సుహానా.. సంగతుల ఖజానా

‘బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ గారాలపట్టి’.. 23 ఏళ్లు దాటినా ఈ ట్యాగ్‌తోనే ఉండటం నచ్చలేదేమో! తెరంగేట్రం చేసి తానేంటో నిరూపించుకుంటానంటోంది సుహానా ఖాన్‌. ఈ నేపథ్యంలో తన సంగతులు సంక్షిప్తంగా..

Published : 01 Jul 2023 00:18 IST

‘బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ గారాలపట్టి’.. 23 ఏళ్లు దాటినా ఈ ట్యాగ్‌తోనే ఉండటం నచ్చలేదేమో! తెరంగేట్రం చేసి తానేంటో నిరూపించుకుంటానంటోంది సుహానా ఖాన్‌. ఈ నేపథ్యంలో తన సంగతులు సంక్షిప్తంగా..
చదువు: ముంబయిలోనే పుట్టిపెరిగింది. ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుకుంది. బ్రిటన్‌లో డిగ్రీ, లండన్‌లోని ఆర్డింగ్లీ కళాశాలలలో ఫిల్మ్‌ కోర్సులు, న్యూయార్క్‌ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసింది.
స్నేహం: స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అనుకునే రకం అమ్మాయి. అనన్యపాండే, షనాయా కపూర్‌, ఆర్హన్‌ అవత్రమణిలు.. చిన్నప్పట్నుంచీ ఫ్రెండ్స్‌. ఇప్పటికీ వాళ్లే బీఎఫ్‌ఎఫ్‌లు. ఆ విషయం చాలా సందర్భాల్లో ఫొటోల రూపంలో చెబుతూనే ఉంది.
ఫ్యాషన్‌, సోషల్‌మీడియా: కొత్త ఫ్యాషన్లు అనుకరించడంలో ముందుండే అమ్మాయి సుహానా. మనీశ్‌ మల్హోత్రా, ప్రభుల్‌ గురుంగ్‌లాంటి ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన దుస్తులు ధరిస్తుంటుంది. వేడుకలు, పండగల్లో సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తుంది. సామాజిక మాధ్యమాల్లో తనని నలభై లక్షల మంది అనుసరిస్తున్నారు.
నాన్నకూచి: చిన్నప్పటి నుంచీ నాన్నకూచి. షారుక్‌ చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయం చెప్పాడు. కూతురు కోరుకున్న కారైనా.. అడిగిన మరే వస్తువైనా వెంటనే ఇవ్వాల్సిందే. వాళ్ల విలాసవంతమైన బంగ్లా ‘మన్నత్‌’లో సుహానా కోసం స్టార్‌ హోటల్‌లోని ఓ సూట్‌లాంటి గది ఏర్పాటు చేశాడు. తండ్రీకూతుళ్లు ఇద్దరికీ కాఫీ అన్నా, కొత్త ప్రదేశాలు సందర్శించడం అన్నా ఇష్టం.

ఆటలు: సుహానాకి ఆటలంటే పిచ్చి ప్రేమ. ముఖ్యంగా ఫుట్‌బాల్‌కి పెద్ద ఫ్యాన్‌. స్కూల్‌, కాలేజీ రోజుల్లో తన జట్లకి కెప్టెన్‌. సొంత ఐపీఎల్‌ క్రికెట్‌ జట్టు.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ల్ని తప్పకుండా చూస్తుంది.
రచయిత్రి: సుహానా మంచి చదువరి కూడా. చిన్నప్పుడు కామిక్‌, అడ్వెంచర్‌ పుస్తకాలు.. ఇప్పుడు ఫిక్షన్‌ నవలలు తెగ చదువుతోంది. స్కూల్‌ రోజుల్లోనే కొన్ని కథలు రాసి ‘కథా నేషనల్‌ స్టోరీ రైటింగ్‌ కాంపిటీషన్‌’లో బహుమతి గెలుచుకుంది. అప్పుడప్పుడూ కవితలూ రాస్తుంటుంది. వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంది.
తెరంగేట్రం: ఈ ఏడాదే ‘ది అర్చీస్‌’ అనే వెబ్‌సిరీస్‌తో తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం నాన్న షారుక్‌తో కలిసి ఓ ఫీచర్‌ ఫిల్మ్‌ చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని