పవళింపు వేళాయే..!

ఎవరైనా ప్రకృతి అందాల్ని ఆస్వాదించాలని పర్యటనలు చేస్తారు... కుర్రాళ్లైతే ప్రతి క్షణం చిల్‌ అయిపోవడానికి కొత్త ప్రదేశాలకు వెళ్తారు... కానీ ముసుగు తన్ని.. కునుకు తీయడానికే టూర్లకు వెళ్లే వాళ్లుంటారా? లేకేం.. ఇప్పుడిదే జోరందుకుంటున్న ట్రెండ్‌.

Updated : 04 Feb 2023 02:25 IST

స్లీప్‌ టూరిజానికి యువత సై

ఎవరైనా ప్రకృతి అందాల్ని ఆస్వాదించాలని పర్యటనలు చేస్తారు... కుర్రాళ్లైతే ప్రతి క్షణం చిల్‌ అయిపోవడానికి కొత్త ప్రదేశాలకు వెళ్తారు... కానీ ముసుగు తన్ని.. కునుకు తీయడానికే టూర్లకు వెళ్లే వాళ్లుంటారా? లేకేం.. ఇప్పుడిదే జోరందుకుంటున్న ట్రెండ్‌. దీన్నే ‘స్లీప్‌ టూరిజం’ అంటున్నారు. దీనికి మహరాజ పోషకులు యువతే మరి!

సామాను సర్దేసుకొని.. బ్యాగులు భుజానికి తగిలించేసుకొని.. వాహనం ఎక్కేసి కుర్రకారు జామ్మంటూ దూసుకెళ్తున్నారంటే.. ఏ గోవా టూర్‌కో.. పట్టాయా ట్రిప్‌కో వెళ్తున్నారు అనుకుంటారంతా. కానీ నేటితరం యాత్రికులు కొందరు ఏం చేస్తున్నారు? చుట్టుపక్కల ప్రాంతాలను అలా అలా టచ్‌ చేసి నేరుగా హోటల్‌ రూమ్‌కి వెళ్లిపోతున్నారు. పడకని శుభ్రంగా సర్దేసుకుంటున్నారు. పరదాలు బిగిస్తున్నారు. ముసుగు తన్ని పడుకొని గురక పెట్టేస్తున్నారు. పనిలో పనిగా డోరుకి ‘డునాట్‌ డిస్ట్రబ్‌’ అని బోర్డూ తగిలిస్తున్నారు. ఇదే  స్లీప్‌ టూరిజం’ లేదా ‘స్లీప్‌ ట్రావెల్‌’.

నిద్ర కోసం ఎక్కడికో వెళ్లాలా?

ప్రయాణం, వసతికి వేలు, లక్షలు తగిలెయ్యాలా? అని తేలిగ్గా తీసేయకండి బాస్‌. మానసిక ప్రశాంతత కోసం ఎంత దూరం వెళ్లడానికైనా ఈతరం సిద్ధం. సుఖ నిద్ర కోసం ఎంతైనా వెచ్చిస్తామంటున్నారు. అయితే నిద్రకు అంత సీన్‌ ఉందా? అంటే.. నిత్యం బాస్‌తో చీవాట్లు తింటూ.. కలలోనూ పనే అంటూ కలవరించే ఓ యువోద్యోగిని అడిగి చూడండి. వాళ్లకు అది ఎంత ముఖ్యమో చెబుతారు. మార్కుల ఒత్తిడితో సతమతమయ్యే ఓ కాలేజీ అమ్మాయిని పలకరించండి.. ఆమెకు కునుకు ఎంత అమూల్యమో సెలవిస్తుంది. ఇదీగాక ఆరోగ్యం, ప్రశాంతత కోరుకునే వారికి కంటి నిండా కునుకుండాలని వైద్యులు చెబుతూనే ఉన్నారుగా.

ఈ ట్రెండ్‌ ఎప్పుడు? ఎలా? మొదలైంది అంటే కొవిడ్‌ కల్లోలం రోజుల్లోనే అని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల్లో కొందరిని కోల్పోవడంతో జనమంతా ఆ సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన మాట వాస్తవం. యువత విషయానికొస్తే చదువు, ఉద్యోగాల ఒత్తిడి.. అసహజ పనివేళలు, జీవనశైలి మార్పులతో కంటికి తగినంత విశ్రాంతి లేకుండా పోతోంది. ఈ ఉరుకుల పరుగుల జీవితాల నుంచి కొద్దిరోజులైనా దూరంగా పారిపోవాలనుకునే వారు స్లీప్‌ టూరిజం బాట పట్టడం మొదలుపెట్టారు. ఇలాంటి వాళ్లని ఆకట్టుకోవడానికి హోటళ్ల నిర్వాహకులు సైతం బాగానే కసరత్తులు చేస్తున్నారు. యాత్రికుల నిద్రకు ఏమాత్రం ఆటంకం కలగకుండా గదుల్లో సౌండ్‌ప్రూఫ్‌ పరికరాలు బిగిస్తున్నారు. విదేశాల్లో కొన్ని హోటళ్లలో అయితే రిస్టోరేటివ్‌ స్లీప్‌ సూట్‌లంటూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. లండన్‌లోని జెడ్‌వెల్‌ అనే హోటల్‌ని పూర్తిగా నిద్రా యాత్రికుల కోసమే కేటాయించారు. స్విట్జర్లాండ్‌లోని మాండేరియన్‌ ఓరియెంటల్‌ అనే హోటల్‌లో తరచూ నిద్ర బాగా పోవడమెలాగో చెప్పే స్లీప్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తున్నారు.

రెండున్నర ఏళ్ల కిందట పాశ్చాత్య దేశాల్లో మొదలైన ఈ ట్రెండ్‌ ఇండియాదాకా వచ్చేసింది. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో ఉన్న బెల్గాడియా ప్యాలెస్‌లో యాత్రికుల కోసం ప్రత్యేకమైన దిండ్లు, పరుపులు తయారు చేయించి అమర్చారు. ఈ గదులకు స్లీప్‌ బొటిక్స్‌ అని పేరు పెట్టారు. భోపాల్‌లోని జెహాన్‌ నుమా హోటల్స్‌ అయితే ఏకంగా తమ వినియోగదారుల సుఖ నిద్ర కోసం ‘పిల్లో మెనూ’ సిద్ధం చేసింది. మైక్రోఫైబర్‌, మెమరీ ఫోమ్‌, బక్‌వీట్‌ హల్‌, సిలికాన్‌ ఫైబర్‌ పిల్లో, ఫెదర్‌ పిల్లోలంటూ కావాల్సినవి అందిస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఉండే ట్రీహౌజ్‌ కాటేజీలు.. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో ఏర్పాటైన రిసార్టులు సైతం ట్రెండ్‌కి అనువైన వాతావరణం కల్పిస్తున్నాయి. వేసవి సమీపిస్తున్న తరుణంలో ఈ ట్రెండ్‌ వేగం అందుకునే అవకాశం ఉందంటున్నారు టూర్‌ ఆపరేటర్లు.

నీల్సన్‌ సంస్థ దేశంలోని 25 నగరాల్లో 5,600 మందితో ఒక అధ్యయనం చేయగా 53 శాతం మంది నిద్రకు సంబంధించి ఏదో ఒక సమస్యలతో బాధ పడుతున్నామని చెప్పారు. దీని కారణంగా స్లీప్‌ థెరపీ ఆవశ్యకత పెరుగుతోందంటున్నారు గురుగ్రామ్‌కి చెందిన స్లీప్‌ మెడిసిన్‌ పల్మనాలజిస్ట్‌ అరుణేష్‌ కుమార్‌. వెరసి ఈ సమస్యకు పరిష్కారంగా స్లీప్‌ టూరిజం భావన అధికమైందని, ఇది ఏడాదికి ఇరవై శాతం చొప్పున వృద్ధి చెందుతోందంటున్నారు.

యువతే ఎక్కువ

సాధారణంగా టూరిస్టుల్లో అత్యధికులు యువతే. వాళ్లు ఎక్కడినుంచో వస్తారు. హోటళ్లలో బస చేస్తారు. ఇప్పుడు వాళ్ల అభిరుచిలోనూ కొంత మార్పు కనిపిస్తోంది. చుట్టుపక్కల ప్రదేశాలను సందర్శించడానికి ఎలా ఇష్టపడుతున్నారో.. పడకపై సేద తీరడానికీ అంతే ఇష్టపడుతున్నారు. పని ఒత్తిడి ఉండే ఐటీ, కార్పొరేట్‌, మార్కెటింగ్‌ రంగాల్లోని ఉద్యోగులు.. నిద్రలేమి సమస్య ఉన్నవారు, చదువులతో విసుగెత్తిన కాలేజీ విద్యార్థులు.. ఈ ధోరణివైపు మొగ్గు చూపుతున్నారు.
రెబెక్కా ఎస్‌.రాబిన్స్‌,స్లీప్‌ ఫర్‌ సక్సెస్‌ రచయిత్రి


కునుకుకి అనువైన కేంద్రాలు

అలెప్పీ (కేరళ): ప్రశాంతమైన కొబ్బరి తోటలు, వెనక్కొచ్చిన సముద్ర జలాల్లో హౌజ్‌బోట్‌లో విహరిస్తూ హాయిగా కునుకు తీయొచ్చు ఇక్కడ.

నాకో (హిమాచల్‌ ప్రదేశ్‌): పచ్చదనం, ప్రకృతి అందాలకు నిలయం ఈ ప్రదేశం. పర్వత సానువుల్లో ఉన్న ఇక్కడ సేద తీరుతుంటే ఆటోమేటిగ్గా కళ్లు మూతలు పడతాయి. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే.. ఎవరైనా చిన్న శబ్దం చేసినా కిలోమీటరు దూరం వరకు వినిపిస్తుందట.

లేహ్‌ (లద్దాఖ్‌): ప్రతి పర్యాటకుడి దర్శనీయ స్థలాల జాబితాలో తప్పకుండా ఉండే ప్రదేశం ఇది. రానున్న వేసవిలో నిద్రాదేవి ఒడిలో సేద తీరాలంటే ఇదో మంచి ఎంపిక.

దువార్స్‌ (పశ్చిమ్‌బంగా): దట్టమైన పచ్చని అడవి.. అక్కడక్కడా విడిది కేంద్రాలు.. తేయాకు తోటలు.. ఇంత ప్రశాంతత కోరుకునే కుర్రకారుకు ఇంతకుమించిన విడిది ఏముంటుంది?

పాంగాంగ్‌ (లద్దాఖ్‌): చుట్టూ కొండలు.. మధ్యలో సెలయేళ్ల అందాలు.. విడిది కేంద్రాలతో అలరారే ఈ ప్రాంతంలో స్లీప్‌ టూరిజం ఊపందుకుంటోంది.

డ్జోకౌవ్యాలీ (నాగాలాండ్‌): పచ్చిక బయళ్లతో, దట్టమైన అడవులు, ప్రకృతి అందాలతో అలరారే ఊరు డ్జోకౌ వ్యాలీ. వసతి కేంద్రాలు తక్కువే అయినా ప్రశాంతతకు నిలయం.

ఈ ధోరణి పెరుగుతోంది

పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మానసిక ప్రశాంతత కోసం తరచూ టూర్లకు వెళ్లడం నాకు అలవాటు. డార్జిలింగ్‌, సిమ్లా, కేరళ, తమిళనాడు.. ఇలా చాలా తిరిగా. ప్రతిచోటా అందమైన ప్రదేశాలను కెమెరాలో బంధించడం నాకలవాటు. తర్వాత నా ప్రాధాన్యం సుఖనిద్రకే. దానికి అనువైన వాతావరణం ఉన్న ప్రాంతాలకే వెళ్తుంటా. ఈమధ్యే మొదలైన స్లీప్‌ టూరిజం భావన భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశముంది.
సాయిమాధవ్‌, గుంటూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని