AP News: డిగ్రీలో తెలుగుమాధ్యమం ఉండదు

రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరం నుంచి తెలుగు మాధ్యమం మూతపడనుంది. ఇక నుంచి విద్యార్థులు తెలుగులో చదివే అవకాశం కోల్పోనున్నారు. కళాశాలలన్నీ పూర్తిగా ఆంగ్ల

Updated : 15 Jun 2021 07:23 IST

65 వేల మంది విద్యార్థులపై ప్రభావం
2021-22 నుంచి ఆంగ్లంలో కోర్సుల నిర్వహణ!

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరం నుంచి తెలుగు మాధ్యమం మూతపడనుంది. ఇక నుంచి విద్యార్థులు తెలుగులో చదివే అవకాశం కోల్పోనున్నారు. కళాశాలలన్నీ పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మారిపోనున్నాయి. ఉన్నత విద్యపై ఫిబ్రవరి 2న సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కళాశాలలు ఆంగ్ల మాధ్యమంలోనే కోర్సులను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటన విడుదల చేసింది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ఆంగ్లంలో నిర్వహిస్తేనే ఆమోదించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తెలుగు మాధ్యమంలో కోర్సులు నిర్వహిస్తున్న ప్రైవేటు కళాశాలలు మాధ్యమం మార్పునకు ఈ నెల 18 నుంచి 28 వరకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది. ప్రతిపాదనలు సమర్పించకపోతే కళాశాలలు కోర్సులను నిర్వహించేందుకు వీలుండదని పేర్కొంది.
65 వేల మందిపై ప్రభావం..
రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం అమల్లో రావడం... తెలుగులో చదివే 65,981 మంది విద్యార్థులపై ప్రభావం చూపనుంది. గతేడాది నిర్వహించిన ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో 1,336 డిగ్రీ కళాశాలల్లో 2.60 లక్షల మంది చేరారు. వీరిలో 65 వేల మంది తెలుగు మాధ్యమాన్ని ఎంచుకున్నారు. వీరిలో బీఎస్సీ కోర్సును ఎంపిక చేసుకున్నవారు అధికం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా తెలుగు మాధ్యమంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఆంగ్లం ఒక్కటే అమలు చేస్తే వీరు తెలుగులో చదివే అవకాశాన్ని కోల్పోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని