Balaji: ఎముకలు విరిగినా.. రైడింగ్‌ ఆపలేదు!

బాలాజీది బెంగళూరు. చిన్నప్పట్నుంచే గుర్రాలంటే మక్కువ. అవి ఎక్కడ కనిపించినా.. ఆగిపోయి వాటి నడకలు, పరుగులకు మురిసిపోయేవాడు.

Updated : 06 May 2023 12:52 IST

గుర్రంపై నుంచి పడ్డాడు.. పట్టించుకోలేదు! ఎముకలు విరిగాయి.. లెక్క చేయలేదు! శిక్షణ, పోటీలకు రూ.కోట్లు ఖర్చవుతున్నాయి.. భరిస్తున్నాడు! ఆ పట్టుదలే బాలాజీని 22 ఏళ్ల వయసులోనే ‘యంగెస్ట్‌ హార్స్‌రైడర్‌ జంపింగ్‌ ఛాంపియన్‌’ని చేసింది.

బాలాజీది బెంగళూరు. చిన్నప్పట్నుంచే గుర్రాలంటే మక్కువ. అవి ఎక్కడ కనిపించినా.. ఆగిపోయి వాటి నడకలు, పరుగులకు మురిసిపోయేవాడు. అతడి ఆసక్తి గమనించి, తల్లిదండ్రులు ఓ రైడింగ్‌ స్కూల్లో చేర్పించారు. మురిపెం తీరాక చదువుపై దృష్టి పెడతాడు అనుకున్నారు. కానీ అక్కడితో ఆగిపోలేదు బాలాజీ. పట్టుబట్టి బెంగళూరులోని ఎంబసీ ఇంటర్నేషనల్‌ రైడింగ్‌ స్కూల్‌లో చేరి మరింతగా రాటుదేలిపోయాడు. 16వ ఏట నుంచే పోటీల్లో పాల్గొనడం ప్రారంభించాడు. ఈ ఏడేళ్లలో పదులసార్లు జాతీయ స్థాయిలో, నాలుగు సార్లు అంతర్జాతీయ పతకాలు నెగ్గాడు. మూడుసార్లు నేషనల్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. కేవలం ఆటగాడిగానే కాదు.. తనకున్న అనుభవంతో వివిధ హార్స్‌రైడింగ్‌ పోటీల న్యాయనిర్ణేతగానూ వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం తను దేశంలోనే అత్యంత పిన్నవయస్కుడైన జడ్జ్‌గా మన్ననలు అందుకుంటున్నాడు. ఔత్సాహికుల కోసం బెంగళూరులో ఓ శిక్షణాసంస్థ సైతం ప్రారంభించాడు. బాలాజీ శిష్యులు కొంతమంది జాతీయస్థాయి పోటీల్లోనూ పతకాలు గెల్చుకోవడం విశేషం.
‘హార్స్‌ రైడింగ్‌ ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో.. అంత ప్రమాదకరం’ అంటాడు బాలాజీ. రైడింగ్‌ నేర్చుకునే సమయంలో చాలాసార్లు కిందపడి అతడికి దెబ్బలు తగిలాయి. ఐదారుసార్లు ఎముకలు విరిగాయి. అయినా ఆటపై మమకారం వీడలేదు. పైగా ఈక్వెస్ట్రియన్‌గా పిలిచే ఈ ఆట, ఖర్చుతో కూడుకున్నది. పోటీలో నెగ్గాలంటే నాణ్యమైన మేలుజాతి గుర్రాలు కావాలి. వాటి ధర లక్షల్లోనే ఉంటుంది. అందులోనూ పది గుర్రాలని ఫ్రాన్స్‌, జర్మనీల నుంచి తెప్పించాడు. వీటితో పోటీల్లో పాల్గొనడమే కాదు.. తన దగ్గర శిక్షణ తీసుకుంటున్నవారికి సైతం అందిస్తున్నాడు. నిజానికి ఈక్వెస్ట్రియన్‌ చాలా ఖరీదైన ఆట. స్పాన్సర్లు దొరకడం కష్టం. ప్రభుత్వం నుంచి సాయం అందదు. అందుకే మన దేశంలోని ప్రతిభావంతులైన రైడర్లు ఇతర దేశాల తరఫున పాల్గొంటున్నారు. ‘ఎంత ఖర్చైనా.. నేను మాత్రం భారత్‌కే ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నా. గత ఒలింపిక్స్‌లో మన దేశం పాల్గొంది. పతకాలు రాకున్నా మంచి ప్రదర్శన ఇచ్చారు మన క్రీడాకారులు. గుర్రాలు మనుషుల్ని బాగా అర్థం చేసుకుంటాయి. రైడింగ్‌, జంపింగ్‌, పోటీ సమయాల్లో.. కాళ్ల ద్వారా తాకే స్పర్శని అవి అర్థం చేసుకొని రైడర్‌ చెప్పిన విధంగా నడుచుకుంటాయి. వాటిని మనకు అనుకూలంగా మలచుకోగలిగితే సగం విజయం సాధించినట్టే’ అంటున్నాడు బాలాజీ. 

జి.జగదీశ్వరి, బెంగళూరు


* 2011లో జూనియర్‌ విభాగంలో ఎఫ్‌ఈఐ ఇంటర్నేషనల్‌ జంపింగ్‌ ఛాంపియన్‌షిప్‌.
* 2012, 2014 సంవత్సరాల్లో జూనియర్‌ నేషనల్‌ ఈక్వెస్ట్రియన్‌ ఛాంపియన్‌షిప్‌. బెస్ట్‌ రైడర్‌గా ఎంపిక.
* 2013లో ఎఫ్‌ఈఐ వరల్డ్‌ ఛాలెంజ్‌ డ్రెస్సేజ్‌లో మొదటిస్థానం.
* 2015లో నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ డ్రెస్సేజ్‌.
* తైవాన్‌లో 2016లో జరిగిన సీడీఐ ‘వై’ పోటీల్లో జట్టుతో కలిసి కాంస్యం.
* 2017లో నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ జంపింగ్‌లో స్వర్ణపతకం.
* 2021 నేషనల్‌ ఈక్వెస్ట్రియన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు