రండి.. ఓటేద్దాం!

ఓటు.. వజ్రాయుధం... ఓటు.. సామాన్యుల తలరాత మార్చే మార్గం! ఈ నిజం ఎంత అరిచి చెప్పినా యువత మెదళ్లలోకి ఎక్కడం లేదు.. ఓటింగ్‌ శాతం పెరగడం లేదు.

Updated : 18 Nov 2023 03:37 IST

శ్రద్ధా శుక్లా

ఓటు.. వజ్రాయుధం... ఓటు.. సామాన్యుల తలరాత మార్చే మార్గం! ఈ నిజం ఎంత అరిచి చెప్పినా యువత మెదళ్లలోకి ఎక్కడం లేదు.. ఓటింగ్‌ శాతం పెరగడం లేదు. అందుకే వాళ్లకు నచ్చే బాటలో వెళ్తూ ఓటింగ్‌పై చైతన్యం తీసుకొస్తున్నారు కొందరు యువ ఐఏఎస్‌లు. ఓవైపు తీరిక లేకుండా విధులు నిర్వరిస్తూనే ఈ ప్రయత్నాలూ కొనసాగిస్తున్నారు.

బీటెక్‌ కుర్రాడికి ఓటు వేయాలని సాధారణంగా చెబితే చెవికెక్కుతుందా? కాసేపు డ్యాన్సులు ఆటపాటలతో సందడి చేయించి, మన పాలకుల్ని మనం కాకపోతే ఎవరు ఎన్నుకుంటారంటే.. విషయం అప్పుడు అర్థమవుతుంది. డిగ్రీ చదివే ఓ అమ్మాయితో ప్రజాస్వామ్యానికి ఓటు ప్రాణం లాంటిదని ఉపన్యాసం దంచితే బుర్రకెక్కుతుందా? సరదాగా ఓ రంగోలీ పోటీ పెట్టి ముగ్గులోకి దింపితే నేనూ వేలికి సిరా చుక్క అంటించుకుంటానంటూ ముందుకొస్తుంది. మేధావులు, ఎన్నికల సంఘం సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘స్వీప్‌’ (సిస్టమేటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌) కార్యక్రమాలను వైవిధ్యంగా నిర్వహిస్తున్నారు. పనిలో పనిగా రక్తదాన శిబిరాలూ నిర్వహిస్తున్నారు.  

సిక్తా పట్నాయక్‌

* హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్‌, ప్రావీణ్య సెప్టెంబరు నుంచే ఓటరు చైతన్య కార్యక్రమాలు వినూత్నంగా చేపట్టారు. ‘ఐ ఓట్ ఫర్‌ ష్యూర్‌’ అనే నినాదంతో కళాశాల విద్యార్థులు, నగరవాసులతో ‘5 కె రన్‌’ నిర్వహించారు. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఓటరు నమోదు పెంచేందుకు ‘క్యాంపస్‌ అంబాసిడర్‌’ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఒక విద్యార్థి నేతృత్వం వహించి, తోటివాళ్లకు ఓటు ప్రాధాన్యత తెలియజేయడం దీని ఉద్దేశం. ఈ ప్రచారాన్ని వరంగల్‌ పాలనాధికారి ప్రావీణ్య ప్రత్యేక చొరవ తీసుకొని నిర్వహించారు. ఫలితంగా ఇటీవల సప్లిమెంటరీ ఓటరు జాబితాలో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో దాదాపు 20 వేల మంది కొత్త యువ ఓటర్లు నమోదయ్యారు.

* 2021 బ్యాచ్‌ శిక్షణ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా ఓటరు చైతన్య ర్యాలీల్లో స్వయంగా పాల్గొంటున్నారు. కలెక్టరేట్లోని మహిళా సిబ్బందితో కలిసి ‘నేను ఓటరుగా నమోదయ్యాను.. మరి మీరు’ అనే నినాదంతో ప్లకార్డులు పట్టుకొని నగరంలో ప్రదర్శనలు ఇచ్చారు. కళాశాలల్లోని యువతను ఆకట్టుకునేందుకు ఓటు చైతన్యంపై చిన్న చిన్న పాటలతో సామాజిక మాధ్యమాల్లో ఆమె దూసుకుపోతున్నారు. ఓటరుగా నమోదైన యువతతో ‘స్వీప్‌’ క్రికెట్ కప్‌ పోటీలు నిర్వహించేందుకు శ్రద్ధా వినూత్న ఆలోచనలతో కృషి చేస్తున్నారు.
* నిర్మల్‌ కలెక్టర్‌ అశిష్‌ సాంగ్వాన్‌ డిగ్రీ కళాశాలలకు వెళ్లి ఓటు ప్రయోజనాలను విద్యార్థులకు చెప్పడమే కాకుండా.. యువత గ్రామాల్లోకి వెళ్లి ఓటు ప్రాధాన్యతను వివరించేలా పలు కార్యక్రమాలు చేపట్టారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని