ఆటా.. పాటా అదుర్స్..
ఈమధ్యే ఐపీఎల్ వేడుక ముగిసింది. ఆ కార్యక్రమంలో సూపర్ మోడల్‌లా ఉన్న ఓ మగువ పాటతో మైమరిపిస్తూ.. స్టెప్పులతో కుర్రకారును మత్తెక్కించింది
ఈమధ్యే ఐపీఎల్ వేడుక ముగిసింది. ఆ కార్యక్రమంలో సూపర్ మోడల్‌లా ఉన్న ఓ మగువ పాటతో మైమరిపిస్తూ.. స్టెప్పులతో కుర్రకారును మత్తెక్కించింది. ఆ భామ ఆటపాటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోని లక్షా ఇరవై వేలమంది ప్రేక్షకులు మంత్రమేసినట్టు ఊగిపోయారు. తనే జోనితా గాంధీ.
తెర వెనక సినిమా పాటతో.. వేదికపై అచ్చెరువొందే ప్రదర్శనతో హోరెత్తించడం జోనితాకు అలవాటే! పానీ ద రంగ్ (విక్కీ డోనర్), అరబిక్ కుత్తు (బీస్ట్) మెంటల్ మనదిల్ (ఓ కాదల్ కన్మణి), చెల్లామా (డాక్టర్), జిమ్మిక్కి పొన్ను (వారిసు).. ఈ సూపర్‌హిట్ పాటలన్నీ తన గళం నుంచి జాలువారినవే.
నేపథ్యం: జోనితాది దిల్లీలో స్థిరపడ్డ పంజాబీ కుటుంబం. తను తొమ్మిది నెలల వయసున్నప్పుడే అమ్మానాన్నలు కెనడా వెళ్లి స్థిరపడ్డారు. వాళ్లకి సంగీతం అంటే ప్రాణం కావడంతో కూతురితో సరిగమల సాధన చేయించారు. అలా నాలుగేళ్ల వయసప్పుడే మైక్ పట్టి పాడసాగింది. పన్నెండేళ్లు వచ్చేసరికి తొలిసారి స్టేజీ ఎక్కింది. పదహారేళ్లపుడు ‘కెనడా ఇండియన్ ఐడల్’ పోటీల్లో పాల్గొంది. అక్కడ ఓ న్యాయనిర్ణేత జోనితా గురించి చులకనగా మాట్లాడారట. బాగా నొచ్చుకున్న తను ఎప్పటికైనా గొప్ప సింగర్‌గా పేరు తెచ్చుకోవాలనే కసి పెంచుకుంది.
యూట్యూబ్ స్టార్: అప్పటికే తనకంటూ ఓ గుర్తింపు రావడంతో సొంతంగా పాటలు పాడి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేది. కొందరితో కలిసి ఒక బృందంగా ఏర్పడి కెనడాలోని పట్టణాల్లో ప్రదర్శనలు ఇచ్చేది. తర్వాత బాలీవుడ్ గీతాల్ని సైతం తనకిష్టమైన పాటల జాబితాలో చేర్చుకుంది. రోజూ వాటిని సాధన చేసేది.
ముంబయి పయనం: కొద్దికొద్దిగా పేరొస్తున్నా తను కోరుకుంది మాత్రం స్టార్ ఇమేజీనే. దానికోసం భారతీయ సినీ పరిశ్రమే సరైన వేదిక అని భావించింది. 2011లో ఒంటరిగానే ముంబయిలో దిగింది. మోడలింగ్, స్టేజీ షోలు, ప్రైవేట్ ఆల్బమ్స్.. చేస్తూ త్వరగానే బాలీవుడ్ జనాల దృష్టిలో పడింది. స్నేహితుడు అభిషేక్ ఘటక్ సాయంతో సంగీత దర్శకుడు విశాల్ దడ్లానీని కలిసింది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో టైటిల్ ట్రాక్ పాడే అవకాశం దక్కించుకుంది. అప్పట్నుంచి జోనితా విజయ యాత్ర మొదలైంది.
తమిళంలో హవా: హిందీలోనే బోణీ కొట్టినా.. జోనితాకి బాగా పేరు తెచ్చింది తమిళ చిత్రసీమనే. తను ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారథ్యంలో అత్యధికంగా పాడింది. అనిరుధ్ రవిచందర్‌కైతే ఆస్థాన గాయని. తెలుగులోనూ ఏవోఏవో కలలు (లవ్‌స్టోరీ), నువ్వేనువ్వే (కిక్2), మ మ మహేశా (సర్కారువారి పాట), హలమితీ హబీబో (బీస్ట్)లాంటి పాటల్లో మెరిసింది. ఇంగ్లిష్, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, కన్నడ సినిమాల్లోనూ గళం వినిపిస్తోంది.
సెంటిమెంట్: చూడటానికి అల్ట్రా మోడ్రన్ అమ్మాయిలా ఉన్నా.. జోనితాకి సెంటిమెంట్ ఎక్కువే. నమస్కారం చేశాకే.. వేదిక ఎక్కుతుంది. ప్రతి షోకి ముందు దేవుడిని ప్రార్థిస్తుంది. ప్రదర్శనకు ముందు పొగలు కక్కే కాఫీ తాగడం అలవాటు. ఇప్పుడు స్టేజీ మీద స్టెప్పులేస్తూ కుర్రకారుని సీట్లలో కూర్చోనివ్వకుండా చేస్తుందిగానీ.. చిన్నప్పుడు తను బాగా సిగ్గరి. సాధనతోనే స్టేజీ భయం పోగొట్టుకుందట.
బహుముఖ ప్రతిభ: జోనితా కేవలం గాయకురాలే కాదు.. చక్కగా పాటలు రాస్తుంది. గిటార్ వాయించడంలో దిట్ట. పలు షోలకు వ్యాఖ్యాత. స్టెప్పులేయడంలో ప్రొఫెషనల్ డ్యాన్సర్లు సైతం తనముందు దిగదుడుపే. ప్రైవేట్ ఆల్బమ్స్ పాడింది. తాజాగా ర్యాపర్ డివైన్‌తో కలిసి ‘సితారా’ అనే ఆల్బమ్ విడుదల చేసింది. కథానాయికలా.. ఎనిమిది ప్రముఖ మ్యాగజైన్ల కవర్‌పేజీలపై మెరిసింది. ఇన్‌స్టాలో తనని యాభై లక్షల మంది ఫాలో అవుతున్నారు. తన యూట్యూబ్ ఛానెల్‌కి 12 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vivek Ramaswamy: వివేక్ రామస్వామితో డిన్నర్ ఆఫర్.. ఒక్కొక్కరికి 50 వేల డాలర్లపైమాటే!
-
ముందు ఈ మూడు పనులు చేయండి.. పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
-
Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్ ఖాన్
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు