Published : 05 Nov 2022 01:09 IST

చిల్‌ కావాలంటే.. చితక్కొట్టండి..

ఇష్టపడ్డ లవర్‌ బ్రేకప్‌ చెబితే బాధ, ఆవేశం. చేయని తప్పునకు బాస్‌ చీవాట్లు పెడితే ఆక్రోశం. రోడ్డు మీద ఎక్కడైనా గొడవ జరిగితే పట్టలేనంత ఉద్రేకం. యూత్‌కి ఇలాంటివి మామూలే! కానీ ఆ క్షణం విచక్షణ కోల్పోతే జరిగే నష్టం ఊహించనంత. అలాగని అతిగా కోపం వచ్చినా.. దాన్ని అణచుకోవాలని ప్రయత్నించినా మానసిక రోగాల బారిన పడతాం. మరేం చేయాలి? అంటే ఆ కక్షనంతా తీర్చుకునేలా పాత సామాన్లని పగల గొట్టాలి. చితక్కొడుతూ చిల్‌ అయిపోవాలి అంటున్నాడు హైదరాబాదీ పూసర్ల సూరజ్‌. దానికోసం ‘రేజ్‌ రూం’ పేరుతో ఒక అడ్డాని ఏర్పాటు చేశాడు.

న కోపమే మన శత్రువు అని అందరికీ తెలుసు. అయినా కోపంలో కనిపించిన వస్తువునల్లా విసిరేసి బద్దలు కొడతాం. దీంతో చాలా నష్టం. అందుకే మా దగ్గరికి వస్తే ఆ కోపం తగ్గి, మనసుకి ఉత్సాహం కలిగే మంత్రం వేస్తానంటున్నాడు సూరజ్‌. తన రేజ్‌ రూంకి వెళితే సెల్‌ఫోన్లు, టీవీలు, ఫోన్లు, టేబుళ్లు, ఖాళీ సీసాలు, ల్యాప్‌టాప్‌, రిఫ్రిజిరేటర్లు, అద్దాలు.. ఏదైనా పగలగొట్టొచ్చు. ఇవికాకుండా కోరిన వస్తువునల్లా సిద్ధం చేస్తారు. ఎలాంటి గాయాలు కాకుండా చేతికి గ్లౌజులు, కాళ్లకు బూట్లు, తలకి హెల్మెట్‌ ఇస్తారు. ఆఖరున చేతిలో బేస్‌బాల్‌ బ్యాట్‌ లేదా పెద్ద సుత్తి పెట్టి ‘గో ఎహెడ్‌’ అంటారు. ఎదురుగా సామాన్లు.. అవసరమైతే వాటిలోనే మనకి నచ్చనివాళ్ల ముఖాల్ని ఊహించుకుంటూ కసిదీరా కుమ్మేయొచ్చు. అయితే ఈ సెటప్‌ సిద్ధం చేసినందుకు కొంత ఛార్జ్‌ చేస్తారు. ఇష్టమైన పని చేయడం వల్ల మనలోని అడ్రినల్‌ గ్రంథి నుంచి స్రావాలు అధికమై మనసుకి చెప్పలేనంత హాయిగా ఉంటుందట. ఒక్కసారి వస్తువులను బద్దలు కొట్టిన తర్వాత ఆటోమేటిగ్గా కోపం తగ్గిపోయి ఇంకోసారి దేన్నీ పగల గొట్టాలనే ఆలోచనే రాదు’ అంటూ దీని వెనకాల ఉన్న సైన్సూ, సైకాలజీని వివరిస్తాడు సూరజ్‌.

చిన్నప్పుడు సూరజ్‌ అల్లరి పిల్లోడు. కోపంతో చేతికందిన వస్తువునల్లా బద్దలు కొట్టేవాడు. ఇంట్లోవాళ్లు బడితె పూజ చేసేవారు. పెద్దయ్యాక ఈ సంగతి తరచూ గుర్తొచ్చేది. ఈ అలవాటుతోనే సరికొత్త వ్యాపారం ఎందుకు చేయకూడదు అని భావించాడు. అంతర్జాలంలో వెతికితే ఇలాంటివి అక్కడక్కడా మాత్రమే కనిపించాయి. సరదాగా ఉంటూ జనానికి కాస్త ఉపయోగపడే ఈ ప్రక్రియనే వ్యాపారంగా మలిచాడు. అతడి లెక్క తప్పలేదు. చితక్కొడుతూ చిల్‌ అయ్యే ఈ ఫీలింగ్‌ కోసం అమ్మాయిలు, అబ్బాయిలు పోటెత్తుతున్నారంటున్నాడు సూరజ్‌. 

- దండవేణి సతీష్‌, ఈటీవీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు