‘లేఅవుట్లలో 5% స్థలం’పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

పట్టణ ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారులు కొత్తగా వేసే లేఅవుట్లలో 5% స్థలాన్ని పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలన్న ఆదేశాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

Published : 26 Jan 2023 05:19 IST

జీవో 145 ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: పట్టణ ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారులు కొత్తగా వేసే లేఅవుట్లలో 5% స్థలాన్ని పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలన్న ఆదేశాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. స్థిరాస్తి వ్యాపారులు, ప్రజల నుంచి వచ్చిన వినతులపై సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ బుధవారం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు వ్యాపారులు వేసే లేఅవుట్లలో మొత్తం విస్తీర్ణంలో 5% స్థలాన్ని ఈడబ్ల్యూఎస్‌ గృహ నిర్మాణ ప్రాజెక్టుల కోసం కేటాయించాలని 2021 డిసెంబరు 6న ప్రభుత్వం జీవో 145 జారీ చేసింది. లేఅవుట్లలో స్థలాన్ని కేటాయించలేకుంటే... అక్కడికి 3 కి.మీ. దూరంలో అంతే విస్తీర్ణంలో స్థలాన్ని ఇవ్వొచ్చని వెసులుబాటు కల్పించింది. రెండూ సాధ్యం కానప్పుడు ప్రాథమిక విలువ ఆధారంగా లేఅవుట్‌లోని 5% స్థలానికి లెక్క కట్టి డబ్బు చెల్లించొచ్చనీ పేర్కొంది. స్థలాన్ని కేటాయించాలన్న ప్రభుత్వ ఆదేశంతో కొత్త లేఅవుట్ల ఏర్పాటుకు పట్టణాభివృద్ధి సంస్థలకు వచ్చే దరఖాస్తులు భారీగా తగ్గాయి. పట్టణ ప్రాంతాల్లో కొత్త లేఅవుట్ల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం 600 వరకు దరఖాస్తులు ఇచ్చేవి. జీవో జారీ చేశాక... వ్యాపారులు వెయ్యి ఎకరాలలోపే లేఅవుట్లకు అనుమతులు తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొందరు హైకోర్టులోనూ కేసులు వేశారు. మరికొందరు 5% స్థలం కేటాయింపు బెడద లేకుండా వైకాపా నేతల అండతో అనుమతులు తీసుకోకుండానే లేఅవుట్లు వేస్తున్నారు. పైగా ప్రభుత్వ నిర్ణయంతో కొత్త లేవుట్లకు అనుమతులిచ్చే సందర్భంలో వివిధ రుసుముల కింద రావాల్సిన ఆదాయాన్ని పట్టణాభివృద్ధి సంస్థలు కోల్పోతున్నాయి. ప్లాట్ల రిజిస్ట్రేషన్లు తగ్గడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయమూ పడిపోయింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు