వీడలేక.. వీడిపోయా

తనకి చాలాసార్లు చెప్పాను. ‘నిన్ను ప్రాణంలా ప్రేమిస్తున్నాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నన్ను వదిలి వెళ్లొద్దు’ అని. ‘పిచ్చోడా.

Published : 03 Apr 2021 01:01 IST

తనకి చాలాసార్లు చెప్పాను. ‘నిన్ను ప్రాణంలా ప్రేమిస్తున్నాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నన్ను వదిలి వెళ్లొద్దు’ అని. ‘పిచ్చోడా.. నువ్వంటే ప్రాణంరా నాకు. నిన్నెలా వదిలేస్తాను. నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వే నా తోడు. నిన్ను వదలడం అంటే నా ఊపిరి వదలడమే’ అంటూ గుండెలకు హత్తుకుని బదులిచ్చేది. బీటెక్‌లో పరిచయం తను. అందాలరాశి. మొదటి సంవత్సరంలోనే ప్రేమలో పడిపోయాం. క్యాంటీన్‌లో ముచ్చట్లు, క్లాస్‌రూం అల్లర్లు, ఎక్కడ చూసినా మా జంటే. చివరి ఏడాది వచ్చేసరికి ఉత్తమ జంట అన్నంతగా మా ప్రేమ వెలిగిపోయింది. తను చదువుల్లో తగ్గేది కాదు. అనుకున్నట్టే  బీటెక్‌ అవ్వగానే ఎమ్మెన్సీలో జాబ్‌ కొట్టింది. నేను మాత్రం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అక్కడే ఆగిపోయాను. అక్కడే మిగిలిపోయాను. తాను చూస్తుండగానే ఎదిగిపోయింది. వారాంతాల్లో కలుసుకునేవాళ్లం. నాకు మాత్రం ఇంకా సెటిల్‌ కాలేదనే బాధ వెంటాడేది. రెండు, మూడు మార్కులతో ఉద్యోగం దక్కకుండా పోయేది. పుస్తకాలు, కోచింగ్‌ సెంటర్లు, క్లాస్‌లు అయిదేళ్లుగా వీటితోనే సహజీవనం. ఉద్యోగం మాత్రం రాలేదు. ఐదేళ్లలో తన జీతం ఆరు అంకెలకు చేరింది. నేను జీరో దగ్గరే ఆగిపోయాను. అయినా నాపై తన ప్రేమ అణువంతైనా తగ్గలేదు. ఇంకెన్నాళ్లిలా ఉందాం అందోరోజు. నా గొంతు పెగల్లేదు. ‘ఇంట్లో సంబంధాలు చూస్తున్నార్రా’ అంది. ఏం చెప్పాలో తోచలేదు. పెళ్లి చేసుకుందాం అంది. ఇప్పుడు కుదరదు అని చెప్పా. ఉద్యోగం లేకుండా చేసుకోనన్నాను. కొన్నాళ్లాగింది. ‘పెళ్లి పెళ్లి అని ఇంట్లో ఒకటే గొడవ. నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది’ అని ఏడ్చింది. బతిమాలింది. నేను వినలేదు. నాకు ధైర్యం చాల్లేదు. ‘ఉద్యోగం లేకుండా బతుకీడ్చలేను. ఏ పనీ చేయకుండా పెళ్లాం చాటు భర్తలా సమాజంలో ముద్ర వేసుకోవడం ఇష్టంలేదు’ నా నిర్ణయం చెప్పా. ఆమె ఎంతగా అడిగినా బండరాయి లాంటి నా గుండె కరగలేదు. చివరకు ప్రాణంలా ప్రేమించిన తననే ‘నన్ను మర్చిపో’ అన్నాను. లాగిపెట్టి కొట్టింది. కోపంతో కళ్ల నిండా నీళ్లతో వెళ్లింది. తిరిగి రాలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేయొద్దని చెప్పిన నేనే.. కారణం లేకుండా వదిలించుకున్నాను. ఆ తర్వాత నన్ను నేను ఎన్నిసార్లు తిట్టుకున్నానో. తిరిగి రాదనే చేదు నిజం మనసును బాధపెట్టినా, ఒక్కసారైనా వస్తే బాగుండన్న ఆశ. కానీ బంగారాన్ని సంద్రంలోకి విసిరేసి తీరంలో కూర్చొని ఏడిస్తే ఏం లాభం?

- సతీశ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని