచ్చిన సెల్‌ఫోన్‌.. టూవీలర్‌.. గ్యాడ్జెట్‌.. లాంటివి సొంతం చేసుకోవాలి. ఏమో.. పెళ్లయ్యాక మీకంత స్వేచ్ఛ ఉండకపోవచ్చేమో. మీ భాగస్వామి అనుమతి ఇవ్వకపోవచ్చేమో.. ఖర్చులు పెరిగి నచ్చింది కొనలేని పరిస్థితి రావచ్చేమో. ఇక వివాహం అయ్యాక మనకు మిగిలే సమయంలోనూ కోత పడుతుంది. పిల్లలు పుడితే.. సగానికి పడిపోతుంది. సినిమా చూడ్డానికో, స్నేహితుడితో సరదాగా గడపడానికో తీరిక ఉండదు. అందుకే గోవా టూరు.. గిటారు కోర్సు.. చిన్ననాటి స్నేహితులతో సమ్మేళనాలు.. సహోద్యోగులతో మీటప్‌లు.. లాంటి చిన్నచిన్న కోరికలు కూడా తీరలేదని బెంగ పడే పరిస్థితి రాకుండా అన్నీ తీర్చేసుకోవాలి. ఏ చిన్న సంతోషాన్నీ వదులుకోవద్దు.


మనీ మ్యాటర్‌..

ఇది సీరియస్‌ మ్యాటర్‌. పెళ్లయ్యాక ఒక్కరు ఇద్దరవుతారు. ముద్దూమురిపాలతోపాటు ఖర్చులూ రెట్టింపవుతాయి. అందుకే జీవితమనే బండి నడిపించడానికి పక్కా ప్రణాళిక ఉండాలి. మన సంపాదనెంత? ఖర్చెంత? మిగులెంత? ముందే తేలిపోవాలి. రహదారి బాగుంటేనే బండి కుదుపుల్లేకుండా సాఫీగా సాగుతుంది. ఈ ప్రణాళిక ముందుకెళ్లాలంటే ఇద్దరిలో ఒక్కరైనా సంపాదనాపరులై ఉండాలి. ముఖ్యంగా అబ్బాయి. ‘ముందు పెళ్లి.. తర్వాత సంపాదన సంగతి’ అంటే అస్సలు కుదరదు బాస్‌. కన్నకొడుకు బలాదూరు అయినా.. కన్నవాళ్ల ప్రేమకి కొరత ఉండదు. చీవాట్లు పెడుతూనే కడుపు నింపుతారు. చదువులు, సరదాలు, విలాసాలకు బోలెడంత తగలేస్తారు. పెళ్లయ్యాక సైతం వాళ్ల మీదే ఆధారపడటం అస్సలు బాగోదు. మిమ్మల్ని భరించడం కన్నవాళ్లకు భారం కాకపోయినా అర్ధాంగి దగ్గర అంత గౌరవం ఉండదు. భర్త సంపాదనపరుడైతేనే భార్య ముఖంలో వెలుగు. సంసారంలో మెరుపు. అంటే నాలుగు రాళ్లు వెనకేసుకోగలిగే స్థితిలో ఉన్నప్పుడే మూడు ముళ్లు వేయడానికి సిద్ధమవ్వాలన్నమాట.


ముందే సిద్ధమైతే..

పెళ్లయ్యేదాకా అమ్మ చేతి వంట లాగిస్తాం. పెళ్లయ్యాక బెటర్‌హాఫ్‌ మీద ఆధారపడతాం. అంతా బాగానే ఉందిగానీ.. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే? హోటల్‌ భోజనం తినలేను అనుకుంటే? అందుకే అబ్బాయి అప్పుడప్పుడు చేయి కాల్చుకున్నా సరే.. చిన్నచిన్నగా వండటం నేర్చుకోవాలి. నలభీమపాకంలా అద్భుతంగా చేయకపోయినా ఫర్వాలేదు.. తినగలిగేంతలా ఉండాలి. మల్లెపూవులా మెరిసిపోయేలా దుస్తులు ఉతక్కపోయినా.. చిన్నా చితకా పనులు రావాలి. అమ్మాయీ అంతే.. అబ్బాయిపైనే ఆధారపడకుండా సొంత ఖర్చులకు సంపాదించుకోగలిగేంత నైపుణ్యం సాధించాలి. పెళ్లికి ముందే ఈ శిక్షణలో రాటుదేలితే.. ఒకరికొకరు సాయంగానూ ఉండగలుగుతారు. ఆడుతు పాడుతు పని చేసుకుంటుంటే అలుపే కాదు.. జంట మధ్య చెడు మలుపులూ ఉండవు.


పక్కా ప్లానింగ్‌

పెళ్లి సంతోషాలనే కాదు.. కొన్ని చిక్కుల్నీ తీసుకొస్తుంది. కొన్నిసార్లు మనం ఏదో అనుకునేలోపే.. ఏదో జరిగిపోతుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో. కెరియర్‌ విషయంలో ఎన్నో కలలు కనే అబ్బాయిలు, అమ్మాయిలు.. పిల్లలు పుట్టడంతో ఇంట్లోనే కూర్చునే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ విషయంలో పక్కా ప్రణాళిక ఉండాలి. కెరియరా? పిల్లలా? ముందే ఆలోచించుకోవాలి. పిల్లల్ని వాయిదా వేయాలనుకుంటే.. ఎన్నాళ్లు ఆగాలి? ఎలా నియంత్రించాలి.. ఈ విషయంపై పెళ్లి కాబోయే జంట ముందే ముచ్చటించాలి. పనిలో పనిగా ఆఫీసు వేళలేంటి? సరసాలకు వీలు చిక్కే సమయమెంత? బంధువుల ఇళ్లకు వెళ్లే వీలుందా? ఇవన్నీ సీరియస్‌గా చర్చిస్తే.. చిరాకుల చిక్కులు రావు. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అని పాడుకునే బాధ తప్పుతుంది.


అర్థం చేసుకునేలా..

అమ్మాయికి వారానికోసారైనా రెస్టరెంట్‌లో భోంచేయడం ఇష్టం. కుర్రాడేమో అమ్మ చేతి వంటని మించిన కమ్మని రుచే లేదంటాడు. ఆమె మహేశ్‌బాబు ఫ్యాన్‌. ఇతగాడు పవన్‌కల్యాణ్‌ వీరాభిమాని. ప్రతి జంటలో ఇలాంటి భిన్న అభిరుచులు, ఆసక్తులు సహజం. వీటితోపాటు చాలా విషయాల్లో అభిప్రాయ భేదాలుంటాయి. అయితే ఏంటట? ఎదుటివాళ్లను గౌరవిస్తూ.. అభిప్రాయాలకు విలువ ఇస్తే.. వాళ్ల సంసారం స్వర్గమే అవుతుంది. పనిలో పనిగా తమ పొరపాట్లో, అనుకోకుండా చేసిన తప్పులో ముందే చెప్పేసుకుంటే..  అర్ధం చేసుకునే వాళ్లుంటే.. ఆ జంట అర్ధనారీశ్వరతత్వంలో ఉన్నట్టే. అలా సిద్ధమైపోండి మరి.


వయసు ముదిరితే, నా వ్యక్తిగత పరిధుల్లోకి ఎవరూ రావొద్దనే కోరిక ఎక్కువైతే.. చాలామందికి వివాహంపైనే ఆసక్తి తగ్గుతుంది. అందుకే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. సొంత వ్యక్తిత్వం ఉండాలిగానీ నా మాటే నెగ్గాలి అనే పంతానికి పోవద్దు. ఒకరిపై మరొకరు ప్రేమతో ఆధారపడే బంధంలో ఒక రకమైన మాధుర్యం ఉంటుంది. కొత్తవాళ్లు, బంధువులతో కలిసిపోవడం.. పెద్దల్ని గౌరవించడం, కొత్త బాధ్యతలు తలెత్తుకోవడం.. వీటన్నింటికీ సిద్ధమైనప్పుడే పెళ్లి మాటెత్తాలి. ప్రతి కొత్త పాత్రకి కొన్ని బాధ్యతలు, లక్షణాలు ఉంటాయి. వాటిని ఆచరించగలిగినప్పుడే ఆ బంధంలోకి ప్రవేశించాలి. గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారే క్రమంలో ఎంతో బాధ ఓర్చుకుంటుంది. కొత్త పద్ధతులు, అలవాట్లు ఆకళింపు చేసుకోవడంలో కొన్ని కష్టాలు ఎదురైనా ఓపిక పట్టాలి. నిజానికి ఈ కాలం యువత పెళ్లి విషయంలో స్పష్టతతోనే ఉంటున్నారు. అయినా.. ఇంకా ఏవైనా సందేహాలు, భయాలు ఉంటే ఓసారి మ్యారేజీ కౌన్సిలర్లతో చర్చించడం మేలు. వాళ్లు అమ్మాయి, అబ్బాయి మనస్తత్వం అంచనా వేస్తారు. ఒకరితో మరొకరికి పొసగుతుందా? లేదా? విశ్లేషిస్తారు. భిన్న ధ్రువాలు, విభిన్న మనస్తత్వాలు ఉంటే సర్దుకుపోయే మార్గాలు చెబుతారు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ల కథ వేరుగా ఉంటుంది. పెళ్లికి ముందు ఒకరిపై మరొకరు అతి ప్రేమ చూపించుకుంటారు. పెళ్లయ్యాక కెరియర్‌, డబ్బు సంపాదన, లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. భాగస్వామి ఇది అర్థం చేసుకోగలగాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థికంగా స్థిరపడి, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే వివాహ బంధానికి అర్హులు. వాళ్లే ఎలాంటి అవాంతరాలనైనా ఎదుర్కొంటారు. ఇంకోమాట.. పెళ్లయ్యాక బ్రహ్మచారిలా అన్ని పనులూ చేయడం కుదరదు కాబట్టి.. బాధ్యతల్లో బందీ కాకముందే.. జీవితాంతం గుర్తుండే టూర్లు, సరదాల్లాంటి కొన్ని జ్ఞాపకాల్ని మూటకట్టుకోవాలి.                  

- శ్రీపాదరామ్‌, వ్యక్తిత్వ వికాస నిపుణుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని