Updated : 07 Jan 2023 02:11 IST

కష్టాలు గెలిచిన క్యాలెండర్‌!

కొత్త సంవత్సరం వస్తుందంటే.. ప్రపంచవ్యాప్తంగా ‘ప్రత్యేక’ క్యాలెండర్‌లు తెచ్చే సంస్థలు ఎన్నో ఉంటాయి. కింగ్‌ఫిషర్‌ తయారు చేసే అందాల మోడళ్ల క్యాలెండర్‌లు ఒకప్పుడు సంచలనం. రోల్స్‌రాయిస్‌, లాంబొర్ఘిని విడుదలచేసే కారు క్యాలెండర్‌లకి ఇప్పటికీ ఫిదా అయ్యేవాళ్లు ఎంతోమంది. కానీ వీటన్నింటికీ భిన్నంగా నిలుస్తోంది ‘స్ఫూర్తి’ క్యాలెండర్‌. వైకల్యాన్ని జయించి తమ రంగంలో విజయ సాధకులుగా మారిన వాళ్లకి పట్టం గట్టే కాలమానిని ఇది. ‘ఐ యామ్‌ స్పెషల్‌’ పేరుతో వస్తున్న ఈ డెస్క్‌టాప్‌ క్యాలెండర్‌లని కోయంబత్తూరుకు చెందిన ‘స్వర్గ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛందసంస్థ ప్రచురిస్తోంది. భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ తదితర దేశాలకి చెందిన కార్పొరేట్‌ సంస్థలు వీటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. ఈ సంస్థ వ్యవస్థాపకురాలు తెలుగమ్మాయి జె.స్వర్ణలత. మల్టిపుల్‌ స్క్లిరోసిస్‌ వ్యాధి బాధితురాలామె. చక్రాల కుర్చీలకే పరిమితమైన తనలాంటి వాళ్లకు, వృద్ధులకూ ఉపయోగపడేలా.. మొదట్లో ఆటోమేటిక్‌ ఛైర్‌లతో ఉన్న ప్రత్యేక ట్యాక్సీలని నడిపేదామె.  ఈ సేవకి విరాళాలు సేకరించడానికే 2015లో తొలిసారి ఈ స్ఫూర్తి క్యాలెండర్‌లని ప్రచురించారు. మంచి ఆదరణ దక్కడంతో ఏటా ఈ ఆవిష్కరణని ఓ పండగలా నిర్వహించి విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది 11మంది దివ్యాంగ క్రీడాకారుల ఫొటోలతో తీసుకొచ్చారు. క్రీడాకారిణిగా మనదేశానికి తొలి పారాలింపిక్‌ పతకాన్ని తెచ్చిన దీపా మాలిక్‌, ఇతర విజేతలు తంగవేలు, షూటర్‌ సుమేధా పాఠక్‌, టెన్నిస్‌ ఆటగాడు కార్తిక్‌ కరుణాకరన్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మనోజ్‌ సర్కార్‌ తదితరుల ఫొటోలు ఇందులో ముద్రించారు. 12వ వ్యక్తిగా స్వర్ణలతే కనిపిస్తారు. ఈసారి ఈ స్ఫూర్తి క్యాలెండర్‌ని ‘ఇన్‌విన్సిబుల్స్‌’ అన్న థీమ్‌తో తెచ్చారు. దానర్థం... కష్టాల్ని గెలిచి వచ్చినవాళ్లు అని.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు