Chandrababu: గ్రీజే పెట్టలేరు!

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగి గ్రామాలు కొట్టుకుపోయాయన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వ్యాఖ్యలపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండు చేశారు. ఈ ప్రాజెక్టు

Updated : 05 Dec 2021 06:32 IST

అన్నమయ్య ప్రాజెక్టు గేటుకు ఏడాదైనా మరమ్మతులు చేయించలేదు

షెకావత్‌ వ్యాఖ్యలకు సీఎం సమాధానం చెప్పాలి

సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి

చంద్రబాబు డిమాండ్‌

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ వైఫల్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగి గ్రామాలు కొట్టుకుపోయాయన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వ్యాఖ్యలపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండు చేశారు. ఈ ప్రాజెక్టు గేటుకు గ్రీజు వేయలేని, ఏడాదైనా మరమ్మతు చేయించలేని.. ఈ ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతారంట అని విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఒకరిని చంపితే హత్యాయత్నం కేసు పెడతారు.. అన్నమయ్య ప్రాజెక్టులో 45 మందిని బలిగొంటే మీ మీద కేసుల్లేవా? 

చట్టపరమైన చర్యల్లేవా?’ అని నిలదీశారు. ‘సీఎం చేతగానితనం కారణంగానే వరదల వల్ల రూ.6వేల కోట్ల ఆస్తి నష్టం, 62 మంది ప్రాణాలు పోయాయి. ఇందుకు ఆయనే బాధ్యుడు. ఆయన్ను రాజీనామా చేయమన్నా.. పదవికి అర్హత లేదన్నా అవి తక్కువ మాటలే...’ అని మండిపడ్డారు. సమగ్ర న్యాయవిచారణ చేయించాలని, మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున చెల్లించాలని, ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండు చేశారు.

కేంద్ర మంత్రి షెకావత్‌కే ఏం తెలియదంటారా?

అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర మంత్రి షెకావత్‌ వివరాలు వెల్లడిస్తే...‘ముంచేసింది కాక.. సిగ్గులేకుండా ఎదురుదాడికి దిగుతారా? ఆయనకు ఏమీ తెలియదంటారా...’ అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? మీపై కేసులు ఉండవా?’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి షెకావత్‌ రాజ్యసభలో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను ప్రదర్శించారు.అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... తిరుపతిలో తుమ్మలగుంట చెరువును స్టేడియంగా మార్చడంతో వరద ప్రవాహం పద్మావతి విశ్వవిద్యాలయం, రైల్వేస్టేషన్‌ దిగువ భాగంలో ప్రవహించడంతో 14 అడుగుల ఎత్తులో నీరు నిలిచిందని చెప్పారు. రాయలచెరువు లీకేజీని అరికట్టడంలో నిర్లక్ష్యం చేశారన్నారు. నెల్లూరు జిల్లా పెన్నానదిలో ఇసుక తవ్వకాల కారణంగా పొర్లు కట్టలు బలహీనపడడంతో రూ.2వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని, వేల కుటుంబాలు తమ సర్వస్వాన్ని కోల్పోయాయని చెప్పారు. సీఎం ఇప్పుడొచ్చి పొర్లుకట్ట కోసం వంద కోట్లు ఖర్చు పెడతామని, తానొచ్చి శంకుస్థాపన చేస్తానంటున్నారన్నారు. శ్మశానానికి శంకుస్థాపన చేస్తారా అని చంద్రబాబు నిలదీశారు.

వీసీని చూస్తే జాలేస్తోంది

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతిని చూస్తే జాలేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఎందుకు ఆ పదవి? రాజీనామా చేసి ఇంటికి పోయిండొచ్చు.. వేధింపులతో కళ్లనీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉంది. ఆయనో అసమర్థ వ్యక్తిగా మిగిలిపోతారు. జీవితాంతం అంతర్మథనం చెందుతారు...’ అని చెప్పారు. ‘ఉద్యోగులు పైసా, పైసాగా దాచుకున్న వాటితో పాటు విద్యార్థుల సొమ్ము తదితరాలు కలిపి రూ.400 కోట్లు ఉంటే వాటిపైనా కన్నేస్తారా?’ అని నిలదీశారు.


సీఎం జగన్‌ కడప పర్యటన సందర్భంగా వరద బాధితులను అధికారులతో భయపెట్టించి.. పోలీసు కేసులు పెడతామని బెదిరించి.. బయటకు రాకుండా చేశారు. బాధితుల కంటే ఎక్కువ మంది పోలీసులను మోహరించారు. ఇది ఓదార్పు అవుతుందా? పరామర్శకు వెళ్లిన సీఎంతో ఒక ముసలావిడ నవ్వుతూ మాట్లాడుతోంది.. అంతా బాగుందంటూ వరదను స్వాగతించింది. ఎక్కడైనా ఇలా జరుగుతుందా? 62 మంది చనిపోతే ఆ బాధ అక్కడి వారిలో ఉండదా? బయట నుంచి జనాలను తెచ్చారు. అదీ జగన్‌ మార్కు రాజకీయం.

- విలేకరుల సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం


ఉన్నట్టుండి అన్ని నీళ్లు పడితే ఇంకేంది బతికేది

అన్నమయ్య ప్రాజెక్టు వరద గ్రామాలపైకి వస్తున్న సమయంలో స్థానికులు తీవ్ర ఆందోళనతో మాట్లాడుకున్న వీడియోలను చంద్రబాబు ప్రదర్శించారు. అందులో ఒక వీడియోలో... ‘నరసింహా.. పాయె నరసింహా? ఇల్లు ఒక్కటుండదు.. ఇల్లు పోయింది (రెండు సెకన్లలోనే).. ఉన్నట్టుండి అన్ని నీళ్లు పడితే ఇంకేంది బతికేది.. ఆవులు చచ్చిపోతాయి నరసింహా?’ అని ఒక బాధితుడు తన ఆందోళనను వ్యక్తం చేశారు. ‘చెయ్యేరులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతారు. దాని కోసం నదిలోకి లారీలు వెళ్తాయి. గేట్లు ఎత్తితే అవి వరదలో చిక్కుకుపోతాయనే ఉద్దేశంతోనే అవి బయటకు వచ్చే వరకు డ్యాం గేట్లు ఎత్తనీయకుండా ఆపారు...’ అని మరికొందరు ఆరోపించారు. వరదల అనంతరం ఎగువమందపల్లికి చెందిన వెంకటసుబ్రమణ్యం  మాట్లాడుతూ...‘‘సార్‌, గేట్లు ఎత్తమని.. ఏఈ, డీఈని ఫోన్‌ చేసి అదే పనిగా అడిగాం. ఇబ్బంది పడతామని వారికి చెప్పినా ‘నాకు తెలుసు.. నాకు తెలుస’ని అన్నారు ఇసుక రవాణాకు వందకు పైగా లారీలు ఉన్నాయి. నీరు విడుదల చేస్తే అవి కొట్టుకుపోతాయనే ఇలా చేశారు..’’ అని పేర్కొన్న వీడియోను ప్రదర్శించారు.  కొన్ని సంఘటనలను చంద్రబాబు వివరిస్తూ... ‘ముందస్తు హెచ్చరికల్లేకుండా నీటిని విడుదల చేయడంతో ఒక పూజారి కుటుంబంలో అతడి కళ్ల ముందే తొమ్మిది మంది చనిపోయారు. అదే గ్రామంలో ఒక యువకుడు ఇంటి సీలింగ్‌కు ఉండే ఇనుప కొక్కీని ముప్పావు గంట నుంచి గంట వరకు పట్టుకొని... తొమ్మిది మందిని తన భుజం, కాళ్లపై ఎక్కించుకున్నారు. వారిలో ఇద్దరు శ్వాస ఆడక.. ఆయన భుజంపైనే చనిపోయి కిందపడిపోయారు. ఏడుగురిని కాపాడగలిగారు. ఆయన ధైర్యం, సమయస్ఫూర్తి, వారి ప్రాణాల్ని కాపాడింది. ఒక గ్రామ సర్పంచి.. వరదొస్తోందని బయటికొచ్చి ఊరంతా చెప్పారు. ఆయన ఇంట్లోకి నీరొచ్చేసింది. ఇంటికొచ్చి చూసేసరికి ముగ్గురు కొట్టుకుపోయారు....’ అని పేర్కొన్నారు.

‘చచ్చిపోతున్నాం.. ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలి..?

‘చచ్చిపోతున్నాం.. ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలి..? ఎందుకు మాకీ బాధలు ఎందుకు?’ అంటూ ఓటీఎస్‌ చెల్లింపులపై ఒక మహిళ కన్నీటి పర్యంతమవుతూ... తీవ్ర ఆవేదనతో మాట్లాడుతున్న వీడియోను చంద్రబాబు ప్రదర్శించారు. దీనిపై ముఖ్యమంత్రి, సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని