వ్యాపార ధోరణికే ప్రాధాన్యమా?

తిరుమల శ్రీవారి సేవల విషయంలో తితిదే తీరును హైకోర్టు ఆక్షేపించింది. శ్రీవేంకటేశ్వరస్వామి వారి మేల్‌ఛాట్‌ వస్త్రసేవ, ఆర్జితసేవల కోసం 14 ఏళ్ల కిందట భక్తులు బుక్‌ చేసుకున్న

Updated : 25 Sep 2022 06:44 IST

14 ఏళ్ల కిందట బుక్‌ చేసుకున్న టికెట్లను రద్దు చేస్తారా?

తితిదే తీరుపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ

మేల్‌ఛాట్‌ వస్త్ర, ఆర్జిత సేవల నిరాకరణపై ఆగ్రహం

పిటిషనర్లకు సేవల భాగ్యం కల్పించాలని ఆదేశం

ఈనాడు, అమరావతి: తిరుమల శ్రీవారి సేవల విషయంలో తితిదే తీరును హైకోర్టు ఆక్షేపించింది. శ్రీవేంకటేశ్వరస్వామి వారి మేల్‌ఛాట్‌ వస్త్రసేవ, ఆర్జితసేవల కోసం 14 ఏళ్ల కిందట భక్తులు బుక్‌ చేసుకున్న టికెట్లను కొవిడ్‌ సాకుతో రద్దుచేయడాన్ని తప్పుపట్టింది. ‘గతంలో టికెట్లు పొందిన భక్తులకు కొవిడ్‌ తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పాడ్డాక ఆర్జిత సేవలు కల్పిస్తే.. దేవస్థానం కొత్తగా, అధికంగా ఆదాయం పొందలేదు. అందుకే.. కొత్తవారికి అవకాశం కల్పిస్తూ వారి నుంచి భారీగా సొమ్ము వసూలు చేస్తోంది. ఇలాంటి వ్యవహార శైలి.. భక్తుల భావోద్వేగాలను సొమ్ము చేసుకోవడమే. వ్యాపార ధోరణికే దేవస్థానం ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది’ అని ఆక్షేపించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

* శ్రీవారి మేల్‌ ఛాట్‌ వస్త్రసేవ నిమిత్తం 2007 జులైలో ఈ-టికెట్‌ బుక్‌ చేసుకున్న తనకు 2021 డిసెంబరు 17న కల్పించిన సేవను కొవిడ్‌ను కారణంగా చూపుతూ తితిదే రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ భక్తుడు ఆర్‌.ప్రభాకరరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సుప్రభాతం, తదితర సేవలకు బుక్‌ చేసుకున్న టికెట్లను రద్దు చేశారని మరికొందరు వ్యాజ్యాలు వేశారు. బ్రేక్‌ దర్శనం, ఆర్జిత సేవల టికెట్‌కు చెల్లించిన సొమ్మును వెనక్కి తీసుకోవాలని తితిదే కోరింది. తమ మనోభావాలను గౌరవించకుండా ఏకపక్షంగా సేవల టికెట్లను రద్దు చేసిందని  వ్యాజ్యం వేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఎం.విద్యాసాగర్‌, సీహెచ్‌ ధనుంజయ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘14 ఏళ్ల కిందట టికెట్‌ బుక్‌ చేసుకున్న భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు చట్టబద్ధంగా అర్హులు. సేవలు పునఃప్రారంభమయ్యాక ఒకటి రెండేళ్లలోపు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 17,490 మంది టికెట్‌ పొందితే 8,347 మందే బ్రేక్‌ దర్శనం పొందారు. 191 మందే టికెట్‌ సొమ్ము వెనక్కి ఇవ్వాలని కోరారు. పిటిషనర్లతో పాటు మిగిలిన వారు ఎలాంటి ఐచ్ఛికాన్ని తెలపలేదు’ అని పేర్కొన్నారు.

* తితిదే అధికారులు కౌంటర్‌ దాఖలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో స్వామివారి దర్శనాన్ని నిలిపేశామని, అప్పటికే టికెట్‌ బుక్‌ చేసుకున్న వారికి బ్రేక్‌ దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపామని వివరించారు. కొవిడ్‌ తగ్గాక, అప్పటికే వివిధ తేదీల్లో సేవలు టికెట్‌ బుక్‌ చేసుకున్న వారు ఉంటారని, పూర్వం బుక్‌ చేసుకున్న వారిని సర్దుబాటు చేయలేమని చెప్పారు. తమ నిర్ణయం సహేతుకమైనదేనని, వ్యాజ్యాలను కొట్టేయాలని కోరారు. ఇరువైపులా వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. తితిదే వాదనలను తప్పుపట్టారు. ఈ ఏడాది జూన్‌, జులై నెలల్లో ఆర్జిత సేవల టికెట్‌ బుక్‌ చేసుకోవాలని తితిదే మే నెలలో నోటిఫికేషన్‌ ఇచ్చిందని గుర్తుచేశారు. కొత్తగా బుక్‌ చేసుకున్న భక్తులకు అవకాశం కల్పిస్తూ.. గతంలో బుక్‌ చేసుకున్న వారికి సేవలు నిరాకరించడం అధికరణ 14ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. పిటిషనర్లు కోరుకున్నట్లు ఆర్జిత సేవ అందించేందుకు అనుమతి ఇవ్వాలని తితిదే అధికారులను ఆదేశించింది. పిటిషనర్లకు, తితిదే అధికారులకు అనుకూలమైన తేదీ, సమయాలను ముందుగా చర్చించి ఖరారు చేసుకోవాలని తెలిపింది. ఈ ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని