పని భయం.. పారదోలేలా..

ఆఫీసుకెళ్లాలంటే గుండెల్లో దడ. బాస్‌ ఏమంటారో అని భయం. ఎక్కడ లోపాలు బయటపడతాయో అని అభద్రతాభావం. ఏంటిది? ‘వర్క్‌ ప్లేస్‌ యాంగ్జైటీ’. యువ ఉద్యోగుల్లో 32శాతం ఇదే బాపతు అంటున్నాయి అధ్యయనాలు.

Published : 16 Sep 2023 00:50 IST

ఫీసుకెళ్లాలంటే గుండెల్లో దడ. బాస్‌ ఏమంటారో అని భయం. ఎక్కడ లోపాలు బయటపడతాయో అని అభద్రతాభావం. ఏంటిది? ‘వర్క్‌ ప్లేస్‌ యాంగ్జైటీ’. యువ ఉద్యోగుల్లో 32శాతం ఇదే బాపతు అంటున్నాయి అధ్యయనాలు. దీంతో దీర్ఘకాలంలో ఉద్యోగులు మానసిక రుగ్మతల పాలవుతున్నారట. మరి బయటపడేదెలా?

సంస్థ ఏదైనా, పని ఎలాంటిదైనా.. యజమానులు ఖాళీగా కూర్చోబెట్టి అయితే జీతాలివ్వరు. కొన్ని చోట్ల ఒత్తిళ్లుంటాయి. లక్ష్యాలు చేరాలనే నిబంధనలుంటాయి. సహోద్యోగుల రాజకీయాలు.. బాస్‌లు పెట్టే ఒత్తిళ్లు.. వెరసి.. కొందరు వర్క్‌ప్లేస్‌ యాంగ్జైటీకి గురవుతుంటారు. ఒక్కసారి దీని ప్రభావానికి లోనైతే, తమకు పని చేయగలిగే సత్తా ఉన్నా.. అంచనాలను అందుకోలే రంటున్నారు మానసిక నిపుణులు. ‘ఈ ఆందోళనతో ఉన్నవాళ్లు చిన్న పొరపాటు జరిగినా.. పైవాళ్లు మందలిస్తారనే భయం, సరిగా పని చేయలేకపోతున్నాననే అపరాధ భావం.. ఇలాంటి వాటితో మానసికంగా సతమతమవుతుంటారు. ఆఫీసు అంటేనే హడలిపోయే భావనకు లోనవుతారు’ అంటారు నోయిడా సైకియాట్రిస్ట్‌ అపరంజిత.

ప్రభావమెంత?

  • ఆత్మవిశ్వాసం లోపించినవారు, అదేపనిగా ఆలోచించేవారు తమలోని లోపాలు, చేసిన తప్పులను పదేపదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. దీంతో అటు పనీ చేయ లేకపోతారు.. ఇటు ఒత్తిడీ తప్పించుకోలేరు.
  • ఆందోళన, ఒత్తిడి.. శారీరక ఇబ్బందులకూ గురి చేస్తాయి. తలనొప్పి, చెమట్లు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, నిద్రలేమి, కండరాలు పట్టేయడం, జీర్ణకోశ ఇబ్బందులు తలెత్తుతాయి.
  • వర్క్‌ప్లేస్‌ యాంగ్జైటీ వల్ల.. ఏకాగ్రత కోల్పోతారు. పనిపై ధ్యాస పెట్టలేరు. ఎప్పుడూ ఏదో పరధ్యానంలో ఉంటారు. చేసే పనులు మర్చిపోతారు. చిన్నచిన్న పనులనూ పెద్ద భారంగా భావిస్తుంటారు.
  • పనిపై స్పష్టత లేకపోవడం, పొరపాటు జరిగితే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో పనిని వాయిదా వేయడం అల వాటుగా మార్చుకుంటారు.
  • లోపాలు బయట పడతాయి అనే భయంతో సహోద్యోగులతో కలవడానికీ భయపడుతుంటారు. నలుగురిలో కలవకుండా బలవంతంగా ఒంటరి అయిపోతుంటారు.

బయట పడేదెలా?

  • ఈ ఆందోళనకు ముఖ్య కారణం.. సకాలంలో పని పూర్తి చేయలేకపోవడం. దీనికి విరుగుడు సమయ ప్రణాళిక. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవడం, అనవసర విషయాల్లో తలదూర్చకపోవడం, అవసరమైతే ఒకట్రెండు గంటలు ఎక్కువసేపు పని చేయడం.. ఇది సమస్యకు ఒకరకమైన పరిష్కారం.
  • అందరూ, అన్ని విషయాల్లో సమర్థులేం కాదు. మనకు అన్నీ తెలియాలనేం లేదు. తెలియని వాటికి సహోద్యోగుల సాయం తీసుకోవడం.. బాస్‌ని మరింత సమయం అడగడం.. తప్పేం కాదు.
  • కొండలా పేరుకుపోయిన పని చూస్తే ఎవరికైనా భయమే. అలాంటప్పుడు దాన్ని చిన్నచిన్న లక్ష్యాలుగా విభజించుకోవచ్చు. ఫలానా సమయానికి ఫలానా పని చేయాలి.. వారంలో ఇది పూర్తి చేయాలి.. ఇలా ఒక ప్రణాళిక ఏర్పరచుకుంటే.. పని తేలికవుతుంది.
  • ఒత్తిడిని లోలోపలే భరిస్తుంటే.. అది తీవ్ర మానసిక సమస్యగా మారుతుంది. ఇతరులతో పంచుకుంటే మనకు తెలియని ఎన్నో పరిష్కార మార్గాలు చూపిస్తారు. అవసరమైతే మానసిక నిపుణుల సాయం తీసుకున్నా ఫర్వాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని