ఎమోజీ డ్యాన్స్‌.. అదిరింది గురూజీ!

ఈమధ్య మిల్కీ సుందరి అదితిరావు హైదరీ.. సన్నిహితుడు దివ్యక్‌ డిసౌజాతో కలిసి ఓ ఫన్నీ డ్యాన్స్‌ చేసి ఇన్‌స్టాలో పంచుకుంది. హీరో సిద్ధార్థ్‌ దానికి తెగ ఇంప్రెస్‌ అయిపోయాడు.

Published : 17 Jun 2023 00:09 IST

ఈమధ్య మిల్కీ సుందరి అదితిరావు హైదరీ.. సన్నిహితుడు దివ్యక్‌ డిసౌజాతో కలిసి ఓ ఫన్నీ డ్యాన్స్‌ చేసి ఇన్‌స్టాలో పంచుకుంది. హీరో సిద్ధార్థ్‌ దానికి తెగ ఇంప్రెస్‌ అయిపోయాడు. ‘ప్రొఫెషనల్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా ఉంది మీ నృత్యం. ఓ షో కోసం మిమ్మల్ని బుక్‌ చేసుకోవచ్చా?’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. అదితి మంచి డ్యాన్సర్‌ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియోలో తను కాలు కదపకుండా అక్కడే ఉండీ.. నడుమును అటూఇటూ ఊపింది. చేతులతో ప్రేమ సంజ్ఞలు చేసింది. పెదాల్ని ముడిచింది. సరదాగా నాలుకను బయటకి చాచింది. ముఖకవళికలతో భావోద్వేగాలు పలికించింది. ‘అర్రె.. ఈ డ్యాన్స్‌ భలే ఉందిగా’ అని చాలామంది మెచ్చుకున్నారు. ఇంతకీ ఇదేంటంటే.. ‘ఎమోజీ డ్యాన్స్‌’ అన్నది సమాధానం. అదితినే కాదు.. ఈమధ్యకాలంలో సినీతారలు తెగ ఆదరిస్తున్న ట్రెండ్‌ ఇది. బాలీవుడ్‌ సీనియర్‌ నటి బిపాషా బసు సైతం.. తన కూతురిని ఒళ్లో పెట్టుకొని ఈ డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఈ వివరాలన్నీ చెప్పాక దీని కథేంటో ఈపాటికి చాలామందికి అర్థమయ్యే ఉంటుంది! మనం స్నేహితులతో తరచూ చేసే చాటింగ్‌ ఎమోజీలలో ఎరుపురంగు గౌను వేసుకున్న ఓ అమ్మాయి కనిపిస్తుంటుంది కదా.. అదే ఇది. జాగ్రత్తగా గమనిస్తే.. ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా ఒక్కో సామాజిక మాధ్యమ వేదికలో ఒక్కోరకంగా ఉంటుందీ ఎమోజీ. దాంతోపాటు.. ఫోన్‌ బ్రాండ్‌ మారినకొద్దీ వీటి రూపం మారుతూనే ఉంటుంది. నృత్యం కోసమని ప్రత్యేకంగా కొత్త స్టెప్పులేమీ వేయకుండా.. ఎమోజీలకు కాస్త అటుఇటుగా అనుకరించడమే ఈ ఎమోజీ డ్యాన్స్‌ ప్రత్యేకత. ప్రైవేటు పార్టీ ఫంక్షన్లలో, కాలేజీ ఉత్సవాల్లో కుర్రకారు దీన్ని తెగ ఆదరిస్తున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీలు, యువత తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో ఈ డ్యాన్స్‌ని పోటెత్తిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని