Kaviya Maran: మైదానం వెలుపలా..ఐపీఎల్‌ మెరుపుల్‌!

ఉత్కంఠభరిత మ్యాచ్‌లు, సిక్సరపిడుగుల విన్యాసాలతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఊపేస్తోంది. అది సరే.. మైదానంలోనే కాదు.. గ్రౌండ్‌ వెలుపలా, ప్రేక్షకుల గ్యాలరీల్లోనూ యువతని ఆకట్టుకునేలా సరికొత్త ట్రెండ్‌లు, విన్యాసాలు.. సందడి చేస్తున్నాయి.

Published : 15 Apr 2023 00:02 IST

ఉత్కంఠభరిత మ్యాచ్‌లు, సిక్సరపిడుగుల విన్యాసాలతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఊపేస్తోంది. అది సరే.. మైదానంలోనే కాదు.. గ్రౌండ్‌ వెలుపలా, ప్రేక్షకుల గ్యాలరీల్లోనూ యువతని ఆకట్టుకునేలా సరికొత్త ట్రెండ్‌లు, విన్యాసాలు.. సందడి చేస్తున్నాయి. అందులో బాగా ఆకట్టుకుంటున్నవి కొన్ని.

మీమ్స్‌ క్వీన్‌ కావ్య: ఆటగాళ్లకే కాదు.. మ్యాచ్‌లు చూసే ప్రేక్షకులకూ భావావేశాలు ఎక్కువగానే ఉంటాయి. మన జట్టు గెలిస్తే ఉత్సాహంతో చెలరేగిపోతాం. ఓడిపోతే ఉసూరుమంటాం. ఉత్కంఠగా సాగుతుంటే ఊపిరి బిగపట్టి చూస్తాం. కావ్య మారన్‌ సైతం అలాగే స్పందిస్తోంది. అయితే తను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహయజమాని, పైగా అందగత్తె కాబట్టి ఆ అమ్మడి ప్రతి భావోద్వేగాన్ని జూమ్‌ చేసి మరీ చూపిస్తున్నాయి కెమెరాలు. మరి వాటిని చూసి మన కుర్ర జనం ఊరుకుంటారా? ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కి సరదా వ్యాఖ్యలు జోడించి మీమ్స్‌ చేస్తున్నారు. ‘ఆహా.. ఏమా ఎక్స్‌ప్రెషన్స్‌.. టాప్‌ హీరోయిన్లూ ఈమె ముందు దిగదుడుపే’ అని ఒకరంటే.. ‘అంతటి ఆ అందాన్ని హింసించకండి బాస్‌.. ఆమె కోసమైనా మ్యాచ్‌ నెగ్గండి’ అని మరొకరు వేడుకుంటున్నారు. మొదట్లో.. ఐపీఎల్‌లో క్రీడాకారుల వేలం సందర్భంగా తెరపై అరుదుగా కనిపించి ‘మిస్టరీ గర్ల్‌’ అనిపించుకున్న కావ్య పాప.. ఈ సీజన్‌లో మీమ్స్‌ క్వీన్‌గా కుర్రకారు సెల్‌ఫోన్లలో వైరల్‌ అవుతోంది.

స్టెప్పులు ఆగట్లేదు: రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు యుజువేంద్ర చాహల్‌ తన స్పిన్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లను బోల్తా కొట్టిస్తుంటే.. అతగాడి భార్య ధనశ్రీ ఫ్యాషన్‌ సొగసులతో మాయ చేస్తోంది. ప్రేక్షకుల గ్యాలరీలో, డ్రెస్సింగ్‌ రూమ్‌లో, ఇన్‌స్టా వేదికలో సూపర్‌మోడల్‌ని తలపిస్తోంది. ముఖ్యంగా తను బ్లాక్‌ మినీ టాప్‌, షార్ట్‌ కాటన్‌ జాకెట్‌, సెమీ ఫార్మల్‌ ఔట్‌ఫిట్‌, యెల్లో ఫ్రాక్‌లో పంచుకున్న చిత్రాలు ఈ ఐపీఎల్‌ సీజన్‌లో వైరల్‌గా మారాయి. అన్నట్టు ఈ అమ్మడు మంచి డ్యాన్సర్‌ కూడా. గతంలో జట్టు సభ్యులతో కలిసి సరదాగా డ్యాన్స్‌లు నేర్పిస్తున్న వీడియోలు తాజాగా మళ్లీ అంతర్జాలంలో షికారు చేస్తున్నాయి. ధనశ్రీ అంత కాకపోయినా చాహల్‌ సైతం మంచి డ్యాన్సరే. టీమ్మేట్‌ జో రూట్‌కి జట్టులోకి స్వాగతం పలుకుతూ చేసిన డ్యాన్స్‌ వీడియో సైతం అభిమానులను ఆకట్టుకుంది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం విరాట్‌ కోహ్లి, షారుక్‌ఖాన్‌లు కలిసి వేసిన ‘పఠాన్‌’ స్టెప్పులూ అలరించాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని